కేటీయార్ వ్యాఖ్యలపై టిడిపి అభిమానుల్లో అసంతృప్తి

By KTV Telugu On 28 September, 2023
image

Ktv Telugu :

ఏపీ పంచాయితీలు ఏపీలోనే చేసుకోండి అని కేటీయార్ స్పష్టం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న ఆందోళనలను ఉద్దేశించే కేటీయార్ ఇలా వ్యాఖ్యానించారు. మీ సమస్య ఏపీలో పెట్టుకుని తెలంగాణాలో ఆందోళనలు చేయడమేంటన్నారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కు ఆటంకాలు కలించవద్దని సూచించారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ విషయంలో తాము తటస్థంగా ఉన్నామన్నారాయన. తన అరెస్ట్ పై చంద్రబాబు నాయుడు కూడా న్యాయపోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు.

స్కిల్ స్కాం కుంభకోణంలో సెప్టెంబరు 9న అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జైలుకు వెళ్లిన తర్వాత హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఐటీ ఉద్యోగులు ఆందోళనలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ అక్రమం అన్న ఆందోళన కారులు వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐటీ కంపెనీల వద్ద ఇటువంటి ఆందోళనలతో కంపెనీలకు ఇబ్బంది అవుతుందని భావిస్తోన్న కేటీయార్ ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో ధర్నాలేంటని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై బి.ఆర్.ఎస్. నేతలు ఎవరైనా స్పందించినా అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప బి.ఆర్.ఎస్. అభిప్రాయం కాదని కేటీయార్ అన్నారు. నాకు జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురూ స్నేహితులే. అక్కడి సమస్యలను తీసుకు వచ్చి తెలంగాణాకు ముడిపెట్టకండి అని కేటీయార్ నిర్మొహమాటంగా చెప్పారు. దీనిపై టిడిపి అనుకూల వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ర్యాలీలు చేసుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వరా? అని వారు కేటీయార్ ను నిలదీస్తున్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకు వచ్చిన చంద్రబాబు ను అరెస్ట్ చేశారు కాబట్టే హైదరాబాద్ లో ఆందోళనలు చేస్తున్నాం అన్నారు వారు.

ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వివాదాలతో తెలంగాణాకు సంబంధం లేదన్నారు కేటీయార్. తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా హైదరాబాద్ లోని ఐటీ కంపెనీల వద్ద ఆందోళనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. ఆందోళనలు ధర్నాలు, ఉద్యమాల వల్ల వేల కోట్ల పెట్టుబడులతో కంపెనీలు పెట్టిన వారికి ఇబ్బందులు వస్తాయి. అది రాష్ట్రానికీ దేశానికీ కూడా మంచిది కాదన్నారాయన. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి ఉనికే లేదన్న కేటీయార్ ఇక ఆ పార్టీ అధినేత ఏపీలో అరెస్ట్ అయితే తెలంగాణాలో హడావిడి చేస్తామంటే ఎలాగ? అని నిలదీశారు.

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా తెలంగాణాలో ఉన్న ఆంధ్రులు ప్రశాంతంగా హాయిగా జీవిస్తున్నారన్న కేటీయార్ ఇపుడు లేనిపోని ఆందోళనలతో వారిలో అశాంతి రాజేయడం అవసరమా అన్నారు. ఏపీ నుంచి కూడా చాలా మంది వచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నారని వారి వ్యాపారాలకు కూడా ఎలాంటి ఇబ్బందులూ రాకూడదన్నది తమ ఉద్దేశమని ఆయన వివరించారు. కేటీయార్ వ్యాఖ్యలతో టిడిపి నేతల్లో అసంతృప్తి రాజుకుంది.

2019 ఎన్నికల సమయంలో ఏపీలో టిడిపి ,జనసేనల తెలంగాణా కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ తో సీక్రెట్ డీల్ కుదుర్చుకున్నారని ప్రచారం చేశారు. జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే కేసీయార్ కు ఓటు వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే మచిలీపట్నం పోర్టును తెలంగాణా పట్టుకుపోతుందని నారా లోకేష్ పదే పదే ఆరోపించారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఇదే రాగం అందుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు టిడిపి, జనసేనలు రెంటినీ తిరస్కరించారు. టిడిపికి 23 స్థానాలు మాత్రమే ఇస్తే జనసేనకు ఒక్కటంటే ఒక్కటి ఇచ్చారు.