షర్మిల త్రిశంకు స్వర్గంలో ఉన్నారా. రెంటికి చెడ్డ రేవడయ్యారా. ఇప్పుడు పార్టీని నడిపించాలనుకున్నారా.. మూసెయ్యాలనుకున్నారు. ఈ సారైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారా. మళ్లీ సారీ చెప్పేస్తారా.. కాంగ్రెస్ వైపుకు వెళ్లే ప్రయత్నం బడిసికొట్టిందా. షర్మిల విషయంలో ఎవరి పంతం నెగ్గింది..
అన్న జగన్ సీఎం అయ్యాడు కదా నేనెందుకు కాకూడదని షర్మిల వేసుకున్న ప్లాన్ బెడిసికొట్టిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. జగన్న వదిలిన బాణమా, కేసీఆర్ సారు వదిలినా బాణమా అర్థం కాకపోయినా.. ఇప్పుడు ఆమె ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్సార్టీపీని కలిపేందుకు డీకే శివకుమార్ నుంచి సోనియా వరకు ఎంతమందితో మాట్లాడినా ప్రయోజనం కలగలేదు. చివరకు ఏదోటి చేద్దాంలే ఎన్నికలయ్యేంత వరకు ఆగమని.. షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది…
నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణ బిడ్డను, ఇక్కడే రాజకీయాలు చేస్తానని వైఎస్సార్టీని ప్రారంభించిన షర్మిలకు ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. 3 వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఆమె సాధించిందీ మాత్రం శూన్యమని చెప్పాలి. రోజువారీ కేసీఆర్ ను తిడుతూ ప్రకటనలు విడుదల చేయడమే తప్ప ఆమె సాధించిందీ ఏమీ లేదు. రోడ్డు మీద ధర్నాలకు కూడా మైలేజీ రాలేదు. ఏదో గేమ్ ఆడుతున్నారన్న ఫీలింగ్ తప్పితే ఆమె పట్ల తెలంగాణ ప్రజల్లో సానుభూతి కనిపించలేదు. పైగా పార్టీని నడపటం అంత సులభం కాదని కూడా షర్మిలకు లేటుగా అర్థమైనట్లుంది. పార్టీలో చెప్పుకోతగ్గ నాయకులు కూడా లేకపోవడం, తెలంగాణలో పేరున్న నాయకులు షర్మిల పార్టీలో చేరేందుకు ఇష్టపడకపోవడంతో ఆమె నీరుగారిపోయారు. ఆ క్రమంలోనే షర్మిల ఇక పార్టీని వైండప్ చేసి కాంగ్రెస్ లో కలిపెయ్యాలనుకున్నారు. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రెండు పర్యాయాలు కలిశారు. ఆయన రికమండేషన్ తో సోనియా అపాయింట్ మెంట్ దొరికింది. ఇదిగో చేరతారు అదిగో చేరతారు అనుకోవడం మినహా ఆ టైమ్ వచ్చినట్లు కనిపిచడం లేదు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు షర్మిలను చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆమెను ఆంధ్రా లీడర్ గానే చూశారు తప్ప తెలంగాణ రాజకీయాల్లో పనికొస్తారనుకోలేదు. సోనియాకు షర్మిలను చేర్చుకోవాలని ఉన్నదో లేదో తెలియదు గానీ.. తెలంగాణ పరిస్థితులను అర్థం చేసుకుని మౌనం వహించారు. ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని.. ఆ ప్రభావం షర్మిలపై పనిచేస్తుందని రేవంత్ వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి నూరిపోసినట్లు సమాచారం. షర్మిలను చేర్చుకుంటే తెలంగాణ వ్యతిరేకులంతా ఒకటయ్యారని, వారంతా కాంగ్రెస్ లో చేరారని బీఆర్ఎస్ పెద్దలు ప్రచారం చేసే అవకాశం ఉందని స్థానిక నేతలు గుర్తించారు. కాంగ్రెస్ కు జనాదరణ పెరుగుతున్న టైమ్ లో ఈ పరిస్థితి పార్టీకి ఇబ్బందికరంగా మారొచ్చని అంచనా వేశారు. అందుకే షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం ఒక ఆఫరిచ్చినట్లుగా చెబుతున్నారు ఎన్నికలు ముగిసే దాకా మౌనంగా ఉంటే… తర్వాత వీలు చూసుకుని రాజ్యసభ సీటు ఇప్పిస్తానని సోనియా హామీ పలికినట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనితో ఇప్పుడు షర్మిల ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు.
నిజానికి షర్మిల నేల విడిచి సాము చేయాలనుకున్నారు. తన బలమేమిటో తెలియకుండానే కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు సీట్ల బేరానికి వెళ్లారు. ఒక్క ఉప ఎన్నికలో కూడా పోటీ చేసే ధైర్యం లేకపోయినా.. ఆమె అందలం ఎక్కాలనుకున్నారు. చివరకు ఏదోవిధంగా పార్టీని విలీనం చేసి ఇచ్చిందీ తీసుకోవాలనుకుంటే కాంగ్రెస్ రాష్ట్ర నేతలు అడ్డు తగిలారు. ఇప్పుడు ఆమె ముందున్న ఆప్షన్ ఒక్కటే. కాంగ్రెస్ కనికరించేంత వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు కదా….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…