రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదైనా కుట్ర జరుగుతోందా? స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయ్యిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలకు తరలిన మరు క్షణం నుంచే చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు జైల్లో చంద్రబాబుకు రక్షణ లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటి సారి ములాఖత్ కు వెళ్లిన చంద్రబాబు సతీమణి తన భర్త భద్రతపై తనకు ఆందోళన ఉందని అన్నారు.ఆ తర్వాత టిడిపి అనుకూల మీడియాలో సెంట్రల్ జైల్లో ఏదో జరిగిపోతోందన్నట్లు కథనాలు వచ్చాయి. ఏం జరుగుతోందో అర్ధం కావడం లేదంటూ ఆందోళనలూ వ్యక్తం చేశారా కథనాల్లో.
371 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న అభియోగాలపై స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుణ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైల్లో ఆయన్ను స్నేహ బ్యాక్ కు తరలించారు. అయితే చంద్రబాబు నాయుడికి జైల్లో భద్రత ఉండదని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో ఆరోపించారు. అందుకనే చంద్రబాబు నాయుణ్ని హౌస్ రిమాండ్ కు అనుమతించాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడికి ఆయన ఇంట్లో కన్నా కూడా జైల్లోనే భద్రత ఎక్కువగా ఉంటుందని సిఐడీ తరపు న్యాయవాదులు వాదించారు.
అలా జైలుకు తరలిన చంద్రబాబుకు జైల్లో భద్రతపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే ఈనాడు పత్రికలో ఓ కథనం వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతోంది? అన్న శీర్షికన వచ్చిన ఆ కథనంలో జైల్లో ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడిపై కుట్ర అమలు చేసేందుకే జైలర్ ను సెలవుమీద పంపారని తీవ్రమైన ఆరోపణ చేశారా కథనంలో. చంద్రబాబు నాయుడే కాదు గతంలో టిడిపి కీలక నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినపుడు కూడా జైలర్ సెలవుపై వెళ్లారన్నది కథనం సారాంశం.
అయితే కొద్ది రోజుల తర్వాత జైలర్ సెలవు విషయం వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైలు జైలర్ రాహుల్ మూడురోజుల సెలవు పెట్టారు. దానికి కారణం ఆయన సతీమణికి తీవ్ర అనారోగ్యం ఉండడమే. తీవ్ర మానసిక క్షోభలో ఆయన సెలవుపై వెళ్తే దాన్ని కూడా కుట్ర కింద అభివర్ణించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నింటినీ మించిన విషాదం ఏంటంటే..పాపం జైలర్ భార్య అనారోగ్యంతోనే చనిపోయారు కూడా. దీనిపై న్యాయ రంగ నిపుణులు కూడా మండి పడుతున్నారు. వార్తలు రాసేటపుడు కనీస పరిజ్ఞానం..నిజా నిజాలు బేరీజు వేసుకుని రాయాలనన బాధ్యత కూడా లేకపోతే ఎలా? అని వారు నిలదీస్తున్నారు.
తాజాగా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ చాలా చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. తన తండ్రిని జైల్లోనే చంపడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. తన అనుమానాలకు ఓ కారణాన్ని కూడా ఆయన మీడియా ముందు పెట్టారు. సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగీ జ్వరంతో చనిపోయారన్న లోకేష్ తన తండ్రికి కూడా డెంగీ వచ్చేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనికి కొద్ది రోజులుగా వారు చేస్తోన్న ఆరోపణలు కూడా ఊతమిచ్చాయి. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ములాఖత్ లో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జైల్లో దోమలు బాగా ఉన్నాయని..చంద్రబాబు నాయుడికి ఏసీ కూడా లేదని అన్నారు.
ఇంతకీ డెంగీతో చనిపోయిన ఖైదీ కథ ఏంటో తెలుసుకోవాలి. సత్యనారాయణ అనే ఓ రిమాండ్ ఖైదీ ఈ నెల 6న రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారు. వచ్చిన వెంటనే రొటీన్ గా చేసే స్క్రీనింగ్ టెస్టుల్లో సత్యనారాయణకు డెంగీ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. ఆ వెంటనే ఆయన్ను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ ప్లేట్ లెట్లు పడిపోవడం వల్ల సత్యనారాయణ మృతి చెందారు. రిమాండ్ ఖైదీ తరహాలోనే తన తండ్రికి కూడా డెంగీ వచ్చే ప్రమాదం ఉందని బహుశా లోకేష్ ఆందోళన చెంది ఉండచ్చు. అయితే ఈ క్రమంలో జైల్లో తన తండ్రిని చంపేస్తారని ఆయన ఆరోపించడం రాజకీయ ప్రకంపలను సృష్టించింది.