ఎన్నికల ముందు ఏం ఇచ్చినా వర్కవుట్ కాదు

By KTV Telugu On 6 October, 2023
image

KTV TELUGU :-

ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఇచ్చే వరాలను ప్రజలు ఎలా చూస్తారు? ఎన్నికలు దగ్గర పడ్డ తర్వాత వరాల జల్లు కురిపిస్తే ఓటర్లు పొంగిపోతారా? వరాలిచ్చిన పార్టీకి పట్టం కట్టేస్తారా? లేక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లకు వేసే గేలంగా భావించి ఆ పార్టీలను పక్కన పెడతారా? దేశంలో వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలను..ఆయా ఎన్నికల్లో రాజకీయ పార్టీల వ్యవహారశైలినీ గమనిస్తే.. ఓటర్లు మరీ అంత  అమాయకులేమీ కాదని అర్దం అవుతుంది. ప్రజలను తాయిలాలతో తమవైపు  తిప్పుకోడానికి రాజకీయ పార్టీలు గడుసుగా ఇచ్చే వరాలను  ఓటర్లు ఓరకంట చూస్తారు. అధికారంలో ఉన్నంతకాలం ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా ఎన్నికల  ముందు మాత్రమే ఉదారంగా  నిర్ణయాలు ప్రకటించే పార్టీలకు  ప్రజలు అనేక సందర్భాల్లో గుణపాఠాలు చెప్పారు. దారుణంగా ఓడించి ఇళ్లకు పంపారు.

తెలంగాణా కు పసుపు బోర్డు ఇస్తామని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ  గత ఎన్నికల ముందే  హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఆ హామీని అటకెక్కించేసింది. ఆ హామీతో  ఎన్నికల ఏరు దాటిన  నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అరవింద్ ను రైతులు పదే పదే పసుపు బోర్డుకోసం నిలదీసినా లాభం లేకపోయింది. దీనిపైనే   రాజకీయ ప్రత్యర్ధులు కూడా బిజెపిపై విమర్శలు సంధిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు హామీని ఇచ్చిన బిజెపియే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అయినా ఇప్పటివరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదు. అలాంటిది ఇపుడు ఎన్నికలు రాగానే నగారా మోగడానికి ముందు జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.

పసుపు బోర్డుతో పాటే  తెలంగాణాలోని ములుగులో  గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు కు కూడా కేంద్ర మంత్రి వర్గం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రెండు రోజుల  క్రితమే  నరేంద్ర మోదీ  పాలమూరు ప్రజాగర్జన సభలో గిరిజన యూనివర్శిటీ  హామీని తెరపైకి తెచ్చారు. గిరిజనులకు మెరుగైన విద్యను అందించి వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా వెన్నుతట్టడానికే  గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు మోదీ. అయితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన కాదు. ఇపుడే పుట్టిన హామీ కూడా కాదు.  2014లో  రాష్ట్ర విభజన జరిగిన సమయంలో నాటి కేంద్రప్రభుత్వం  విభజన చట్టంలో ఇచ్చిన హామీ ఇది.

ఈ హామీలతో పాటే  ఉజ్వల పథకం కింద గ్యాస్ అందించే లబ్ధిదారులకు 300 రూపాయల రాయితీని ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం 200 రూపాయల రాయితీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు ఇంకో వంద రూపాయలు  పెంచింది. ఇవన్నీ కూడా ఈ డిసెంబరులో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినవే అంటున్నారు  రాజకీయ పండితులు. ఇలా ఎన్నికల ముందు  ఇచ్చే వరాల వల్ల దమ్మిడీ ప్రయోజనం ఉండదని వారంటున్నారు.

1994 లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు ఏడాది ముందు   అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు సీనియర్ అయిన కోట్ల విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ హై కమాండ్ ఆ ఏడాది అంతా రక రకాల వరాలు ఇచ్చింది. సంపూర్ణ సారా నిషేధాన్ని విధించింది. సామాజిక వర్గాల వారీగా ఎన్నో హామీలు ఇచ్చింది.  జనం అంతా విన్నారు . కానీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ను కోలుకోలేని విధంగా చావు దెబ్బ కొట్టారు ఏపీ ఓటర్లు. 294 నియోజక వర్గాలున్న ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ను 26 స్థానాలకు పరిమితం చేసి  షాకిచ్చారు.

అదే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందూ ఇలాంటి నిర్ణయాలే తీసుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు నాలుగు రోజుల ముందు పసుపు కుంకుమ పేరిట మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. దానికి కొద్ది వారాల ముందే  ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్  హామీలను  కాపీ కొట్టి  వృద్ధాప్యపు పింఛను ను రెండు వందల నుండి రెండు వేలు చేశారు. అయిదేళ్లుగా ఇవ్వని నిరుద్యోగ భృతిని ఎన్నికలకు నెల ముందు కొద్ది మందికి ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు కూడా ఎన్నికల ఊపులోనే పెట్టారు. వాటన్నింటినీ ఓటర్లు గమనించారు కాబట్టే  చంద్రబాబు నాయుడు అన్ని వరాలు ఇచ్చినా టిడిపిని గెలిపించలేదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి