ఆయన ఆర్థికంగా దివాలా తీశారని ప్రచారం జరిగింది. ఆయన కంపెనీలు కష్టాల్లో ఉన్నాయని చెప్పుకున్నారు. అప్పులిచ్చిన బ్యాంకులు వెంట పడుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. అందుకే ఆయన ఎక్కువగా బయట కనిపించడం లేదని ఓ వాదన ప్రచారానికి వచ్చింది. ఆరు దశాబ్దాలుగా పైగా పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా, ధర్మకార్యాల నిర్వాహకుడిగా వెలిగిన తిక్కవరపు సుబ్బిరామిరెడ్డికి ఇంతటి దుస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుండగానే ఆయన గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. విశాఖపట్నమా కాచుకో నీ ఫేవరేట్ పాలిటీషియన్ వస్తున్నాడు అంటూ నినదించారు.
సుబ్బిరామిరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు. దానితో ఆయనలో ఆశలు పెరిగాయనుకోవాలి. రాజ్యసభ సభ్యత్వం పూర్తయిన తర్వాత రాజకీయాలకు కాస్త దూరం జరిగిన ఆయన ఈ పరిణామాలతో మళ్లీ క్రియాశీలమవుతున్నారు ఆయన ఉన్నట్టుండి విశాఖ రావడం చర్చనీయాంశంగా మారుతుంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన విశాఖలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దాని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు సమాచారం. స్థానికేతరులకు స్వర్గధామంగా భావించే విశాఖ పార్లమెంటు సీటుపై సుబ్బిరామిరెడ్డి మళ్లీ కన్నేశారని సన్నిహితులు చెబుతున్నారు. 1990 చివరి దశలో రెండు సార్లు ఆయన విశాఖ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఒకప్పుడు విశాఖ అంటే సుబ్బిరామరెడ్డి, సుబ్బిరామి రెడ్డి అంటే విశాఖ అనే స్థాయిలో ఫేమస్ అయ్యారు. శివరాత్రి వస్తే విశాఖ వాసులకు సుబ్బిరామిరెడ్డి గుర్తుకు వచ్చేంతగా కార్యక్రమాలు ఉండేవి.
అధికార, విపక్ష పార్టీలకు విశాఖ పార్లమెంటుకు సరైన అభ్యర్థి లేరని తేలిపోయింది. బీజేపీ తరపున పురంధేశ్వరి పోటీ చేయాలనుకుంటున్నప్పటికీ ఆమె బలమైన కేండెట్ కాదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఇండియా కూటమి బలపడుతోంది. విశాఖలో ఉత్తరాది వారు ఎక్కువగా ఉండటంతో వారి ఓట్లు ఈ సారి ఇండియా కూటమికి పడే అవకాశాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. భావసారూప్య పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే, వామపక్షాలు కూడా కలిసొస్తే హస్తం పార్టీ అభ్యర్థిగా తాను గెలవడం ఖాయమని సుబ్బిరామిరెడ్డి అంచనా వేసుకుంటున్నారు. అందుకే సుబ్బిరామిరెడ్డి విశాఖపై ఫోకస్ పెట్టారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆయన హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక పాత్ర పోషించారు. విజయభేరి బహిరంగ సభలో కూడా సోనియా, రాహుల్, ఖర్గేకు కనిపించేటట్టుగా కూర్చున్నారు. అన్ని ఫోటోల్లో తాను కనిపించే విధంగా ప్లాన్ చేశారు. ఏదేమైనా టికెట్ ఖాయం చేసుకునేందుకు తన వంతు ప్రయత్నాలు కొనసాగించారు….
నిజానికి సుబ్బిరామిరెడ్డి రాజకీయంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్లీ పవర్ ఫుల్ లీడర్ కావాలనుకుంటున్నారు. రాజకీయ పదవి ఉంటేనే వ్యాపారంలో కూడా కలిసొస్తుందని, తమ కంపెనీలకు కాంట్రాక్టులు దక్కుతాయని సుబ్బిరామిరెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం గతంలో తన పరిచయాలన్నింటినీ వాడుతున్నారు. అధిష్టానాన్ని, అధిష్టానానికి దగ్గరగా ఉండే వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ లో విశాఖ టికెట్ పొందడం కష్టమేమి కాదని సుబ్బిరామిరెడ్డికి బాగానే తెలుసు. గెలవటమే కష్టమన్నది ఆయన కూడా తెలిసిన అంశం. అందుకే ఇప్పుడు తనదైన రూటులో సుబ్బిరామిరెడ్డి వెళ్తున్నారు.పైగా ప్రత్యర్థి పార్టీల్లోని నేతలను మేనేజ్ చేసి తన వైపుకు తిప్పుకోవడమెలాగో సుబ్బిరామిరెడ్డికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు.మరి విశాఖలో ఏం జరుగుతుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…