మధ్య ప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రక రకాల మార్పులు చేర్పులు చేస్తోంది. దానికి దీటుగా బిజెపి కూడా వ్యూహాల గేర్లు మారుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలబెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. అటు సింధియా కూడా దీనికి సుముఖంగానే ఉన్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలో కాంగ్రెస్ బొటా బొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చినా.. పార్టీలో తిరుగుబాటుతో ప్రభుత్వం కూలింది. బిజెపి అధికారంలోకి వచ్చింది.
మధ్యప్రదేశ్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు .. సర్వశక్తులూ ఒడ్డుతోంది బీజేపీ. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికిజాతీయ నేతలను అసెంబ్లీ బరిలోకి దించుతోంది. కేంద్రమంత్రి సింధియా కూడా శాసనసభకు పోటీచేస్తారనే వార్తలు జోరందుకున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి.కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే నలుగురు కేంద్రమంత్రులు, ఏడుగురు ఎంపీలకు టికెట్లు ఇచ్చిన హైకమాండ్ .. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టేందుకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.
దివంగత మాధవరావు సింధియా తనయుడైన జ్యోతిరాదిత్య సింధియా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండీ నడిపించారు. ఆయనకున్న గ్లామర్ తో పార్టీని గెలిపించారు కూడా. తనకి ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం సింధియాను పక్కన పెట్టి సీనియర్ పేరుతో కమలనాథ్ ను తెచ్చి సిఎంని చేసింది. దాంతో ఒళ్లు మండిన జ్యోతిరాదిత్య తన వర్గం ఎమ్మెల్యేలతో పార్టీకి గుడ్ బై చెప్పారు. దాంతో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. సింధియా బిజెపిలో చేరడంతో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.సింధియా మేనత్త, మధ్యప్రదేశ్ మంత్రి యశోధరా రాజే సింధియా.. అసెంబ్లీ ఎలక్షన్స్‌కు దూరం జరిగారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనంటూ బీజేపీ అధినాయకత్వానికి సమాచారం ఇచ్చారు. శివపురి స్థానం నుంచినాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యశోధరా రాజే.. శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సింధియా బీజేపీలో గూటికి చేరడంలోనూ కీలకంగా వ్యవహరించారు. అనారోగ్య కారణాలతోనే యశోధరా రాజేఎన్నికల బరి నుంచి వైదొలిగినట్టు చెబుతున్నా.. మేనల్లుడు కోసం ఆమె సీటు త్యాగం చేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.యశోధరా రాజే రేసు నుంచి తప్పుకోవడంతో.. శివపురి స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తారనే ప్రచారం
జోరందుకుంది. శివపురి కాకుంటే, గుణ, బమోరి స్థానాల నుంచి పోటీ చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్టు వార్తలొస్తున్నాయి. ఈ మూడు స్థానాలు జ్యోతిరాదిత్య గతంలో ప్రాతినిధ్యం వహించిన గుణ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనివే. 2001లో తన తండ్రి మాధవరావ్ సింధియా మరణం తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన జ్యోతిరాదిత్య..ఇప్పటివరకూ ఒక్కసారీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయలేదు.తండ్రి ప్రాతనిధ్యం వహించిన గుణ లోక్‌సభ స్థానం
నుంచి వరుస విజయాలు అందుకున్న సింధియా.. 2019లో ఓడిపోయారు. 2020లో మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోయారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవ్వడం.. ఆ తర్వాత సింధియా కేంద్రమంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సింధియా అసెంబ్లీ బరిలోకి దిగితే .. రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుందంటున్నాయి పొలిటికల్ వర్గాలు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…