తెలంగాణాలో అధికారాన్ని కైవసం చేసుకుని తీరాలన్న పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ చాలా పకడ్బందీగానే వ్యూహాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. పార్టీలకు ఏ మాత్రం తీసిపోకుండా కమలనాథులు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది బిజెపి. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి దశాబ్ధాల క్రితం నుంచే చెబుతూ వస్తోంది. తాజాగా నిర్వహించిన విమోచన ఉత్సవాన్ని అమృతోత్సవంగా ప్రచారం చేశారు బిజెపి నేతలు. పార్టీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణా బిజెపి లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది.
లాల్ బహదూర్ శాస్త్రి చొరవ కారణంగానే తెలంగాణాకు విముక్తి లభించిందన్నారు అమిత్ షా. సికిండ్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణా విమోచన అమృతోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో బిజెపి కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి అధికారంలోకి వచ్చేలా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.తెలంగాణా లో తొమ్మిదేళ్ల బి.ఆర్.ఎస్. పాలన అవినీతి మయమే అన్నారు అమిత్ షా. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి పై ఏనాడూ దృష్టి లేదన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తోందన్నారు. నరేంద్ర మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ సుఖంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
విమోచన సభ కోసం వచ్చిన అమిత్ షా పనిలో పనిగా తెలంగాణా బిజెపి అగ్రనేతలతోనూ భేటీ అయ్యారు. ప్రత్యేకించి పార్టీలో ముగ్గురు నేతల మధ్య సయోధ్య లేకుండా ఉందని.. ముగ్గురూ మూడు వైపులకు పార్టీని లాగుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా దీనిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తాజా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ లతో అమిత్ షా కీలకంగా చర్చించారు. ముగ్గురూ కలిసి కట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎవరికి వారు గ్రూపులు కడితే పార్టీకి నష్టమని వారికి నచ్చచెప్పారని అంటున్నారు.
అమిత్ షా కార్యక్రమంతో జోష్ పెరిగిన బిజెపి నాయకత్వం త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబరు మొదటి వారంలో నరేంద్ర మోదీ తెలంగాణా పర్యటిస్తారని అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని చెబుతున్నారు. ఎన్నికల వరకు అమిత్ షా, మోదీలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తరచుగా తెలంగాణా పర్యటిస్తూనే ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఒక పక్క పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతూనే మరో వైపు ఇతర పార్టీల నుండి నేతలను పార్టీలోకి ఆకర్షించాలని భావిస్తున్నారు.
జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తోన్న బిజెపి తెలంగాణా తో పాటు ఈ ఏడాది చివర్లో జరగనున్న మరో 4 రాష్ట్రాల ఎన్నికలను ఏప్రిల్ మే నెలలకు వాయిదా వేస్తే.. తెలంగాణాలో బిజెపి పుంజుకోడానికి కావల్సినంత సమయం ఉంటుందని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే జమిలి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. జమిలి ఎన్నికల పేరుతో బిజెపి డ్రామాలు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
కర్నాటకలో అనూహ్యంగా ఓటమి చెందిన భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడాలని భావిస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు తెలంగాణాలో దూకుడు మీద ఉన్న బిజెపి ఆ తర్వాత ఒక్క సారిగా డీలా పడిపోయింది.ఇపుడు మళ్లీ గేర్ మార్చి దూసుకుపోవాలని డిసైడ్ అయ్యింది. అందుకే తెలంగాణా కోసం ప్రత్యేక వ్యూహాలతో పావులు కదుపుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…