కేటీఆర్ ఇప్పుడు ప్రత్యర్థుల మీద ఎగిరెగిరి పడుతున్నారు. అవతలి వాళ్లు ఒక్క మాట అంటే ఆయన నాలుగు మాటలతో బదులిస్తున్నారు. అది కాంగ్రెస్ వారైనా, బీజేపీ వారైనా, చివరకు ప్రధాన మంత్రి అయినా ఎవరైనా తనకు ఒకటే అన్నట్లుగా రిటార్ట్ ఇస్తున్నారు. ఎవ్వరినీ ఉపేక్షించబోనని ఆయన నేరుగానే చెప్పేస్తున్నారు.
ఒకప్పుడు కేసీఆర్ ఇష్టానుసారం మాట్లాడేవారు. అడ్డం పొడుగు మాట్లాడితే ఊరుకోమంటూ తాను అంత కంటే ఎక్కవుగా దూషించేవారు. హరీష్ రావు కాస్త అగ్రసివ్ గా ఉండేవారు. ఇప్పుడు కేసీఆర్ తగ్గారు. హరీష్ రావు పాలిష్ట్ గా మాట్లాడుతున్నారు. వారిద్దరి తీరును ఇప్పుడు కేటీఆర్ పుణికిపుచ్చుకున్నట్లుగా ఉంది. ఎవరేమి మాట్లాడినా బస్తీమే సవాల్ అంటున్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్ వదలబోయి.. బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులు మాట్లాడకూడని మాటలు వదలుతున్నారు.
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేను ఒకటి అంటా అన్నది పాత సామెతే. తెలంగాణ రాజకీయాలకు అందులోనూ ముఖ్య నేతలకు ఆ సామెత అతికినట్లు సరిపోతుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే ధోరణిలో ఉన్నారనుకోవాలి. ఎవరినీ వదిలిపెట్టకుండా అన్ పార్లమెంటరీ భాషకు దగ్గరగా ఉండే పదజాలాన్ని వాడుతున్నారు. మోదీ నిజామాబాద్ సభ తర్వాతి కామెంట్స్ ఈ దిశగానే పరిగణించాల్సి ఉంటుంది. కేసీఆర్ తనను కలిసి ఎన్డీయేలో చేరతానని చెప్పారని, కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తానని అన్నారని నిజామాబాద్ సభలో మోదీ వెల్లడించారు. దీనితో కౌంటరిచ్చే క్రమంలో కేటీఆర్.. ఏకంగా పిచ్చి కుక్కలు అనే పదాన్ని వాడేశారు. ఎన్డీయేలో చేరడానికి తమను పిచ్చికుక్క కరిచిందా అని ఎదురు ప్రశ్న వేశారు. రాష్ట్రానికి టూరిస్టుల్లా వచ్చి. చెత్తంతా వాగిపోతారని ఆయన ఫైర్ అయ్యారు. మోదీ అబద్ధాలు, పెడబొబ్బలకు ఎవరు భయపడరన్నారు. గుండెలు చించుకుని అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావని వ్యాఖ్యానించారు.పైగా మోదీని ఒక చీటర్ గా సంబోధించారు. కేటీఆర్ మాట తీరుపై బీజేపీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రధానిని పట్టుకుని మాట్లాడాల్సిన మాటలేనా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని గానీ, బీజేపీ నేతలు గానీ ఇలా మాట్లాడలేదు కదా అని నిలదీస్తున్నారు.
కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సభలతో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో మాట్లాడుతున్న కేటీఆర్ విపక్షాలపై ఆవేశంతో ఊగిపోతున్నారు. అధికారంలో ఉండి కూడా అదుపు తప్పి మాట్లాడుతున్నారు. విపక్ష కాంగ్రెస్ బీజేపీలను తూలనాడుతున్నారు. ఏకంగా ప్రధానిని సైతం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని అయితే ముసలి నక్క.. 60 ఏళ్లు ఏం పీకిండ్రు.. ఇప్పుడు ఏం పీకుతరు.. అంటూ తీవ్ర పదాలు వాడేస్తున్నారు. ఇటీవల భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డిపైనా ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన బస్తీమే సవాల్ అన్నారు. కొరకరాని కొయ్యలా తయారైనా వెంకట్ రెడ్డిపై తన అసహనాన్ని ప్రదర్శించారు. సూర్యాపేటలో ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం.. దమ్ముంటే రా… అని సవాలు విసిరారు. ఈ మాట ఆయన సూర్యాపేట వెళ్లి మరీ చెప్పారు. రాష్ట్రమంత్రి, కాబోయ్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తి దమ్ము , ధైర్యం అంటూ మాట్లాడటమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఫ్రస్టేషన్ బయట పడుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.కేటీఆర్ కు ప్రతీ జిల్లాలో ఒకరైనా అత్యంత సన్నిహితుడైన నాయకుడున్నారు. వారిని ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేకపోతున్నారని అందుకే బరస్ట్ అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శించినందునే కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారని బీఆర్ఎస్ నేతలు సమర్థించుకుంటున్నారు….
కేసీఆర్ ఇప్పుడు అనారోగ్యంతో ప్రగతి భవన్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. దానితో అన్ని పనులు కేటీఆర్ చూసుకుంటున్నారు. తన మిత్రులను వెనుకేసుకొస్తున్నారు. కేసీఆర్ గురించి, తన గురించి, బీఆర్ఎస్ మంత్రుల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పడం వేరు, ఇలా విపరీత పదజాలాన్ని వాడటం వేరు అన్నది కేటీఆర్ గుర్తిస్తే బావుంటుందేమో.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…