తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) షెడ్యూలు ప్రకారమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిథుల బృందం తాజాగా తెలంగాణా పర్యటించి ఏర్పాట్లు పరిశీలించడం అధికారులతో భేటీలు కావడంతో ఎన్నికలు వాయిదా పడకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పాటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రస్తావన కూడా రాకపోవడంతో ఎన్నికల వాయిదా అవకాశమే లేదని వారు విశ్లేషిస్తున్నారు.
అక్టోబరు మొదటి వారంలో మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిథులు తెలంగాణా వస్తారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిథులతో పాటు డిజిపి, చీఫ్ సెక్రటరీలతే భేటీ అవుతారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విపులంగా చర్చిస్తారని తెలంగాణా ఎన్నికల సంఘం అధికారి స్పష్టం చేశారు.
తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లపైనా దృష్టి సారించామన్నారు. అన్ని పనులూ వేగం పుంజుకున్నాయని ఆయన వివరించారు. ఎన్నిలకు సంబంధించిన డిస్ట్రి బ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాట్లను వచ్చే నెలలో పర్యవేక్షిస్తామన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించి వారికి శిక్షణ ఇస్తామన్నారు. పోలింగ్ స్టేషన్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఏమైనా కల్పించాల్సి ఉందా ? అన్న అంశాలపైనా దృష్టి సారిస్తున్నామన్నారు.
తెలంగాణా రాష్ట్రంలో జనవరి నుండి ఇప్పటి వరకు కొత్తగా 15 లక్షల ఓట్లు నమోదయ్యాయి. వివిధ కారణాలతో మూడు లక్షల ఓట్లు రద్దయ్యాయి. ఇంచుమించు ఏడు లక్షల మంది యువ ఓటర్లు ఓటర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అక్టోబరు 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిథులు హైదరాబాద్ వస్తారు. మొత్తం మీద ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఎన్నికలు యథాతథంగా షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని అంటున్నారు అధికారులు. ఎన్నికలు వాయిదా పడతాయేమోనని సందిగ్ఢంలో ఉన్న వారికి ఇపుడిక క్లారిటీ వచ్చినట్లే అంటున్నారు విశ్లేషకులు.
కొద్ది రోజుల క్రితమే బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణా ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరిగే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. అక్టోబరు పది లోపు నోటిఫికేషన్ జారీ అయితేనే డిసెంబరులో ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. అక్టోబరు 10 లోపు నోటిఫికేషన్ విడుదల అయ్యే పరిస్థితులు కనపడ్డం లేదని కూడా అన్నారు. అయితే ఇపుడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులే ఎన్నికల ఏర్పాట్లపై వేగం పెంచడంతో రాజకీయ పార్టీల్లో ఉన్న అనుమానాలకు తెరపడినట్లే అంటున్నారు రాజకీయ పండితులు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధించిన బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ మిగతా రాజకీయ పార్టీలకన్నా చాలా ముందుగానే అభ్యర్ధుల జాబితా విడుదల చేశారు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 115 నియోజక వర్గాలకు అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసి ప్రకటించేశారు కేసీయార్. కేవలం నాలుగు నియోజక వర్గాలకు మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేయాల్సి ఉంది. అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయిపోయిన దరిమిలా ఎన్నికల నగారా ఎప్పుడు మోగినా బి.ఆర్.ఎస్. అభ్యర్ధులు ప్రచారంలో ముందంజలో ఉండే అవకాశాలున్నాయి.
బి.ఆర్.ఎస్. తర్వాత కాంగ్రెస్ పార్టీ రేసులో వేగంగానే దూసుకుపోతోంది. ఈ మధ్యనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సారధ్యంలో తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభ సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ నేతలు హుషారుగా ఉన్నారు. విజయంపై చాలా ధీమాగా ఉన్నారు. విజయావకాశాలు ఎక్కువగా ఉండడం వల్లనే కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పెరిగిందంటున్నారు రాజకీయ పండితులు. బిజెపి మాత్రం రేసులో బాగా వెనకబడిందని చెప్పక తప్పదు. వచ్చే నెలలో బిజెపి అగ్రనేతలంతా తెలంగాణా పర్యటించబోతున్నారు. దాంతోనే పార్టీకి ఊపు వస్తుందని వారు భావిస్తున్నారు.