ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలనేది బీఆర్ఎస్ కోరిక. దాని వెనుక చాలా రాజకీయ కారణాలు ఉండవచ్చు. కానీ ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ ఆందోలన చెందుతోంది. నిన్నటిదాకా పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష సాధింపులేనని విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ ఎన్టీఆర్‌ను పొగుడుతున్నారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హఠాత్తుగా బీఆర్ఎస్ ఎందుకు కంగారు పడుతోంది. రాజకీయం ఎందుకు మార్చేసుకుంటోంది ?
‘ఆందోళనలు ఆంధ్రాలో చేసుకోండి హైదరాబాద్‌లో కాదు’…’చంద్రబాబు అరెస్టుతో బీఆర్‌ఎస్‌కేం సంబంధం ? దీనిపై మా పార్టీ నాయకులెవరైనా మాట్లాడితే అది కేవలం వారి వ్యక్తిగత వ్యవహారం’ అని కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూండగానే… ‘మాకు రాముడైనా, కృష్ణుడైనా ఎన్టీఆరే… ‘చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం’… అనే మాటలు వారి నోటి వెంటే వచ్చాయి. ఇంతలో ఎంతమార్పు..ఎందుకీ మార్పు? రోజుల వ్యవధిలోనే బీఆర్‌ఎస్ నేతల వైఖరిలో వచ్చిన మార్పు దేనికి సంకేతం..? చంద్రబాబు అరెస్టు పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి ఇప్పటి వరకూ అండగా ఉంటున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లను కోల్పోతున్నామన్న ఆందోళనతో మాట మార్చినట్లుగా అంచనా వేయవచ్చు.
రాజకీయాలు రెండురకాలుగా ఉంటాయి. ఒకటి బయటకు చెప్పేది.. అందరికీ తెలిసేలా చేసేది. ఇది అసలు రాజకీయం కాదు. ప్రజల ముందు ఆడే పొలిటికల గేమ్. అసలు రాజకీయం మాత్రం తెర వెనుక ఉంటుంది. చెప్పే దానికి భిన్నంగా చేస్తారు. ఇలాంటి రాజకీయం తెలిసిన వారే నేతలు. ఓటర్ల నాడిని, జనం మూడ్‌ను పసిగట్టి మాట మార్చేయడంలో ముందున్న వారే రాణిస్తారు. ఇలాంటి రాజకీయంలో బీఆర్‌ఎస్ నేతలు మహా దిట్టలు. అందుకే రానున్న శాసనసభ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు చేజారిపోతాయన్న ఆందోళన ఏర్పడగానే మాట మార్చేశారు. తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు పూర్తిగా రాజకీయకక్ష సాధింపు చర్యగానే అన్ని పార్టీలు చూస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు సహా అన్ని పార్టీల నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారు. బీఆర్ఎస్ నేతలు కూడా ఖండించారు కానీ.. ఎక్కువగా టీడీపీలో ఉండి బీఆర్ఎస్‌లో కీలక పొజిషన్లలో ఉన్న వారే స్పందించారు. కానీ ఇటీవల కేటీఆర్ .. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదని అది అక్కడి రాజకీయం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయంగా సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఈ లోపు బీఆర్ఎస్ కూడా ముఖ్య నేతలు కూడా టోన్ మార్చారు. హరీష్ రావు చంద్రబాబు అరెస్టును ఖండిస్తన్నట్లుగా ప్రకటన చేశారు. ఖమ్మం పర్యటనలో కేటీఆర్.. ఎన్టీఆర్‌ను గతంలో లేనంతగా పొగిడారు. దీంతో రాజకీయం మారిందేమో అన్న అభిప్రాయానికి తెలంగాణ రాజకీయవర్గాలు వస్తున్నాయి.
