తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా జైలుకు పంపారని నారా లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. 73 ఏళ్ల వయసు మీద పడిన వృద్ధుణ్ని దుర్మార్గంగా వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడితో పాటు తనపైనా కేసులు బనాయించి రాజకీయకక్ష సాధింపునకు తెగబడుతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని.. ఆయన అమిత్ షాను కోరినట్లు లోకేషే వివరించారు. లోకేష్ -అమిత్ షా భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది. ఏపీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంపై లోకేష్ చాలా ఫిర్యాదులు చేశారని కూడా చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయని 371 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత నెల 9న చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తన తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన తరపున న్యాయస్థానాల్లో వాదించే న్యాయవాదులను మానిటర్ చేయడానికి నారా లోకేష్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి కూడా తెలిసిందే. . ఈ క్రమంలోనే బిజెపి అగ్రనేతలను కూడా కలవాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని భోగట్టా.
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నెల రోజులు దాటిపోయినా ఆయనకు బెయిల్ రాలేదు. అదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో ఏపీ సిఐడీ పోలీసులు నారా లోకేష్ ను విచారణకు పిలవడంతో రెండు రోజుల పాటు ఆయన ఏపీలోనే ఉండి విచారణకు హాజరయ్యారు. అది ముగియగానే తిరిగి తన పనుల కోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ సారి ఏపీ బిజెపి అధ్యక్షురాలు , తన తల్లికి స్వయానా అక్క అయిన దగ్గుబాటి పురందేశ్వరి సహకారంతో లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ పొందారు. నారా లోకేష్ తో పాటే ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలంగాణా బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో లోకేష్ తాను చెప్పదలచుకున్న అంశాలన్నీ షాకి వివరించారు. అన్నీ ఓపిగ్గా విన్న అమిత్ షా చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందో ఆరా తీశారని లోకేష్ అంటున్నారు.
అమిత్ షా-లోకేష్ ల మధ్య ఏమేమి సంభాషణలు జరిగాయి..లోకేష్ ఏమేమి విషయాలను అమిత్ షా దృష్టికి తెచ్చారు? వాటిపై అమిత్ షా ఏ విధంగా స్పందించారు? అన్నవి బయటి ప్రపంచానికి తెలీదు. అక్కడ ఉన్న కిషన్ రెడ్డి, పురందేశ్వరిలతో పాటు మాట్లాడుకున్న అమిత్ షా-లోకేష్ లకు మాత్రమే తెలుసు. వీరిలో మిగతా ముగ్గురూ అక్కడ ఏం జరిగిందో చెప్పలేదు కాబట్టి నారా లోకేష్ చెప్పిందాన్నే పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. అయితే ఏపీలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏపీ బిజెపి నేతల్లో కొందరు సీనియర్లు మాత్రం పురందేశ్వరి వ్యవహారంపై గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆమె ఢిల్లీ వెళ్తున్న విషయాన్ని పార్టీలోని సహచర నేతలెవరితో ఆమె మాట మాత్రంగా కూడా చెప్పలేదని అంటున్నారు. పై పెచ్చు పరుచూరు నియోజక వర్గానికి వెళ్తున్నానని చెప్పి ఆమె లోకేష్ కోసం ఢిల్లీ వెళ్లారని వారు అంటున్నారు. ఇది ఏపీ బిజెపికి రాజకీయంగా నష్టమే అంటున్నారు వారు. అమిత్ షా అపాయింట్ మెంట్ తీసుకున్న పురందేశ్వరి ప్రస్తుత తరుణంలో లోకేష్ కు అపాయింట్ మెంట్ ఇస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవు అవుతుందని చెప్పారట.
మొదటిది చంద్రబాబు నాయుడి అరెస్ట్ వెనుక కేంద్రంలోని బిజెపి హస్తం ఉందన్న ప్రచారానికి చెక్ చెప్పినట్లు అవుతుందని ఆమె అన్నట్లు సమాచారం. రెండోది లోకేష్ కు సాయం చేసినట్లు కనిపిస్తే తెలంగాణా ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉందని పురందేశ్వరి చెప్పారట. ఈ రెండు ఆఫర్లూ కూడా బానే ఉన్నాయని అనుకున్నారో ఏమో కానీ అమిత్ షా వెంటనే లోకేష్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. లోకేష్ చెప్పేదంతా వింటూ తలూపితే సరిపోతుంది కదా.. మిగతాది ఎలాగూ న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయి కాబట్టి వ్యూహం ప్రకారమే షా భేటీకి సరే అన్నారని అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…