ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు కొత్త సమస్యలు వస్తున్నాయా. వాటి నుంచి బయట పడేందుకు సరికొత్త గేమ్స్ కు పార్టీ అధిష్టానం తెరతీస్తోందా. చంద్రబాబు అరెస్టును పట్టించుకోకూడదనుకున్నా…. అనివార్యంగా ఏదో పక్షం వహించాల్సి వస్తోందా. పైగా కేటీఆర్ మాట్లాడిన ఒక మాటతో సెటిలర్లకు కోపం వస్తుందన్న అనుమానం కలిగిందా. అందుకే ఇప్పుడు ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారా..
హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఖమ్మం, నిజామాబాద్ వరకు అనేక నియోజకవర్గాల్లో ఈ సారి సెటిలర్ల ఓట్లు కీలకంగా మారే అవకాశాలున్నాయి. అందుకే చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ మౌన ముద్ర వేసుకున్నారు. పార్టీ నేతలు తొలుత మౌనం వహించినా ఇప్పుడు బాబు అరెస్టును ఖండించాల్సిన అనివార్యత ఏర్పడింది. తాము పట్టించుకోబోమని కేటీఆర్ ప్రకటించినప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి నుంచి హరీష్ రావు వరకు చంద్రబాబుకు అనుకూల స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు. దానితో కేటీఆర్ కూడా దారికి వస్తున్నట్లుగానే కనిపిస్తోంది.
చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా తటస్థ వైఖరిని పాటిస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అఫిషియల్ గా ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. నేతలు వ్యక్తిగతంగా మాత్రం తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సెటిలర్ల ఓట్లకున్న బలాన్ని అంచనా వేసినందునే వాళ్లు నోరు విప్పక తప్పలేదని చెప్పుకోవాలి. నిజానికి కేటీఆర్ మొదటి రియాక్షన్ ఆశ్చర్యకరంగానే ఉంది.చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహిస్తే హైదరాబాద్ పోలీసులు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అది ఏపీలోని రెండు రాజకీయ పార్టీల మధ్య అంశమని తాము అందులో జోక్యం చేసుకోవడం బాగోదని ఆయన అన్నారు. ర్యాలీలకు అనుమతి నిరాకరణను ఆయన సమర్థించుకుంటూ… ఇప్పుడు ఒకరికి అనుమతిస్తే రేపు మరోకరికి ఇవ్వాల్సి వస్తుందని లెక్కలు చెప్పారు. పైగా జగన్, పవన్, లోకేష్ తనకు మంచి మిత్రులని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అదే ఇప్పుడు తెలంగాణలో సెటిలర్స్ అందరి ఆగ్రహానికి కారణమవుతోంది. హైదరాబాద్ అభివృద్ధికి అంత కృషి చేసిన చంద్రబాబు అరెస్టుపై నిరసనలను ఆపుతారా అంటూ సెటిలర్స్ అగ్గిమీద గుగ్గిలమైన సందర్భమూ ఉంది. అప్పుడు గానీ జరిగిన తప్పు బీఆర్ఎస్ పార్టీకి తెలిసి రాలేదు. దానితో చంద్రబాబు అరెస్టును అక్కడక్కడా ఖండిస్తూ దిద్దుబాటుకు దిగుతోంది.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్ వనస్థలీపురంలో జరిగిన నిరసనల్లో స్థానిక ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అరెస్టును ఖండిస్తూ ఆ పని ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారానికి తమ ప్రాంతంలో సెటిలర్ల ఓట్లు ఎంత కీలకమో బాగానే తెలుసు. బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అయితే ఏకంగా నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఇప్పుడాయన కాంగ్రెస్ లో చేరే ప్రయత్నంలో ఉన్నారనుకోండి. పోచారం, మోత్కుపల్లి ఇద్దరూ టీడీపీలో మంత్రులుగా చేసినవారే కావడం విశేషం. తాజాగా మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. ఏపీ మాజీ సీఎం వయసును ఆయన గుర్తుచేశారు. పైగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అభివృద్దిని చంద్రబాబు ప్రశంసించారని కూడా హరీష్ రావు గుర్తు చేశారు. ఇక ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహావిష్కరణకు హాజరైన కేటీఆర్ గతంలో చేసిన తప్పును సరిదిద్దుకునే చర్యగా తెలుగుదేశం వ్యవస్థాపకుడిని తెగ పొగిడేశారు.
హరీష్ రావు ఎంట్రీ ఇచ్చారంటే పెద్ద వ్యూహమే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అక్కడ రెండు కోణాలను పరిశీలించిన తర్వాతే ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారనుకోవాలి. తెలంగాణ వాదుల్లో, అందులోనూ హార్డ్ కోర్ బీఆర్ఎస్ వాదుల్లో చంద్రబాబు పట్ల వ్యతిరేకతే ఉంటందని ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. వారిని కూడా పార్టీ సంతృప్తి పరచాల్సిందే. అయితే ఈ సారి ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కావడం ఖాయమన్న అభిప్రాయం ప్యక్తమవుతోంది. దానితో సెటిలర్లను దూరం చేసుకోవడం తగదన్న అభిప్రాయంతో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. అదే వారి అతి పెద్ద డబుల్ గేమ్ అని చెప్పాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…