ఏపీ సిఐడీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబుపై రిమాండ్ రిపోర్ట్ సమర్పించి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిన ఏపీ సిఐడీ మరో కేసులో పీటీ వారంట్ జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పుల్లో భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని ఆరోపిస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో జైల్లో ఉన్న చంద్రబాబు నాయుణ్ని ఈ కేసులోనూ విచారించాలన్నది సిఐడీ డిమాండ్. ఈ కేసులోనే చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కు పిటిషన్ వేశారు.
ఈ రెండు కేసుల అతీ గతీ తేలకుండా ఏపీ సిఐడీ మరో కేసులో పీటీ వారంట్ తో ముందుకు వచ్చింది. ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని సిఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులోనూ చంద్రబాబు నాయుడే ప్రధాన నిందితుడని సిఐడీ అంటోంది. వీటి తర్వాత అమరావతి లో భూకుంభకోణం కేసులోనూ పీటీ వారంట్ జారీ చేయడానికి సిఐడీ సమాయత్త మవుతోంది. మొత్తం మీద ఆరేడు కేసుల్లో పీటీ వారంట్లు జారీ చేసి విచారణకు అడగాలని ఏపీ సిఐడీ పోలీసులు భావిస్తున్నారు. ఒకదాని తర్వాత ఇలా పీటీ వారంట్లు జారీ చేయడం అనేది కొత్తేమీ కాదు. చాలా కేసుల్లో ఉండేదే. అయితే వీటి విచారణకు ఒక్కో కేసుకి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం.
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతోనే టిడిపి లో గందరగోళం నెలకొంది. చుక్కాని లేని నావలా దిక్కలేని దీనలా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. దశాబ్ధాలుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వన్ మ్యాన్ షోగా నడిపిస్తూ వచ్చారు. అందుకే ఆయనకు పార్టీలో ప్రత్యామ్నాయం కూడా లేకుండా పోయింది. ఆయనలా వ్యూహరచన చేయగలిగిన వారుకానీ.. శ్రేణులకు భరోసా ఇవ్వగలిగిన నేతలు కానీ..రాజకీయ ఎత్తుగడలు వేయగల మేథావులు కానీ పార్టీలో మరొకరు లేరు. ఆ మాటకొస్తే చాలా పార్టీల్లో చంద్రబాబు అంతటి జీనియస్ లేరనే అంటారు రాజకీయ పండితులు. అటువంటి నేత జైలుకు వెళ్లాల్సి రావడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది
ఒక వేళ టిడిపి అనుకూల న్యాయరంగ నిపుణులు అనుమానించినట్లే చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తే పార్టీని ఎక్కువ కాలం నడపడం లోకేష్ కు సాధ్యమా? అన్న అంశంపై చర్చ నడుస్తోంది. అదీ కాకుండా ఏ క్షణంలో అయినా నారా లోకేష్ ను కూడా సిఐడీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ కూడా పార్టీకి దూరం కావలసి వస్తుంది. ఇద్దరూ జైల్లో ఉంటే మరి పార్టీకి సారధ్యం వహించేది ఎవరు? దీనిపైనే టిడిపి వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది.
నందమూరి కుటుంబం నుంచి ఎవరైనా ముందుకు వస్తారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన వెంటనే పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నందమూరి బాలకృష్ణ సమావేశం ఏర్పాటు చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా భయపడేదే లేదన్నారు. అసలు భయం అన్నదే తమ రక్తంలో లేదని స్పష్టం చేశారు. ఎవరై అధైర్య పడకండి మీకు నేనున్నాను నేనొస్తున్నాను అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే బాలయ్య నాయకత్వంపై పార్టీలో ఎంతమందికి నమ్మకం ఉందన్నది ప్రశ్న. అటు చంద్రబాబు నాయుడికి కూడా బాలయ్య పార్టీ సారధి కావడం నచ్చకపోవచ్చునంటున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. బాలయ్య మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. కోపం వస్తే అభిమానులనే కొట్టేస్తారాయన. అదే వైఖరి పార్టీ నేతలపై చూపిస్తే నేతలు పార్టీ కార్యాలయానికి కూడా రారని అంటున్నారు.
బాలయ్య కాకపోతే ఇంకెవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటారా? టిడిపికి మేలు జరుగుతుందని అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేయడానికైనా సిద్దం కావచ్చు కానీ.. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని టిడిపి నేతలు క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ప్రశ్న. 40ఏళ్ల చరిత్ర ఉన్న టిడిపికి మరో పార్టీ నాయకుడు దిక్కు కావడాన్ని టిడిపి పాతతరం నేతలు జీర్ణించుకోలేకపోవచ్చునంటున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఇదే పార్టీకి పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…