చంద్రబాబునాయుడును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన తర్వాత ఆయన అరెస్ట్ అక్రమమని నిరసిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు చేపట్టిన నిరసనలు క్రమంగా పెరుగుతూడంటంతో పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇది వివాదాస్పదం అయింది. అయితే చాలా చోట్ల బీఆర్ఎస్ నేతలే స్వయంగా చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా అనేక మంది ప్రదర్శనలు నిర్వహించారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వారు రాజకీయాల్లో కక్ష సాధింపులు మంచివి కావని ప్రకటనలు చేసారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్లగొండ, నిజామాబాద్ వంటి చోట్ల ఇంకా ప్రదర్శలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ పలు కాలనీల్లో చంద్రబాబుకు్ మద్దతుగా ప్రదర్శనలు చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత .. హరీష్ రావు ఓ సందర్భంలో పాపం చంద్రబాబు అరెస్టయ్యారట అని.. కాస్త వెటకారక స్వరంలో మాట్లాడారు. తర్వాత అవి ఏపీ రాజకీయాలని .. తెలంగాణకు సంబంధం లేదన్నారు. కేటీఆర్ కూడా అదే చెప్పారు. కేటీఆర్ అసలు తెలంగాణలో నిరసనలు చేస్తే అణిచి వేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రకటనలు మిస్ ఫైర్ అయ్యాయన్న విశ్లేషణలు వచ్చాయి. తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడింది కానీ.. చంద్రబాబుపై అభిమానం మాత్రం అంతే ఉందని.. రోజు రోజుకు పెరుగుతున్న నిరసనలు వెల్లడిస్తూ ఉండటంతో పాటు.. కేటీఆర్, హరీష్ ల స్పందన ద్వారా.. టీఆర్ఎస్‌కు అండగా ఉంటున్న కొన్ని వర్గాలు దూరమవుతాయన్న ప్రచారం ప్రారంభమయింది. దీంతో వెంటనే బీఆర్ఎస్ నష్టనివారణా చర్యలు తీసుకుందని.. చంద్రబాబు అరెస్టు విషయంలో ఆయనకు సానుభూతి చూపిస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారంటున్నారు. కేటీఆర్ ఖమ్మంలో ఎన్టీఆర్ ను పొగడటం వెనుకా అదే రాజకీయం ఉందంటున్నారు.
కారణం ఏదైనా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్‌కు సెటిలర్లు అండగా నిలుస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ వారు అండగా నిలవకపోతే బీఆర్ఎస్ పరువుపోయేదే. మరి చంద్రబాబు అరెస్టు తర్వాత సెటిలర్ల మనసుల్లో మార్పు వస్తోందా ?
చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాజకీయ కక్షల కోసమే అరెస్టు చేశారన్న అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఏర్పడటంతో ఆయనకు సానుభూతి వస్తోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇది తెలంగాణలోనూ రావడం.. మొదట్లో బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యతిరేకత ప్రకటనలతో కొన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడంతో టీడీపీకి రాజకీయంగా మేలు జరిగిందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ ఎలా చేయాలన్నది ఇంకా కసరత్తు చేయలేదు. బలమున్న స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. బీజేపీతో పొత్తులు ఉండవని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో తమకు అండగా ఉంటున్న కొన్ని వర్గాల ఓట్లు .. చంద్రబాబు అరెస్టు వల్ల దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అగ్రనేతలు నష్టనివారణ చర్యలు ప్రారంభించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వాస్తవానికి ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మంత్రి పువ్వాడ అజయకుమార్… తొలుత జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, తానే ఆ సభకు ముఖ్య అతిథిగా హాజరై, ఎన్టీఆర్‌ను వేనోళ్లా కీర్తించారు. ఇదే సమయంలో అన్నగారిని, సీఎం కేసీఆర్‌ను పోలుస్తూ ‘కేసీఆర్‌కు ఎన్టీఆర్ రాజకీయ గురువు…’ అని చెప్పటం ద్వారా సెటిలర్లలో ఉన్న ఆగ్రహాన్ని, అనుగ్రహంగా మార్చుకునేందుకు ప్రయత్నించారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు సిద్ధిపేట కేంద్రంగా హరీశ్‌రావు సైతం చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ప్రస్తావన వచ్చినప్పుడు గతంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఎన్టీఆర్ నాకు రాజకీయ గురువు. ఆయన ప్రోత్సాహంతోనే నేను నాయకుడిగా ఎదిగాను. కానీ ఒక ఆంధ్రా వ్యక్తి పేరును తెలంగాణ ప్రాంతంలోని టెర్మినల్‌కు ఎలా పెడతారు. మీరు అంతగా పెట్టాలనుకుంటే మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరును ఆ టెర్మినల్‌కు పెట్టండి…
అని ప్రకటన చేశారు. ఇప్పుడు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. మరి ఈ నష్ట నివారణా ప్రయత్నాలు ఫలిస్తాయా..? లేదా..? అన్నది ఎన్నికల తర్వాత గానీ తెలియదు.
తెలంగాణలో ఆంధ్రా మూలాలు ఉన్న వారు ఎప్పుడో కలిసిపోయారు. వారిలో సెంటిమెంట్లు ఉన్నాయో లేవో కానీ.. చంద్రబాబుపై అభిమానం మాత్రం ఎంతో కొంత ఉంటుందని ర్యాలీలు నిరూపిస్తున్నాయి. మరి ఎంత వరకూ రాజకీయ మార్పులకు కారణం అవుతాయన్నది వేచి చూడాల్సిందే.