క్రాస్ ఎగ్జామినేషన్ లో రెండు అంటే రెండు ప్రశ్నలతో కొట్టేసే కేసు ఇది అని.. . ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేసులో ప్రాథమిక సాక్ష్యాలు లేకపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్య అది. అంతకు ముందు అదే ఆప్ కు చెందిన సత్యేందర్ జైన్ కూడా అలాగే అరెస్టయి.. చావు బతుకుల్లో పడటంతో అతి కష్టంమీద బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక దేశంలో ఎక్కడ చూసినా అరెస్టులే కనిపిస్తున్నాయి. న్యూస్ క్లిక్ అనే వెబ్ సైట్ ఓనర్ అరెస్టులు.. ఏపీలో చంద్రబాబు అరెస్టు.. ఇలా చెప్పుకుంటూ పోతే… లెక్కలేనన్ని పరిణామాలు జరుగుతున్నాయి. అసలు స్కామేంటో చెప్పాలని.. ఒక్క రూపాయి చంద్రబాబు కు చేరిందో చెప్పాలని కోర్టులు మొత్తుకుంటున్నా ఒక్క సాక్ష్యం చూపించలేకపోతున్నారు. కానీ ట్విస్టేమిటంటే వారు జైళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ హిట్ లిస్ట్ లో మొదటిగా ఉంటుంది. అందులో సందేహం లేదు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ అది. ఢిల్లీలో పాతుకుపోయింది. పంజాబ్‌లో జెండా ఎత్తింది. ఇతర చోట్ల కూడా ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ పార్టీ ముఖ్య నేతలు ఇప్పుడు జైలుకు దగ్గరలో ఉన్నారు. కేజ్రీవాల్ ను కూడా లోపలేస్తారని నేరుగానే చెబుతున్నారు. దక్షిణాదిలో చంద్రబాబును కటకటాల వెనక్కి పంపారు. అటు కేంద్రంలో అయినా.. ఇటు రాష్ట్రాల్లో అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనుకున్న వారిపై ఏదో ఓ కేసు పెట్టి .. సాక్ష్యాలు ఉన్నాయా లేవా అన్నది కూడా చూడకుండా జైలుకు పంపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎమర్జెన్సీ కాలంలోనే ఉండేవి. ఇప్పుడు ప్రకటించకపోయినా అదే పరిస్థితి ఏర్పడుతోందన్న అభిప్రాయం కల్పిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో ఆమ్ ఆద్మీ మెడకు ఉరితాడు బిగించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో స్కామ్ ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ అరెస్టు చేసిన వారిని నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. ఆప్ నేతలు ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారు. ఇతర నేతలు బయటకు వచ్చేశారు. సౌత్ లాభీ చీఫ్‌గా ఉన్న కవిత అసలు అరెస్టు కాలేదు. న్యూస్ క్లిక్ న్యూస్ వెబ్ సైట్ పై రాత్రికి రాత్రి దాడి చేసిన పోలీసులు .. అందర్నీ అరెస్టు చేసేశారు. కోర్టుల్లో చైనాతో కలిసి కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా అలాంటిది చేసి ఉంటే.. ఇలా పోలీసులతో దాడులు చేయించి.. కోర్టుల్లో ఆరోపణలు చేయిస్తారా ?. దేశద్రోహం కేసులు పెట్టి ఉండేవారు కాదా ?. న్యూస్ క్లిక్ పోర్టల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రశ్నిస్తుంది. అందుకే అరెస్టులని ఎక్కువ మంది నమ్ముతున్నారు. రాజకీయాల కోసం అరెస్టులు .. ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టి.. తాము ఎన్నికలకు వెళ్లాలన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటివి చేసినప్పుడు దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు బలంగా ఉన్నాయా లేకపోతే… అధికారంలో ఉన్న వారు ఆడుతున్నట్లుగా ఆడుతున్నాయా అన్న అనుమానం రాక మానదు.
రాజ్యాంగం ప్రకారం పాలసీ మ్యాటర్స్ లో ముఖ్యమంత్రికి అధికారం ఉంది . కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు దర్యాప్తు సంస్థలకు లేదు. ముఖ్యమంత్రి అంటే ఓ వ్యవస్థ. ఆయన వ్యక్తి కావొచ్చు కానీ.. విధి నిర్వహణలో ఆయనో వ్యవస్థ. రాష్ట్ర ప్రజలు పరిపాలించమని అధికారం ఇస్తారు. కేబినెట్ మంత్రులతో కలిసి పరిపాలిస్తారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అధికారులు అమలు చేయాలి. ఇది పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే అధికారులదే తప్పు. ఇప్పటి వరకూ మన అధికార వ్యవస్థ గురించి మనం తెలుసుకున్న పాఠం ఇది.. కానీ ఏపీలో దర్యాప్తు సంస్థలు… రాజకీయాలు ..దీనికి కొత్త అర్థం చెబుతున్నారు. ప్రతీ దానిి ముఖ్యమంత్రిదే తప్పంటున్నారు. జీవోలు జారీ చేసిన అధికారులు… క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసిన వారు.. డబ్బులు విడుదల చేసిన వారు.. ప్రాజెక్టును అమలు చేసినవారు అందరూ అమాయకులు ఒక్క ముఖ్యమంత్రిదే తప్పంటున్నారు. స్కిల్ ప్రాజెక్టులోనూ… ఫైబర్ నెట్ ప్రాజెక్టులోనూ నిధుల దుర్వినియోగం జరిగిందో… లేకపోతే అవినీతి జరిగిందో దర్యాప్తు సంస్థలు చెప్పడం లేదు. కానీ చంద్రబాబును నిందితుడిగా చేర్చేశారు. ఆయన ఎలా నిందితుడు అంటే… కాంట్రాక్ట్ పొందిన కంపెనీ చంద్రబాబు సన్నిహితుడని వాదిస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు ఇలాంటివి బాగుంటాయి కానీ… న్యాయస్థానాల్లో ఎలా వాదిస్తారు అన్నది … వ్యవస్థపై కనీస అవగాహన ఉన్న వారికి ఆశ్చర్యం. కానీ అదే జరుగుతోంది. చంద్రబాబుకు ఎలా ప్రమేయం అనేదానికి చిన్న ఆధారం లేకుండానే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులోనూ అదే పరిస్థితి. నిజానికి ఆ ప్రాజెక్టు ఖర్చు మూడు వేల కోట్లుపైగానే ఉంటుంది. అంత ఖర్చు భరించలేక… వైర్లను కరెంట్ పోల్స్ మీదుగా వేయడం ద్వారా చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేశారు. కానీ ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పకుండా కేసులు పెట్టేశారు. న్యాయస్థానాల్లోనూ అదే వాదన వినిపిస్తున్నారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు జరిగిందే ఏపీలో చంద్రబాబుకు జరుగుతోంది. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి జరుగుతోంది. భీమా కోరేగావ్ కేసు పేరుతో ప్రజాసంఘాల నేతలందర్నీ సుదీర్ఘ కాలంగా జైళ్లోల ఉంచుతున్నారు. ఎవరికీ ఊరట లభించడం లేదు. ఆ తరహా కేసుల స్ట్రాటజీని ఇప్పుడు ప్రతిపక్ష నేతలు.. తమకు ఎదురు నిలబడతారనుకున్న వారిపై ప్రయోగిస్తూ .. ఎమర్జెన్సీలో ఉన్నామా అన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు.
దేనికైనా ఓ పద్దతి ఉంటుంది. అవినీతి జరిగితే….. మనీ ఏ పద్దతిలో నిందితుడు అందుకున్నారో చూపించాలి. లాలూ యాదవ్, జయలిత, జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో సీబీఐ … కొన్ని వేల కోట్లు ఎలా అందుకున్నారో కోర్టులకు చూపించాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అరెస్టులకు అలాంటివేమీ అవసరం ఉండటం లేదు. బాధితులకు న్యాయస్థానాల్లోనూ ఊరట దక్కడంలేదు. ఇది ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం.
రాజ్యాంగం ప్రకారం ప్రజల రక్షణ కోసం ఏర్పడిన వ్యవస్థలు దారి తప్పితే ప్రజల్లో ఏర్పడే ఆందోళన అంతా ఇంతా కాదు. తమకు ఎక్కడా న్యాయం లభించదని వారు అనుకునే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. అరాచకం రాజ్యమేలుతుంది. ఎఫ్ఐఆర్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చని ఎవరూ అనుకోవడం లేదు. అసలు నిందితుడు కాని వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అసాధారణం. అసలు అరెస్టు చేసిన వ్యక్తిపై ప్రాథమిక ఆధారాలు ఒక్కటంటే ఒక్కటి చూపలేకపోయారు. ఆయినా ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అంతటి హోదాలో ఉన్న వ్యక్తికే ఆ పరిస్థితి వస్తే ఇక సామాన్యులకు న్యాయం అనేది దక్కుతుందా ?. రక్షణ వ్యవస్థల నుంచి భరోసా ఉంటుందా ?. పధ్నాలుగేళ్ల మాజీ ముఖ్యమంత్రికే ఆ పరిస్థితి వచ్చింది. పదవిలో ఉన్న డిప్యూటీ సీఎంకూ అంతే. మీడియా ప్రతినిధులకూ అంతే. అందులోనూ మళ్లీ భిన్నమైన కేసులు ఉంటాయి. టీఆర్పీ స్కాములో అరెస్టు అయిన ఆర్నాబ్ గోస్వామి అనే జర్నలిస్టు పది రోజుల్లో జైల్లో ఉన్నారు.. పదొకండో రోజు సుప్రీంకోర్టు అర్థరాత్రి పూట విచారణ జరిపి విముక్తి ప్రసాదించేసింది. మరి అలాంటి వారికి దక్కిన న్యాయం రాజకీయ అరెస్టుల్లో ఎందుకు దగ్గడం లేదు.
మనీష్ సిసోడియా కేసులో మనీ ట్రయల్ ఏదని సుప్రీంకోర్టు అడిగింది. దర్యాప్తు సంస్థ దగ్గర సమాధానం లేదు. న్యూస్ క్లిక్ విషయంలో చైనా నుంచి వచ్చిన నిధుల వివరాలేమిటంటే… షావోమీ సంస్థలు ప్రకటలు ఇచ్చాయని చెబుతున్నారు. అదే చైనాతో కలిసి కుట్ర పన్నడం అయితే.. చైనా కంపెనీలు ఎన్ని వేల కోట్లు ఇక్కడ ప్రకటలు ఇస్తున్నాయో అంచనా వేయడం కష్టం కాదు. ఏపీలో ఇన్నర్ రింగ్ రోడ్ అనే కేసులో అసలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ మార్చారని.. ఎవరికో లబ్ది చేకూర్చారని కేసులు పెట్టారు. దాన్ని వ్యవస్థలు ఇలాంటి కేసులు ఎలా పెడతారని ప్రశ్నించలేకపోయాయి. ప్రభుత్వం టార్గెట్ చేసిన వారికి ముందస్తు బెయిల్స్ ఇవ్వడం వంటివి చేస్తున్నాయి.. కానీ ఇందులో ప్రాధమిక ఆధారాలేవని ప్రశ్నించలేదు.
ప్రజల్లో సామాన్యులు చట్టబద్దంగా, న్యాయబద్దంగా బతుకుతారు. ఎందుకంటే గీత దాటితే తాము జీవితం కోల్పోతామని తెలుసు. కానీ అధికారం ఉన్న వారు ఇష్టారాజ్యంగా బతికి.. తాము అన్నింటికీ అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తారు . కానీ అందరూ సమానమేనని ప్రజా జీవితాల్ని తప్పుడు విధానాలతో ఎవరూ నిర్వీర్యం చేయలేని వ్యవస్థలు నిరూపించాల్సి ఉంది. కానీ రాజ్యాంగ వ్యవస్థలు బలంగా ఉన్నా.., వాటిని నడిపేవారు కూడా మనుషులే కదా అన్నట్లుగా ఉంది. చట్టం, న్యాయాలను పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడుతూండటంతో… ఇక మా లాంటి వారికి రక్షణ ఎలా ఉంటుందన్న ఆందోళన అన్ని చోట్లా వినిపిస్తోంది.
ప్రత్యర్థుల్ని అరెస్టు చేసి తాము అధికారం చెలాయించవచ్చనుకునే పాలకుల మనస్థత్వమే నియంతృత్వానికి పునాది. భారత పాలకుల్లో అది పెరుగుతోంది. చివరికి ఎక్కడకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…