మేనిఫెస్టో సరే – మరి నమ్మకం ?

By KTV Telugu On 10 October, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ సీఎం కేసీఆర్  అభ్యర్థులను ప్రకటించిన తర్వాత  పెద్దగా బయటకు రాలేదు. నెల రోజుల నుంచి అసలు  కనిపించడం లేదు.  అనారోగ్యమని కేటీఆర్ చెబుతున్నారు కానీ… ఆయన  ప్రజలకు మైండ్ బ్లాంక్ అయ్యే మేనిఫెస్టో రాయడంలో బీజీగా ఉన్నారు బీఆర్ఎస్ వర్గాలే ప్రచారం చేస్తున్నారు.  ప్రపంచంలో ఎవరూ ఊహించనంత మేలు కేసీఆర్ చేయబోతున్నారని హరీష్ రావు అంటున్నారు.  ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ లు ఉంటాయని కేటీఆర్ చెబుతున్నారు. అన్నీ మేనిఫెస్టోలో ఉంటాయని అంటున్నారు. మేనిఫెస్టోలో ఎన్ని ఉన్నా… అసలు ముందుగా దానిపై ప్రజల్లో కలగాల్సింది నమ్మకం. లేకపోతే మేనిఫెస్టో ఎందుకూ కొరగాదు. మరి ఆ నమ్మకాన్ని కేసీఆర్ ఇంకా మిగుల్చుకున్నారా  ?

ప్రతిపక్షాలకు మైండ్  బ్లాంక్ అయ్యే మేనిఫెస్టోను కేసీఆర్ రెడీ చేస్తున్నారని మంత్రి హరీష్ రావు ప్రతి సమావేశంలోనూ చెబుతున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ ఉంటుందని కేటీఆర్ వరంగల్ లో ప్రకటించారు. ఆ గుడ్ న్యూస్ మేనిఫెస్టోలోనే ఉంటుందని చెప్పకనే చెప్పారు. కీలకమైన సమయంలో మూడు వారాల నుంచి బయటకు రాకుండా మేధో వర్గాలతో సంప్రదింపులు జరిపి కేసీఆర్ మేనిఫెస్టో మీదనే చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.   వైరల్ ఫీవర్ అయితే ఇంత కాలం తగ్గకుండా ఉంటుందా అన్న డౌట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కేటీఆర్ చెస్ట్ ఇన్ ఫెక్షన్ అంటున్నారని .. కానీ వాస్తవంగా కేసీఆర్ పలువురితో సమావేశం అవుతున్నారని అంటున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం సమీపిస్తోంది. మ్యానిఫెస్టోల మేనియాకు పార్టీలు సిద్దమయ్యాయి.  బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే ఓ అడుగు ముందుకేసి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నెల 16న వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఆ బహిరంగసభలో కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు.

ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా మేనిఫెస్టో తయారి తుదిరూపులో గులాబీ బాస్‌ నిమగ్నమయ్యారు. మ్యానిఫెస్టోలో ప్రకటించే హామీలకు ఎంత ఖర్చువుతుందనే అంశాలపై సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పలు వర్గాలకు చెందిన నిపుణులతో చర్చిస్తూనే సాధ్యాసాధ్యాలపై లెక్కలు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే పాత, కొత్త పథకాలతో మ్యానిఫెస్టో తుది రూపుకు తెచ్చారని చెబుతున్నారు.   ప్రజాకర్శక పథకాలపై బీఆర్‌ఎస్‌ రిటైర్డ్ ఐఏఎస్‌లు, ప్రొఫెసర్లు, ఆర్ధిక నిపుణులు, వివిధ రంగాల నిష్ణాతులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఇప్పుడున్న సంక్షేమ పథకాలను మరింత పెంచడంతోపాటు కొత్తగా నాలుగైదు స్కీములకు అంకురార్పణ చేయనున్నారని చెబుతున్నారు.  ఆయా పథకాలను ప్రకటిస్తే ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంచనాలను రూపొందిస్తున్నారు. ప్రాజెక్టులు, ఇతర ముఖ్యమైన పథకాలకయ్యే వ్యయాలపై లెక్కలేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రగతిభవన్‌కు సీనియర్లను పిలిపించుకుని మ్యానిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఏదో గాల్లో పథకాలు ప్రకటించకుండా అమలు చేయడానికి తన దగ్గర ఉన్న ప్రణాళికలను కూడా ప్రజలకు వివరిస్తారని చెబుతున్నారు.   కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణలో ఎవరూ ఊహించనంత భారీ పథకలను అమలు చేస్తున్నారు. ఇన్నీ  లబ్దిదారులకు లక్షల్లో నగదు బదిలీ చేసేవే. దళిత కుటుంబాలకు పది లక్షలు, బీసీ – మైనార్టీలకు లక్ష, గృహలక్ష్మి కింద మూడు లక్షలు ఇస్తున్నారు. ఇక కల్యాణమస్తు సహా అనేక పథకాలు నేరుగా లబ్దిదారులకు నగదు బదిలీ చేసేవే. ఇలాంటి పథకాలను మరిపించేలా కేసీఆర్ కొత్త పథకాలు ప్రవేశ పెట్టాల్సి ఉంది.

