తెలంగాణ ఎన్నికలు ప్రకటించిన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు అన్నింటికీ కీలకమవుతోంది. పోటా పోటీ అభ్యర్థులు ఒక వంతయితే… ఆంధ్రప్రదేశ్ కు సరిహద్దుల్లో ఉండటం మరో వంతుగా చెప్పక తప్పదు.ఖమ్మంపై అంత ఫోకస్ ఎందుకు పడుతోంది. ఓ సారి చూద్దాం….
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజే ఖమ్మం జిల్లాలో 53 లక్షల రూపాయల నగదు స్వాధీనమైంది. రాష్ట్రం మొత్తం మీద కోటి రూపాయలు స్వాధీనమైతే, అందులో సగం ఖమ్మం జిల్లాలో పట్టుబడింది. దాన్ని బట్టే ఎన్నికల ప్రక్రియలో ఆ జిల్లా ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. డబ్బును ఏరులై పారించగల జిల్లా కూడా అదే కావచ్చు. పైగా సెటిలర్లు అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే జిల్లా కావడంతో అసలు సిసలు ఆంధ్రా రాజకీయం కూడా అక్కడ నుంచే జరుగుతుందని చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఈ సారి టఫ్ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కు ఎన్నికల పేరు ఎత్తితేనే ముచ్చెమటలు పడుతున్నాయట.వామపక్షాలతో పొత్తు ఉంటే ఖమ్మం వారికి కేటాయించి తనకు మరికొంత సేఫ్ సీటు ఇస్తారని పువ్వాజ అజయ్ అనుకుంటే.. సీన్ సితారై.. పొత్తు పొడవలేదు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేల పరిస్తితి కూడా అంత ఆశాజనకంగా లేదు. సండ్ర వెంకట వీరయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది..
ఈ సారి బడా నేతలు పార్టీలు మారిన జిల్లా కూడా ఖమ్మమే కావచ్చు. బీఆర్ఎస్ పై అలిగి చాలా కాలం బహిరంగ పోరాటం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ లో టికెట్ రాక అవమానంగా భావించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ లో చేరారు. దానితో ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్ బలహీనమైపోయి, కాంగ్రెస్ బలపడిందన్న భావన వస్తోంది. అలా రెండు బలమైన గ్రూపులు ఫిరాయించడంతో ఖమ్మం రాజకీయంపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇప్పుడు కాంగ్రెస్లో కమ్మ సామాజికవర్గం లాబీని నడుపుతున్న రేణుకా చౌదరి కూడా ఖమ్మం జిల్లా లీడరే కావడం విశేషం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఆమెకు ఇష్టం లేకపోయినా ప్రస్తుతానికి మౌనం వహించారు.రాష్ట్రంలో ఎనిమిది నుంచి పది సీట్లు కమ్మ వారికి కావాలని రేణుక కోరుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లాలో రెండు సీట్లయినా వస్తాయని ఎదురు చూస్తున్నారు. మిగతావి హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు చేరవచ్చు. ఒకప్పుడు ఖమ్మంలో కమ్యూనిస్టులు బలంగా ఉన్నా ఇప్పుడా పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. బీఆర్ఎస్ కలిసి పోటీ చేద్దామంటే కేసీఆర్ ఒప్పుకోలేదు. దానితో ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరడమా లేక ఒంటరిగా పోటీ చేయడమా అన్న మీమాంస వామపక్షాల్లో నెలకొంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో పక్క ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా కావడంతో ఖమ్మంపై అక్కడ ఎక్కువ చర్చ జరుగుతుంది. వేర్వేరు పార్టీల్లో పోటీ చేసే అభ్యర్థులపైనా వారి విజయావకాశాల పైనా బెట్టింగులు మొదలవుతాయి. భారీ స్థాయిలా కాయ్ రాజా కాయ్ అంటారు. తెలంగాణ ఎన్నికలకు ఏపీలో ఎక్కువ బెట్టింగులు జరిగే ప్రాంతం కూడా ఖమ్మమే కావచ్చు. బ్లాక్ మనీ కూడా ఏపీ నుంచే ఎక్కువ వస్తుందని ఎన్నికల సంఘం వర్గాలు అంటున్నాయి. షెడ్యూల్ ప్రకటించిన రోజే 53 లక్షలు పట్టుబడటం కూడా ఈ దిశగానే చూడాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి అందుకే ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో వందకు పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. రోజా వేలాదు వాహనాలు సరిహద్దు దాటి వస్తున్నందున ప్రతీ ఒక్క వెహికిల్ ను క్షుణ్ణంగా పరిశీలించడం కష్టమే అవుతుందని అధికారులు అంటున్నారు…
ఖమ్మం పేరు చెబితేనే రాజకీయంగా ఒక ఉత్సాహం, ఒక ఊపు వస్తుందని అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి. ఏది జరిగినా ఖమ్మం కేంద్ర బిందువుగా ఉంటుందని చెప్పుకుంటారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఖమ్మం దెబ్బకొట్టినా… ఎమ్మెల్యేలను కొనేసి కేసీఆర్ సంతృప్తి చెందారు. ఈ సారి ఎలా ఉంటుందో చూడాలి. ఖమ్మం జననాడిని పట్టుకోవడంలో ఏ పార్టీ సక్సెస్ అవుతుందో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…