బాలయ్య మాటతీరే వేరు. కోపం వస్తే ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడేస్తారు. కార్యకర్తలు, జనం ఏదైనా ఎదురు చెప్పినట్లుగా భావిస్తే వెంటబడి కొడతారు కూడా. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాల్లో బాగా యాక్టివ్ అయిన బాలయ్య పంచ్ డైలాగులు కూడా వదులుతున్నారు. జూనియర్ ఎన్టీయార్ పై ఆయన వదిలిన ఒక పంచ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
ఎవడైతే నాకేంటి, రండ్రా చూసుకుందాం.. కోస్తా నా డాష్ లాంటి బాలయ్య మాస్ డైలాగ్స్ నిత్యం జనంలో వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు దానికి మరో డైలాగ్ తోడయ్యింది . అదే ఐ డోంట్ కేర్ అన్నది. అదీ మరో మాస్ యాక్టర్ జూనియర్ ఎన్టీయార్ ను సంబోధిస్తూ అన్న మాట కావడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు నటుల అభిమానులు తలలు పట్టుకుంటున్నారు…
హిందూపురం నియోజకవర్గంలో పదేళ్ళుగా ఎంఎల్ఏగా పనిచేస్తున్నా బాలయ్య పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. పార్టీ కార్యక్రమాల్లో తనకు వీలైనపుడు పాల్గొంటారు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీలుంటేనే హాజరవుతారు. ఎక్కువ టైమ్ సినిమా షూటింగులకే కేటాయిస్తారు. సినిమాలే బాలయ్యకు ఫుల్ టైం, పాలిటిక్స్ కేవలం పార్ట్ టైమ్ అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు, రిమాండు నేపథ్యంలో బాలకృష్ణ పార్టీ నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు.అయితే బాలయ్య ఇప్పుడు అటు ఏపీ, ఇటు తెలంగాణపై కూడా దృష్టి పెట్టారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతున్నారన్న అనుమానమూ వస్తోంది. హైదరాబాద్ ఎన్టీయార్ భవన్లో పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించిన నందమూరి బాలకృష్ణ… తెలంగాణాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ప్రకటించారు. పార్టీ కోసం తెలంగాణాలో ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. పోయిన ఎన్నికల్లో నేతలు, క్యాడర్ లో కాస్త భయం, స్థబ్దత ఉన్న మాట వాస్తవమే అని అంగీకరించారు. అయితే వాటిని పోగొట్టినట్లు కూడా చెప్పారు.ఎన్నికల్లో పార్టీ పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో తాను విస్తృతంగా ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాలు తమకు రెండు కళ్ళని, తెలంగాణా ఎన్నికల కోసం స్టీరింగ్ కమిటీని కూడా వేసినట్లు చెప్పారు.
పనిలో పనిగా బాలయ్య జూనియర్ ఎన్టీయార్ పై ఒక స్కడ్ క్షిపణి కూడా వదిలారు. చంద్రబాబు నాయుడు అరెస్టు మీద ఎన్టీయార్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో సినీ అభిమానులు, పొలిటికల్ జనం కాస్త ఖంగుతిన్న మాట వాస్తవం. నిజానికి ఎన్టీయార్ కుటుంబం జూనియర్ ను దూరం పెట్టిందన్న చర్చ చాలా రోజులుగా ఉంది.జూనియర్ కూడా ఎన్డీయార్ కుటుంబానికి దూరంగా ఉంటూ ఫిలిం కేరీర్ పై దృష్టి పెట్టారు. అనేక కీలక అంశాల్లో ఆయన మౌనం వహిస్తున్నారు. మరీ అవసరమైతే ఆలస్యంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ స్పందించలేదన్న ఆగ్రహం టీడీపీలో పెల్లుబికిన మాటవాస్తవం. తర్వాత అది చప్పబడిపోయింది. జూనియర్ ఎందుకో ఈ విషయంపై మౌనం వహించారు. కాకపోతే ఇప్పుడు ఎవరో అడిగితేనే బాలయ్య స్పందించారు. తనదైన శైలిలో ఐ డోంట్ కేర్ అనేశారు. నిజానికి ఒకటి రెండు సార్లు జూనియర్ తారసపడినా, బాలయ్య చూసీ చూడనట్లు ఊరుకున్నారు. కనీసం పలుకరించలేదు. జూనియర్ పలుకరించేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు.
ఒకప్పుడు టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీయార్ తర్వాత చంద్రబాబుకు దూరమయ్యారు. గత పదేళ్లుగా ఆయన పార్టీ వైపుకు వెళ్లలేదు. చంద్రబాబుతో మాట్లాడలేదు. జూనియర్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తే లోకేష్ కు కష్టమని చంద్రబాబు ఆయన్ను దూరం పెట్టినట్లు కూడా ప్రచారమైంది. లోగట్టు పెరుమాళ్ కే ఎరుక..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…