ఎన్నికల ఫలితాలు వచ్చాయంటే కేటీఆర్ మెజార్టీ ఎంత, హరీష్ రావు మెజార్టీ ఎంత, వీళ్లిద్దరి కంటే ఎంత మందికి ఎక్కువ మెజార్టీ వచ్చిందనే టాక్ కొన్ని రోజులు నడుస్తుంది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయల్లో వాళ్లకంటూ వాళ్లు ఏర్పరచుకున్న ఇమేజ్ అలాంటిది. ఇప్పుడు కూడా అదే టాక్ రావడం ఖాయం. దానికి తగ్గట్టుగా కేటీఆర్, హరీష్ ఇద్దరూ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ కంటే ముందే ఇద్దరు లీడర్స్ బాగా యాక్టివ్ గా తిరుగుతున్నారు. పోలింగ్ తేదీ వరకు వాళ్లిద్దరు అంతే యాక్టివ్ గా ఉంటారు. వాళ్లే సీఎం కేసీఆర్ తనయుడూ తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కే. తారక రామారావు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు అని చెప్పక తప్పదు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న స్పష్టమైన సమాచారం తోనే బావాబామ్మర్దులు నిన్నటిదాకా జోరు పెంచారు. కోడ్ అమల్లోకి రాకముందే.. ఆయా నియోజకవర్గాల్లో వందల కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇంటి వద్దనే ఉన్నప్పటికీ.. మంత్రులు కేటీఆర్, హరీష్ అంతా తామే అయి ప్రజల్లోకి వెళ్ళారు. సమయం తక్కువ కావడంతో హెలికాప్టర్లు వేసుకొని మరీ ఒకేరోజు రెండు, మూడు నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు.. మరోవైపు సభల్లో వాడి వేడి ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేశారు. ఇటీవలి కాలంలో వారిద్దరూ 50 నియోజకవర్గాల్లో పర్యటించినట్లు బీఆర్‌ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.వాళ్లకు ప్రతీ నియోజకవర్గం తెలుసు. ప్రతీ కార్యకర్తను పేరు పెట్టి పిలవగలరు. ప్రతీ ఒక్కరితో ఫ్రీగా మాట్లాడే స్వాతంత్రం ఉంది. అందుకే వాళ్లిద్దరూ అత్యంత పాపులర్ లీడర్స్ అయ్యారని చెప్పక తప్పదు.
కేసీఆర్ కు ఛాతిలో ఇన్ఫెక్షన్ కారణంగా ప్రగతి భవన్ లో పరిమితమయ్యారు. దానితో కేటీఆర్ అన్నీ తానై పనులు చేస్తూ వచ్చారు. మోదీ నుంచి అమిత్ షా వరకు, రేవంత్ రెడ్డి నుంచి బండి సంజయ్ వరకు ఎవరు ఏమి మాట్లాడినా అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు గట్టి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని అనడానికి మాకేమైనా పిచ్చి కుక్క కరించిందా అని కేటీఆర్ చెప్పిన సమాధానం జనంలోకి బాగానే వెళ్లింది. పైగా బీజేపీనే తమతో పొత్తు పెట్టుకునేందుకు డాక్టర్ లక్ష్మణ్ ద్వారా వర్తమానం పంపిందని కేటీఆర్ ఎదురుదాడి చేశారు. నిజానికి కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ మంచి స్పీకర్స్. వాళ్లు మీటింగుకు వస్తున్నారంటే వినేందుకు జనం పరుగులు పెడతారు. ఎక్కడ పార్టీ స్తబ్దుగా ఉందో గుర్తించి వాళ్ల అక్కడికి వెళ్లి కార్యకర్తలను ఉత్తేజ పరిస్తారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అంతే. కేసిఆర్ కోలుకుంటున్నారని ఈ నెల 15 నుంచి ప్రచారం ప్రారంభించి పోలింగ్ నాటికి వంద సభల్లో ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు కూడా అదే స్థాయిలో చేరి ఒక సంచురీ కొట్టాలని చూస్తున్నారట.
సిరిసిల్లలో కేటీఆర్ కు 89 వేల మెజార్టీ వచ్చింది. సిద్దిపేటలో హరీష్ రావుకు లక్షా 18 వేలు మెజార్టీ వచ్చింది. ఈ సారి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిసిన నేపథ్యంలో మెజార్టీ తగ్గినా ఆశ్చర్యం లేదు. ఐనా పార్టీని నడిపిస్తూ, పార్టీ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తూ వాళ్లిద్దరూ ముందుకు నడుస్తున్నారు. ప్రచారంలోనూ కీలకంగా ఉండబోతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…