ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. సీనియర్ల తీరు ఎలా ఉంది. క్యాస్ట్ గ్రూప్స్ డిమాండ్ ఏమిటి. అభ్యర్థుల జాబితా సిద్ధమవుతున్న వేళ..ఎవరూ నిరాశపడకుండా తెరపైకి వస్తున్న ఫార్ములా ఎలా ఉండబోతోంది…
తెలంగాణ ఎన్నికల్లో ముక్కోణ పోటీ రసవత్తరంగానే ఉంటుంది. చిన్న పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఖాయమైంది. అందులోనూ ఈసారి కాంగ్రెస్ కు విజయావకాశాలు బాగానే ఉంటాయన్న విశ్వాసం నడుమ గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఆశావహుల టెన్షన్ బాగా పెరిగిపోయింది. సీనియర్స్ వర్సెస్ యువత మధ్య చాప కింద నీరులా తయారైన సీట్ల కొట్లాటను అధిష్టానం ఎలా తీర్చుతుందనేదే సమస్య, కాకపోతే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎవరిని ఎలా దారికి తీసుకురావాలో తమకు బాగానే తెలుసని తేల్చేసింది…
ఎన్నికల షెడ్యూల్ రెండు మూడు రోజుల్లో విడుదల కావాల్సిన తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటివరకు రెండు సార్లు ఢిల్లీలో సమావేశమైన స్టేట్ స్క్రీనింగ్ కమిటీ… ఆఖరి మీటింగ్ కు అజెండా సిద్ధం చేసుకుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. టికెట్ల బట్వాడాలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలని కూడా తీర్మానించారు. బీసీలకు కనిష్టంగా 30 స్థానాలు ఇస్తారని చెబుతున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి 20 సీట్లకు తక్కువ కాకుండా ఇవ్వాల్సి రావచ్చు. సెటిలర్లు అయిన కమ్మ సామాజిక వర్గం కూడా ఎనిమిది సీట్లు కోరుతోంది. వందకు పైగా అభ్యర్థులతో మొదటి జాబితా విడుదలవుతుందని చెబుతున్నారు. అందులో 40 చోట్ల ఇప్పటికే సింగిల్ కేండెట్ ను ఫైనలైజ్ చేశారు. ఇద్దరు చొప్పున 45 స్థానాల వరకు ఉండగా.. మిగతా చోట్ల కాస్త ఎక్కువ మందే ఉన్నారు. అన్నింటినీ కలిపి ఒకటిగా చర్చించి అభ్యర్థులను ఫైనలైజ్ చేస్తారని చెబుతున్నారు.
ఇప్పటికే టికెట్ల కోసం పైరవీలు మొదలయ్యాయి. ఢిల్లీలో కొందరు మకాం వేసి టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కమ్మ లాబీతో రేణుకా చౌదరి ఢిల్లీలో తిరుగుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులపై కొన్ని లీకులు రావడంతో సీనియర్లలో ఆందోళన మొదలైంది. రెండు సార్లు ఓడిపోయిన వారికి టికెట్ లేదన్న వార్తల నడుమ వాళ్లు పైరవీలు మొదలు పెట్టారు. చిన్నారెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లు ఈ సారి కూడా గొడవకు దిగేందుకు సిద్ధమయ్యారు. మరో పక్క కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి ఎంపీ పదవి సంగతి తర్వాత చూసుకుందాం.. ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వారికి టికెట్ ఖాయమని తేలిపోయింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎలాగూ కొడంగల్ నుంచి పోటీ చేయబోతున్నారు…
కాంగ్రెస్ అంటే అలుగుళ్లు. కాంగ్రెస్ అంటే గ్రూపు తగాదాలు, కాంగ్రెస్ అంటే తిరుగుబాట్లు.. తెలంగాణ కాంగ్రెస్ అందుకు మినహాయింపు కాదు. ఈ సారి కూడా టికెట్ల విషయంలో సమస్యలు రావచ్చని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్ , మెదక్ ప్రాంతాల్లో అసంతృప్తులు పెరిగిపోయారు. పాత వారిని కాదని కొత్తగా చేర్చుకున్న వారిని అందలం ఎక్కించే ప్రక్రియ మొదలైందని ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుజ్జగింపులు ఫార్ములాకు కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే తెరతీసిందని చెబుతున్నారు. రాష్ట్ర నేతలే కాకుండా జాతీయ నేతలను కూడా ఇందుకోసం రంగంలోకి దించబోతున్నారు. మాణిక్ రావు ఠాక్రే, దిగ్విజయ్ సింగ్, చిదంబరం, కేసీ వేణుగోపాల్ తో పాటు అవసరమైతే మునుపటి ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా వచ్చి అసంతృప్తులతో మాట్లాడతారు. పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తగిన విధంగా పదవులు ఇస్తామని హామీ ఇస్తారు. అప్పటికీ ఒక్కరిద్దలో అసంతృప్తి చల్లారకపోతే నేరుగా రాహుల్ గాంధీ,ప్రియాంకాగాంధీతో మాట్లాడిస్తారు. ఏదేమైనా విజయావకాశాలను చేజార్చుకోకూడదని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…