విడిపోయాక ఏపీ ఉత్తర కొరియా – తెలంగాణ దక్షిణకొరియాలా అయ్యాయా?

By KTV Telugu On 15 September, 2023
image

KTV TELUGU :-

ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఏపీ , తెలంగాణ ఉత్తర, దక్షిణ కొరియాల్లా అయిపోయాయని చంద్రబాబునాయుడు తరచూ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులుచూస్తూంటే అది నిజమేనా అనే చర్చ ప్రజల్లో పెరుగుతోంది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాల గురించి మనం తరచూ వింటూటాం. రెండింటిలోనూ కొరియా పదం ఉంది. అంటే ఒక్క కొరియాకు దక్షిణం..ఉత్తరంగా విడిపోయాయి. ఎందుకు విడిపోయాయి.. ఎలా విడిపోయాయి.. వాటి చారిత్రక నేపధ్యం ఏమిటి అన్న సంగతి పక్కన పెడితే కానీ ఆ రెండు దేశాల మధ్య కనిపిస్తున్న స్పష్టమైన తేడాలు మాత్రం మన గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే… నిజంగానే కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు మన దేశంలో .. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. చైనా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడి ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రశ్రేణి దేశంగా దక్షిణ కొరియా ఎదిగింది. అదే సమయంలో ఒకప్పుడు కొరియాలో భాగం అయిన ఉత్తర కొరియా .. దక్షిణ కొరియాను ఆనుకునే ఉంటుంది. ఆ దేశం పేరు కూడా ప్రజల్లో నానుతూనే ఉంటుంది. కానీ దక్షిణ కొరియా తరహాలో ప్రపంచానికి ఉపయోగపడే బ్రాండ్లు.. ప్రజల జీవన విధానం, అభివృద్ధి వంటి విషయాల్లో కాదు. అక్కడి నియంత పాలకుడు వ్యవహరించే.. చేసే పిచ్చి చేష్టలతో వార్తల్లోకి వస్తుంది. అక్కడి ప్రజలు మూడు పూటలా తిండి తినే పరిస్థితుల్లో లేరు. ఎవరైనా ప్రభుత్వం చెప్పినట్లుగా చేయాల్సిందే. ప్రభుత్వం అంటే..నియంత పాలకుడు కిమ్ జోంగ్ మాత్రమే. చివరికి అక్కడి ప్రజలు తమకు నచ్చినట్లు హెయిర్ కట్స్ కూడా చేసుకోకూడదు. ఉత్తరకొరియాకు ప్రపంచంతో సంబంధం లేని టైమ్ జోన్, క్యాలెండర్ రెండూ ఉన్నాయి. ప్రపంచం అంతటికీ ఇప్పుడు 2023సంవత్సరం నడుస్తుంటే ఉత్తరకొరియాలో మాత్రం 109వ సంవత్సరం నడుస్తోంది. మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్-Il జయంతిని వీరు కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు.

ఉత్తరకొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అసలు బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం వీరికి లేదు. కారణం సమాచార వ్యవస్థను కిమ్ జాంగ్ తన గుప్పిట్లో బంధించడమే. ఇక్కడ కేవలం మూడు న్యూస్ చానెల్స్ కు మాత్రమే అనుమతి ఉంది. అవి కూడా ప్రభుత్వం నిర్దారించిన వార్తలనే ప్రసారం చేస్తాయి. నిబంధనలు అతిక్రమిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. హాలీవుడ్ సినిమాలు చూసినా మరణశిక్షలు తప్పవు. క్షమాభిక్ష అన్న పదం ఉత్తరకొరియా చరిత్రలో లేదు. నిబంధనలు అతిక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా శిక్షలు వేయడమే. అందుకే ఈ దేశంలో దాదాపు 3లక్షల మంది ప్రజలు జైళ్లలో బందీలుగా ఉన్నారు. ఇంత దుర్భరమైన పాలన అందిస్తున్న కిమ్ ను ప్రజలే ఎన్నుకుంటారు. నమ్ముతారో నమ్మరో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికల్లో మాత్రం ఒక్కరే నిలుచుంటారు. ప్రతీ ఇంట్లోను కిమ్ జాంగ్ పాలకుల ఫోటోలు తప్పనిసరిగా ఉండాలి. ఉత్తరకొరియా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక రేడియో ఛానెల్ నడుస్తుంటుంది. కాబట్టి ప్రతీ ఇంట్లోను విధిగా ఆ ఛానెల్ వార్తలను వినాలి.

దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల గురించి తెలుసుకున్న తర్వాత మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది తెలుగు రాష్ట్రాలే. అచ్చంగా ఆ రెండు దేశాల్లో జరుగుతున్నదే ఇక్కడ కూడా జరుగుతోంది కదా అనిపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారు. రాష్ట్రం ఎక్కడికి పోలేదు ప్రజలూ ఎక్కడికి పోలేదు. భూమి ..ప్రజలు అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. కానీ హద్దులు మాత్రం మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌గా.. తెంలగాణలాగా విడిపోయింది. ఇప్పటికి పదేళ్లు అయింది. . కానీ ఎప్పుడైతే ఏపీలో పాలకులు మారిపోయారో అప్పట్నుంచే అసలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలు కనిపించడం ప్రారంభమయ్యాయి.
పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణలో ముందు ఉంది. మొదటి ఐదేళ్లు చంద్రబాబు నాయకత్వంలో ఏపీ పోటీ పడింది. కియా సహా అనేక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో.. అప్పుడు ఏపీ లో సీన్ మారిపోయింది. తాజాగా చంద్రబాబు అరెస్ట్ ఉదంతం తర్వాత సామాన్య ప్రజల్లో అమ్మో ఏపీ అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు.

తెలంగాణ గత తొమ్మిదేళ్లుగా అభివృద్ది ప్రాధాన్యతాoశాల్లో దూసుకుపోతోంది. ఉపయోగమా లేదా అన్నది పక్కన పెడితే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకున్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళ డానికి పాలకులు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అక్కడ రాజకీయాలు లేవని కాదు..రాజకీయాలు ఉన్నాయి. కుట్రలు, కుతంత్రాల రాజకీయాలూ ఉన్నాయి. కానీ వారు తమ రాష్ట్రాన్ని నాశనం చేసుకోవడానికి కానీ.. ప్రజల జీవితాల్ని ప్రభావితం చేయడానికి కానీ ఎక్కడా ప్రయత్నించలేదు. ప్రజల జీవితాన్ని పాలనా నిర్ణయాల ప్రకారంగా బాగు చేసే ప్రయత్నం చేశారు.. వీలైనంతగా పారిశ్రామికాభివృద్దికి ప్రయత్నించి.. ప్రజలంతా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడానికి ప్రయత్నించారు. అందుకే తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రం అనే భావనకు వచ్చేలా చేస్తోంది. ప్రజల జీడీపీ పెరుగుతోంది. తెలంగాణ ఆయువు పట్టు హైదరాబాదే కావొచ్చు కానీ..మిగిలిన ప్రాంతాలు ఆ స్థాయిలో కాకపోయినా తెలంగాణ ప్రజలంతా జీవన ప్రమాణాల్ని పెంచుకుంటున్నారన్నది నిజం.

రెట్టింపు అయిన ధాన్యం ఉత్పత్తి.. మాత్రమే కాదు.. కరెంట్ వినియోగం అనూహ్యంగా పెరగడం కూా ప్రజల కొనుగోలు శక్తికి నిదర్శనం. ప్రభుత్వం కూడా ప్రజల్ని రాచి రంపాలన పెట్టాలని అనుకోలేదు. ఏదో విధంగా ఇంప్రెస్ చేయడానికే ప్రయత్నిస్తోంది. శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే విడిపోయిన తర్వాత తెలంగాణను చూస్తే ఎవరికైనా దక్షిణ కొరియా అనిపిస్తుంది. ఇలా అనిపించడానిక ప్రధాన కారణం.. ఏపీలో పరిస్థితులు. ఏపీ… ఉత్తర కొరియాలా పోలికలు రావడానికి అక్కడి పాలనా తీరే కారణం. ఉత్తర కొరియాలోలాగే ఏపీలో ప్రజలు కూడా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షలకు గురవుతారు. ప్రశ్నిస్తే దాడులకు గురవుతారు. వారే్ కేసులు పెట్టించుకోవాల్సి ఉంటుంది. పుంగనూరు, అంగళ్లులో వైసీపీ నేతలే దాడి చేసి.. టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. మొత్తం ఐదు వందలపై కేసులు పెట్టారంటే..కిమ్ ను మించిపోయినట్లే. ఉత్తర కొరియా జైళ్లలో ఐదు లక్షలు మగ్గిపోతున్నారని అంటారు.. ఏపీలో అంత కంటే ఎక్కువ మందిని జైళ్లలో పెట్టేయగలరు. కానీ న్యాయస్థానాలు కనికరిస్తూ ఉండటం వల్ల కొంత మంది బయటపడిపోయారు. వారు చూపించే టీవీ చానళ్లే చూడాలి. తాము చెప్పిందే నిజమని నమ్మాలి. ఉద్యోగాలు, పరిశ్రమల జాడే ఉండదు. ఇవన్నీ పోల్చుకుంటే.. ఎవరైనా నిజమేనని అనుకుంటారు.

క్రిమినల్ మైండ్ తో ఉన్న వారికి అవే ఆలోచనలు వస్తాయి. అలాంటి వారు పాలకులు అయితే పరిస్థితుల్ని అంచనా వేయడం కష్టం. ఉత్తరకొరియా కావొచ్చు.. అంతకు మించి కావొచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి