ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారుతున్నాయా. ఉమ్మడి ఏపీలో కూడా లేని పరిస్థితులు ఇప్పుడు అవశేష ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయా.తొలిసారి మహిళా ముఖ్యమంత్రిని మనం చూడబోతున్నామా. రాష్ట్ర ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవి కోసం ఆ ఇద్దరు మహిళలు పోటీ పడబోతున్నారా.. వారికి ఉన్న అవకాశాలేమిటి. వారికి ఎదురయ్యే సమస్యలేమిటి…
ఇద్దరూ అధికార పీఠానికి దగ్గరగా ఉన్న వాళ్లే. అధికారమంటే ఏమిటో తెలిసిన వాళ్లే. వారసత్వంగా రాజకీయాలను చూసి అందులో మంచి చెడులను అర్థం చేసుకున్న వాళ్లే. ఇంటికే పరిమితం కాకుండా డైనమిజం చూపించగల సత్తా ఉన్న వాళ్లే. అవకాశం వస్తే దున్నెయ్యగల ధీరులే. కష్టాల కడలి నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునే లక్ష్యసాధకులే. ఇప్పుడు వారికి అవకాశం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.మరి వారి ఎబిలిటీ ఏమిటో…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కేసులు, అరెస్టులుగా సాగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం కేసుల మీద కేసులు పెడుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కేసులు ఎటు పోతాయో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పక తప్పదు. మరో పక్క కేసుల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ తక్కువ తినలేదు. ఆయనపై కూడా లెక్కకు మించిన కేసులున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు కోర్టులకు హాజరు కాకుండా వెసులుబాటు పొందినా విచారణలపై మాత్రం ఆంక్షలు పెట్టలేదు కదా. ఏదోక కేసులో జైలు శిక్ష పడి ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే అప్పుడేమిటనేది పెద్ద ప్రశ్నే. మరో పక్క నారా లోకేష్ పై కూడా కేసులు పెట్టిన ఏపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇటువంటి విచిత్ర పరిస్థితుల్లో వాట్ నెక్ట్స్ అన్న చర్చ కూడా తెరపైకీ వచ్చింది. ముగ్గురు హేమాహేమీలు సీఎం సీటుకు దూరం జరగాల్సిన పరిస్థితే వస్తే.. తదుపరి నాయకుడెవ్వరూ అన్నది ప్రశ్నే. తదుపరి వచ్చేదీ నాయకుడా, నాయకురాలా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతోంది. సరిగ్గా అప్పడే ఆ ఇద్దరు మహిళల పేర్లు తెరమీదకు వచ్చాయి.
నారా బ్రాహ్మణి వర్సెస్ వైఎస్ భారతీ … ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఇదే. అందుకు కారణాలు లేకపోలేదు. ప్రస్తుతానికి వైఎస్ భారతీ తెరవెనుక క్రియాశీలంగా ఉన్నారు. నారా బ్రాహ్మణి తెరముందే క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు ప్రస్తుతానికి రాజకీయాల్లో లేరు. రాజకీయాల్లోకి వచ్చేందుకు వారికి ఎలాంటి అవరోధాలు లేవు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని, ఎదురొడ్డి నిలబడే ధైర్యమూ, సత్తా వారికి ఉందని మాత్రం వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. భయం వారి బయోడేటాలో లేదని, ఎంతటి సవాలులైనా స్వీకరిస్తారని ఇద్దరూ చూపించగలిగారు…
వైఎస్ జగన్ రెడ్డిది పులివెందుల, వైఎస్ భారతిది కూడా అంతే. ఆమె తండ్రి గంగిరెడ్డి పిల్లల వైద్యుడు. భారతి విద్యాధికురాలు ఎంబీఏ చేశారు. వైఎస్ కు దగ్గరి బంధులే. దానితో వైఎస్ కుటుంబంలోకి ఆమె ప్రవేశించడానికి పెద్దగా అడ్డంకులు కూడా కలగలేదు. జగన్ కష్టసుఖాల్లో ఆమె ఒకరుగా ఉన్నారు. ప్రతి పురుషుని సక్సెస్ వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే సీఎం జగన్ విజయాల వెనుక భారతీ ఉంటారని చెబుతారు. మరో పక్క నారా బ్రాహ్మణిది కూడా వీఐపీ ఫ్యామిలీనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహానటుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనుమరాలు ఆమె. బాలయ్య కూతురు, చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య…ఇన్ని సోషల్ క్వాలిఫికేషన్ల్ ఆమెకు ఉన్నాయి. విదేశాల్లో ఇంజనీరింగ్, ఎంబీఏ చేశారు. కమ్యూనికేషన్లో ఆమె దిట్ట అని ఇటీవలి పరిణామాలు కూడా నిరూపిస్తున్నాయి.
వాళ్లిద్దరూ ఫ్యామిలీ ఉమెన్. కుటుంబ బాధ్యతల నిర్వహణలో వారు ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు. వ్యాపార రంగంలో రాణించడం ద్వారా ఉమెన్ లీడర్స్ అని కూడా పేరు తెచ్చుకున్నారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ లాంటి సంస్థల డైరెక్టర్ గా వైఎస్ భారతి వ్యాపార రంగంలో తన ముద్ర వేసుకున్నారు. ఇక హెరిటేజ్ ఫుడ్స్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె ఇండియాస్ వెల్ నోన్ ఎంట్రిపెన్యూర్ గా పేరు తెచ్చుకున్నారు. సామాజిక కార్యకర్తగా, సోషల్ మీడియా ఇన్ ఫ్లెయెన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. భర్తకు సపోర్టుగా ఆమె ర్యాలీలు, రాజకీయ సమావేశాలకు కూడా హాజరవుతారు. దూసుకుపోయే లక్షణమేగానూ వెనుకాడేతత్వం లేని నాయకురాలు బ్రాహ్మణి అని చెప్పక తప్పదు.
ఆటు పోట్లను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలిసిన వాళ్లే ఆ ఇద్దరు మహిళలు. జగన్ జైలుకు వెళ్లిన్పపుడు కేసుల విషయంలో భారతీ అన్నీ తానై వ్యవహరించారు. కోర్టులకు హాజరవుతూ ఎప్పటికప్పుడు కేసు వివరాలు తెలుసుకున్నారు.ఆయనకు బెయిల్ వచ్చే దాకా కోర్టు మెట్లు ఎక్కుతూ పోరాడారు. 2019 ఎన్నికల ప్రచారంలోనూ భారతీ తెరవెనుక కీలక పాత్ర పోషించారని చెబుతారు. ప్రచార శైలి మార్చడంలోనూ,మహిళా ఓటర్లను ఆకట్టుకునే హామీల విషయంలోనూ ఆమె సలహాలు పనికి వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జగన్ సీఎం అయిన నాలుగున్నరేళ్ల కాలంలోనూ కొన్ని నిర్ణయాల వెనుక భారతి పాత్ర ఉందని ఆంతరంగికుల సమాచారం . పైగా భారతి మంచి రీడర్. పత్రికలు, పుస్తకాలు చదువుతారు. సోషల్ మీడియా ఫాలో అవుతారు. జగన్ కు అనుకూలంగా, ఆయనకు వ్యతిరేకంగా వచ్చే వార్తలను ఆమె విశ్లేషించి అందుకు తగిన వ్యూహాలకు సంబంధించిన సలహాలు ఇస్తారని వైసీపీ నేతలు అంటారు. సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో భారతికి తెలిసింతగా ఇతరులకు తెలియకపోవచ్చని ఒక వాదన ప్రచారంలో ఉంది. ఇక అవకాశాన్ని బట్టి వేగంగా, సమర్థంగా స్పందించే లక్షణం నారా బ్రాహ్మణికి ఉందని కుటుంబ సభ్యులు, అభిమానులు చెబుతున్నారు. సాహసం చేయడం, సాహసం వైపుకు అడుగులు వేయడం ఆమెకు ఇష్టం. వ్యాపారరంగానికి పరిమితం కాకుండా ప్రజాసేవలో తరించాలని .. ఒక రిచ్ కిడ్ గా తనకున్న అవకాశాలను ప్రజలకు ఉపయోగపడే పనులతో భర్తీ చేయాలని ఆమె కోరుకుంటారు. తాను మంచి స్పీకర్ అని కూడా నారా బ్రాహ్మణి కొన్ని సందర్బాల్లో నిరూపించారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాజమండ్రిలో నిర్వహించిన ర్యాలీలో బ్రహ్మణి పాల్గొన్నారు. అప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు.ఆమె సమాధానాలు కూడా సహేతుకంగానూ, సమర్థంగానూ అనిపించాయి. కొన్ని రోజులు రాజకీయ సభల్లో పాల్గొంటే ఆమె మరింత రాటుదేలుతారని.. నందమూరి వారసురాలిగా ఆమె రాక పార్టీని మరో మెట్టు ఎక్కిస్తుందని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి….
జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే భారతి సీఎం అవుతారని ఒకప్పుడు టాక్ నడిచింది. ఆ దిశగా ఆమె పరిపాలనలోని అన్ని అంశాలను అర్థం చేసుకుంటున్నారని కూడా అప్పట్లో ప్రచారమైంది. ఈ పాటికి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూనే ఆమెకు కొంత అనుభవం వచ్చి ఉంటుంది. పార్టీ నేతలు, జగన్ ఆమెకు కావాల్సిన ఫీడ్ బ్యాక్ కూడా ఇప్పటికే ఇచ్చి ఉంటారని చెబుతున్నారు. మరో పక్క నారా బ్రహ్మణి కూడా అదే రూట్లో ఉన్నారు. లోకేష్ ను అరెస్టు చేయాల్సిన పరిస్థితే వస్తే టీడీపీ నాయకత్వం బాధ్యతను నారా బ్రాహ్మణి తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఆ విషయాన్ని అయ్యన్న పాత్రుడు లాంటి నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. సీనియర్లకు కూడా ఆ ఆలోచన నచ్చినట్లే ఉంది. బ్రాహ్మణి నాయకత్వానికి ఎవరూ అభ్యంతరం చెప్పరని తెలిసిన నేపథ్యంలో బంతి ఆమె కోర్టులో ఉంది. అవసరమైతే బ్రాహ్మణి యువగళం పాదయాత్రను కొనసాగించాలన్న ఆాకాంక్ష కూడా వినిపిస్తోంది. అందుకు ఆమె అంగీకరించవచ్చు కూడా. ఒక్కటి మాత్రం నిజం.. భారతి, బ్రాహ్మణి ఇద్దరికీ రాజకీయ అనుభవం లేదు. ఐనా అవకాశం వస్తే అల్లుకుపోయే ధీర వనితలు వాళ్లు. ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ వస్తుందో చూడాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…