సంక్షేమం విషయంలో కేసీఆర్ ఓ రకమైన బెంచ్ మార్క్ సృష్టించారు. వాటిని ఎంత మేర అమలు చేశారన్నదానిపైనే ప్రజల్లో ఆయనపై ఉన్న నమ్మకానికి పునాది . అది ఎంత మేర ఉన్నదానిపైనే ఓట్ల  వర్షం కురుస్తుంది.  అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇస్తాను ఇస్తాను అని ఆశ పెడుతూ ఉంటే.. ప్రజలు నమ్మకపోవచ్చు. డబుల్ బెడ్ రూం ఇళ్ల దగ్గర్నుంచి దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయల సాయం వరకూ కేసీఆర్ ప్రజలందరికీ ఉచితంగా లక్షలిచ్చే పథకాలు పెట్టారు. కానీ లబ్దిదారులు ఎంత మంది అనేదే ఇక్కడ ప్రశ్న. ఒక్క రికి ఇచ్చి వెయ్యి మందిని ఆశ పెడుతున్నారు. ఓటు వేస్తే ఇస్తామని చెబుతున్నారు.  కానీ ఆ నమ్మకం  కేసీఆర్ నిలబెట్టుకుంటున్నారా ?

ఒకరికి పది లక్షలు ఇచ్చి… వెయ్యి మందికి త్వరలో ఇస్తామని చెప్పి ఓట్లు అడగడం కేసీఆర్ స్టైల్. కానీ కాంగ్రెస్ మాత్రం… ఆ  పది లక్షలు అందరికీ సమానంగా పంచుతామని చెబుతూ మేనిఫెస్టో ప్రకటించారు. ఆ ఆరు గ్యారంటీలు ఆ కోవలోవే. వాటిని తలదన్నేలా వరాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడ ప్రజలు నమ్మేది ఎవరి గ్యారంటీ అనే దాన్ని బట్టే విజయం ఉంటుంది.

కర్ణాటకలో లభించిన విజయంతో కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల్ని ప్రకటించింది వాటిపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అందుకే వాటిని మరిపించేలా కేసీఆర్ కొత్త మేనిఫెస్టో సిద్ధం చేయాలనకుంటన్నారు.  రైతుబంధు తరహాలో రెండు వ్యవసాయ సీజన్లలో రైతులకు ఉచితంగా ఎరువులు (యూరియా, డీఏపీ, ఎన్‌పీకే) లను ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల ఆసరా పింఛన్లను .1,000 పెంచాలని కూడా సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వికలాంగుల పెన్షన్‌ను నెలకు .3,016 నుంచి .4,016కు పెంచగా.. మిగతా వారికి కూడా .వెయ్యి పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు, యువతతో పాటు మహిళలపై దృష్టి సారించి వారిని ఆకట్టుకునేలా పార్టీ ఎన్నికల హామీలు ఉండనున్నాయి.

కర్ణాటక తరహాలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ న్యాప్‌కిన్లు ఉచితంగా పంపిణీ చేసే ప్రతిపాదనను పార్టీ పరిశీలిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల కళ్లు తిరిగేలా బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను తీసుకొని రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌ రావు మేనిఫెస్టో విషయంలో ప్రజలకు లీకులు ఇచ్చారు. త్వరలోనే మరిన్ని శుభవార్తలు వింటారని, ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. యువతలో నిరుత్సాహాన్ని ప్రారదోలేలా సరికొత్‌త ఉపాధి పథకంపై పార్టీ ఆలోచనలు చేస్తోంది. నిరుద్యోగ భృతి నగదుగా కాకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పనపై దృష్టిసారిస్తోంది. అయితే వీటిని  ప్రకటించడమే కాదు.. ప్రజలు నమ్మేలా చేయడం కూడా కీలకమే. ఈ దిశగా కేసీఆర్ సక్సెస్ అయితే ఆయనకు తిరుగు ఉండద్న అభిప్రాయం ఉంది.  కానీ అలా నమ్మించడమే పెద్ద టాస్క్.

ఎందుకంటే కేసీఆర్ గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో చాలా వరకూ నెరవేర్చలేదు. రుణమాఫీ ఇప్పటికీ పూర్తి కాలేదు. చివరిలో భూములు అమ్మి హడావుడిగా కొంత మందికి రుణమాఫీ చేశారు. కానీ పూర్తి కాలేదు. నిరుద్యోగ భృతి లేదు. గృహలక్ష్మి సహా అన్నీ ఇటీవలే ప్రారంభించారు. అందుకే ప్రజలు నమ్మకం పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ముందున్న టాస్క్.. మేనిఫెస్టోను ప్రకటించడమే కాదు.. దాన్ని అమలు చేస్తానన్న నమ్మకం కూడా కల్పించగలగాలి. అదెంత వరకూ సాధ్యమన్నది వేచి చూడాల్సి ఉంది.

అధికార పార్టీల పనితీరు మీదే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది.  మాటల్లో  ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు.  అధికారంలో లేని పార్టీలు చెబితే నమ్ముతారేమో కానీ…  అధికారంలో ఉండి మాటలు చెబితే ఇప్పటి వరకూ ఎందుకు చేయలేదంటారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి