తెలుగుదేశం పార్టీ విషయంలో కేంద్రంలోని బిజెపి వైఖరి ఏంటి? ఏపీ లోని బిజెపి నేతలు ఏం చేస్తున్నారు? కేంద్రంలో బిజెపితో పొత్తులో ఉన్న జనసేన ఇటు టిడిపితోనూ పొత్తు ఖాయమని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అసలు ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? టిడిపితో పొత్తుకు బిజెపి ససేమిరా అంటే పవన్ కళ్యాణ్ బిజెపికి కటీఫ్ చెప్పేస్తారా? టిడిపి -జనసేనలే ఎన్నికల బరిలో కలిసికట్టుగా దిగుతాయా? చంద్రబాబు నాయుడి అరెస్ట్ నేపథ్యంలో బిజెపి అగ్రనేతల వైఖరి ఏంటి? ఏపీకి చెందిన బిజెపి నేతల వైఖరి ఏంటి? మొత్తం వ్యవహారం అంతా పరమ కంగాళీగా ఉందంటున్నారు రాజకీయ పండితులు. టిడిపి -బిజెపి జాతీయ నాయకత్వాల మధ్య డీల్ కుదిర్చేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
2014 తరహాలో 2024 ఎన్నికల్లోనూ బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు భావించారు. అందుకోసం ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఏ నరేంద్ర మోదీనైనే వ్యక్తిగతంగా మాటలతో దాడి చేశారో అదే మోదీ పాలన అద్భుతమని పొగిడారు చంద్రబాబు. అయినా మోదీ నుండి టిడిపికి సానుకూల స్పందనలు ఏమీ రాలేదు. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా టిడిపి-బిజెపిల మధ్య ప్యాచ్ వర్క్ పూర్తి చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
పొత్తుల మాట దేవుడెరుగు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. దీని వెనుక కేంద్రంలోని బిజెపి హస్తం ఉందని కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్ ను బిజెపి అగ్రనేతలు ఎవరూ ఖండించలేదు. ఇతర రాజకీయ పార్టీలు కొన్ని చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరిగ్గా లేదని అయినా అన్నారు. బిజెపి జాతీయ నేతలు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఏపీకి చెందిన బిజెపి నేతలు మాత్రం చంద్రబాబు నాయుడి అరెస్ట్ ను ఖండించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అసలు స్కాం జరగలేదని కూడా ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి క్లీన్ చిట్ ఇచ్చారు.
బిజెపి మిత్ర పక్షమైన జనసేన మాత్రం చంద్రబాబు నాయుడి అరెస్ట్ ను తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును జైలుకు పంపిన తర్వాత టిడిపితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని ప్రకటన చేశారు. బిజెపితో సంప్రదించకుండానే టిడిపితో పొత్తు ప్రకటన చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే బిజెపి నేతలు జీ 20 సదస్సులో బిజీగా ఉండడం వల్లనే పొత్తు విషయంలో తానే నిర్ణయం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత వారాహి యాత్రలో చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యానించారు. మన దేశంలో అవినీతి అనేది అసలు ఇష్యూనే కాదన్నారు పవన్.అవినీతి అన్నది ఏ స్థాయి వరకు చేస్తే ఆమోద యోగ్యమో డిబేట్ జరగాలని సూచించారు .
బిజెపి జాతీయ నాయకులు మౌనంగా ఉండడం..ఏపీ బిజెపి నేతలు మాత్రమే చంద్రబాబుకు అండగా నిలవడం వెనుక పార్టీ అగ్రనాయకత్వం వ్యూహం ఏమైనా ఉందా? అన్న చర్చ కూడా నడుస్తోంది. టిడిపి నేతలు పదే పదే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసే విమర్శలనే ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అంది పుచ్చుకోవడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మద్యం విధానం పై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని పురంధేశ్వరి డిమాండ్ చేయడం కూడా టిడిపి పార్టీ లైనే అంటున్నారు వారు. ఈ క్రమంలోనే టిడిపి-బిజెపిలను కలపడానికి పురంధేశ్వరి ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో మొదటే అవినీతిని గుర్తించింది కేంద్రం పరిధిలోని జి.ఎస్.టి. అధికారులే. ఆ తర్వాత కోట్లాది రూపాయల ప్రజాధనం షెల్ కంపెనీల ద్వారా ఎలా తరలిపోయిందో దర్యాప్తు చేసి కొందరిని అరెస్ట్ చేసింది కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులే. స్కిల్ స్కాంపై వందపేజీలకు పైగా నివేదికను కూడా సమర్పించింది ఈడీ. చంద్రబాబుకు అందిన కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. మొత్తం మీద అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థల పాత్రే ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…