ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులతో నెట్టుకు వస్తోంది. మంగళవారం వచ్చిందంటే చాలు అప్పు కోసం ఇడెంట్ పెట్టుకోవాల్సిందే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, సంక్షేమ కార్యక్రమాలకు వ్యయం చేయాలన్న అప్పుచేయకుండా ఉండలేని దుస్థితి కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వ నిర్ణయాలే అప్పులు పెరిగిపోవడానికి కారణమని చెప్పక తప్పదు.
అ అంటే ఆంధ్రప్రదేశ్,, అ అంటే అప్పు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఉదయం లేస్తే అప్పు కోసం తిరగడాన్ని పరిస్థితి అనాలా. దుస్థితి అనాలా అనేది కూడా అర్థం కావడం లేదు. చిల్లిగవ్వ లేని ఖజానా కూడా ఏపీదే అనుకోవాలి. అభివృద్ధి లేకపోయినా అప్పులు పెరిగిపోవడం ఏపీ ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఏప్రిల్ తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ఖాళీ ఖజానాను ఎలా మెయింటెయిన్ చేస్తుందో కూడా పెద్ద ప్రశ్నే అవుతుంది.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భం ఎలా ఉన్నా.. రాష్ట్రం మాత్రం అథోగతిపాలవుతోంది. రోజూ అప్పుల కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతున్నా సీఎంగానీ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గానీ దిద్దుబాటు చర్యలు చేపట్టే పరిస్థితిలో లేరు. ప్రభుత్వ పెద్దల శక్తియుక్తులన్నీ అప్పులు తెచ్చేందుకే సరిపోతున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల కోట్లు అప్పు తెచ్చింది.రిజర్వ్ బ్యాంక్ కల్పించిన ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకోవడం ఈ ఏడాదిలో ఇది ఏడో సారి. తాజా లోనుతో ఈ ఆర్థిక సంవత్సరం ఏడు నెల్లలో తెచ్చిన అప్పు 63 వేల 500 కోట్లకు చేరింది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులతో కలుపుకుని ఈ మొత్తం అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 10 లక్షల 97 వేల కోట్లకు చేరాయి. అంటే నవంబరు టచ్ అయ్యే నాటికి అప్పులు 11 లక్షలకు చేరడం ఖాయమే అనుకోవాలి. ఇదీ సరికొత్త రికార్డే అవుతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇంత అప్పు చేయలేదని చెప్పక తప్పదు.
జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాయి. జగన్ అధికారానికి వచ్చిందే తడవుగా అమరావతి నిర్మాణాన్ని ఆపేశారు. రాజధాని ఉంటే ఆదాయమూ వచ్చేదన్న సంగతి కూడా జగన్ కు తెలియదనుకోవాలా.. కావాలనే అలా చేస్తున్నారని అనుకోవాలా అర్థం కావడం లేదు. రెవెన్యూ పరంగా కాసుల పంట కురిపించే పరిశ్రమలు, వ్యాపార సంస్థలను వెళ్లగొట్టారు. దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలపై కక్షసాధింపు ధోరణిని ప్రదర్శించారు. అమర్ రాజా లాంటి ఐదు నుంచి పది వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించే పరిశ్రమలను వేధించారు. జగన్ ప్రభుత్వ తీరుతో కొత్త పరిశ్రమలు ఏపీ వైపు చూడటం మానేశాయి. దీని వల్ల పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఆగిపోయింది. ప్రతీ నెల జీతాలకు 5 వేల 500 కోట్లు కావాలి. మిగతా ఖర్చులు కలిసి ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు అవుతుంది. పైగా చేస్తున్న అప్పులు రాష్ట్ర ఆర్థిక స్థిరీకరణకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. అంతా ప్రజల నెత్తిన రుద్దడమే అవుతుంది.
ఏపీ అసెంబ్లీకి ఏప్రిల్ లో ఎన్నికలు జరిగాలి. అంటే ఆరు నెలల వరకు ప్రభుత్వాన్ని నెట్టుకు రావాల్సి ఉంటుంది. ఈ లోపు కొత్త అప్పులు తీసుకురాకపోతే బండి నడవదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయి. ఈ ఆరు నెలల కాలంలో ఎంత అప్పు చేయాల్సి వస్తుందో కూడా ఇప్పుడే చెప్పలేం. జగన్ ప్రభుత్వం వ్యయ నియంత్రణపై కూడా దృష్టి పెట్టడం లేదు.జగన్ దిగపోయే నాటికి రాష్ట్ర అప్పులు 11 లక్షల 50 వేల నుంచి 12 లక్షల కోట్ల వరకు చేరుకోవడం ఖాయమవుతుంది. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వానికి అదే పెద్ద సమస్యగా మారుతుంది. అంటే కొత్త ప్రభుత్వంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన అప్పు ఉండటం ఖాయమన్నమాట.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…