గులాబీ పార్టీకి మొదట్నుంచీ సవాళ్లు విసురుతోన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలక పక్షానికి తలనొప్పులు పెరుగుతున్నాయి.
పార్టీ నేతల మధ్య తగాదాలు అధిష్ఠానాన్ని చికాకు పెడుతున్నాయి. టికెట్ రాని అసమ్మతి నేతలు, టికెట్ దక్కించుకున్న అభ్యర్ధుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ ఇన్‌చార్జ్‌లు ఆపసోపాలు పడుతున్నారు. ఏమాత్రం లెక్కలు మారినా పార్టీకి మైనస్ అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అందుకే అటు అభ్యర్థులు, ఇటు అసమ్మతి నేతల మధ్య రాజీ కుదిర్చేందుకు అనేక ఫార్ములాలు ముందుకు తెస్తున్నారు. అయినప్పటికీ అసమ్మతి మంటలు చల్లారకపోవడంతో అభ్యర్థుల్లో వణుకు మొదలైంది.
కొద్ది స్థానాలు మినహా రాష్ట్రంలో పోటీ చేసే గులాబీ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఒకేసారి ప్రకటించారు. ఇక అప్పటినుంచీ ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ప్రజలు వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలకు మరోసారి సీట్లు ఎలా ఇస్తారంటూ వారికి వ్యతిరేకంగా అగ్గి రాజేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి అసమ్మతి సెగలు మరీ ఎక్కువయ్యాయి. అసమ్మతి నేతలు, అభ్యర్థుల మధ్య సయోధ్య కుదరటం లేదు. నేతలు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా తయారయ్యారు. పైకి కలిసే ఉన్నట్లు కనిపిస్తున్నా.. లోలోన కత్తులు దూసుకుంటున్నారు. దీంతో ఎన్నికల సమయంలో లెక్కలు తేడా కోడుతాయేమో అన్న భయం అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
అసమ్మతి నేతలు, అభ్యర్థుల మధ్య సమన్వయం కోసం అధిష్టానం నియమించిన ఇన్‌చార్జిలకు ఈ గొడవ చల్లార్చడం తలకుమించిన భారంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. అందుకే పార్టీకి నష్టం జరగరాదన్న లక్ష్యంతో నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఆచితూచి అడుగు వేస్తున్నారు.ముఖ్యంగా ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, మధిర నియోజకవర్గాల్లో గ్రూప్ వార్‌ను చక్కదిద్ది, అందరినీ కలిపి ముందుకు సాగేవిధంగా చేయడానికి నేరుగా పార్టీ నాయకత్వమే రంగంలోకి దిగింది. లోకల్ గా జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎట్టి పరిస్తితుల్లోనూ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు రాకుండా కట్టడి చేసేలో దిశగా ముందుకు వెళ్లుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో గ్రూప్ కలహాలను సహించేది లేదని ఉమ్మడి జిల్లాలోని నాయకులందరికీ పార్టీ అధినేత కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవలే వైరా నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై బీఆర్‌ఎస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాములునాయక్, పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బానోత్ మదన్‌లాల్ మధ్య విభేదాలు రచ్చకెక్కడంపై పార్టీ అధినేత సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
గులాబీ పార్టీ అభ్యర్థిగా మదన్‌లాల్‌ను ప్రకటించాక రాములునాయక్ తనలోని అసంతృప్తిని వెల్లగక్కారు. దళితబంధు జాబితా ఇరువురి నడుమ దూరాన్ని పెంచడంతో తాము నలిగిపోతున్నామని ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములునాయక్, పార్టీ అభ్యర్థి మదన్‌లాల్ నిర్వహించే కార్యక్రమాల్లో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. కాగా, ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా కేసీఆర్ నియమించిన ఎంపీ నామా నాగేశ్వరరావు ఇప్పటివరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లోనూ నిర్వహించిన పార్టీ ర్యాలీల్లో పాల్గొన్నారు.
ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఇద్దరితో ఆయన పలుమార్లు చర్చలు జరిపినా ఇంకా ఏకతాటిపైకి రాలేదు. అటు భద్రాచలం నియోజకవర్గలోనూ పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ కొలిక్కిరాలేదు. తెల్లం వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడంతో టికెట్ ఆశించిన బోదెబోయిన బుచ్చయ్య నిరాశకు గురయ్యారు. పైగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాలసానిని తప్పించి ఎమ్మెల్సీ తాతా మధుకు అప్పగించడంతో మరింత అసహనంతో రగిలిపోతున్నారు. మరి ఇవన్నీ ఎలా పరిష్కరిస్తారో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…