ఓటు రేటెంత ? ప్రజలు మారతారా ?

By KTV Telugu On 17 October, 2023
image

KTV TELUGU :-

ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో ఏ దేశం కూడా ఎదుర్కోని ప్రమాదకర సమస్యను భారత్ ఎదుర్కొంటోంది. అదేమిటంటే.. ఓట్ల కొనుగోలు.   ఈ సమస్య ఇంతింతై .. వటుడింతై అన్నట్లుగా పెరుగుతోంది. రాజకీయ పార్టీలు.. రాజకీయ నేతలు తెలివి మీరి పోతున్నారు. ఎంతగా అంటే..  ఓటింగ్ ముందు రోజు పంచే సొమ్ము కాదు..  ప్రజల సొమ్మునే ప్రజలకు పంచుతూ ఓట్లుకొనుగోలుచేయడం. ఓటింగ్ రోజో లేకపోతే ముందు రోజో .. ఓటుకు రెండు వేల రూపాయలు ఇవ్వడం అనధికారికంగా ఓట్ల కొనుగోలు చేయడం. ఇది నేరం కూడా.  కానీ ప్రతి ఓటర్‌కు ప్రభుత్వం నుంచి డబ్బుు పంపిణీ చేయడం అధికారికం. ఇలా వేల కోట్లు పంచుతున్నారు.  అధికారికంగా కూడా ఖర్చు వేల కోట్లు దాటిపోతోంది.   ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎంత ఖర్చు పెట్టబోతున్నాయి ?

డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే జబ్బు మన దేశానికే ప్రత్యేకంగా వచ్చింది.  మన దేశంలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు వేసినవారు మొదటి తరం నాయకులు ఉన్నారు. కానీ రాజకీయ అవినీతికి అలవాటు పడిన వారు పెరుగుతున్న కొద్దీ దేశ ప్రజాస్వామ్యానికి ఈ జాడ్యం అంతకంతకూ పెరిగిపోయింది. అధికార దుర్విని యోగానికి ఒడిగట్టడం ప్రారంభించారు. అది ఇప్పుడు ఏ స్థాయికి చేరిదో చెప్పాల్సిన పని లేదు.    ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టి, ఈజీ మనీకి, కష్టం ఎరగని సంపాదనకు అలవాటు పడిన వారంతా ఆ సంపదను రాజకీయాల్లో తగలేసి అధికారంలోకి రావాలని కోరికలు పెంచుకున్నారు. ఒకసారి అధికార వ్యామోహం వారిలో పుట్టిన తర్వాత దానిని చేజిక్కించుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారనేది లెక్కలోకి లేకుండా పోతుంది. ఈ పరిస్థితే… రాజకీయాల్లో ఖర్చుకు పరిమితి లేకుండా చేసిది.

ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే ఓ అభ్యర్థికి భారీగా డబ్బు ఖర్చు పెట్టే శక్తిని మొదటి అర్హతగా భావిస్తున్నారు.   ఎన్నికలు వచ్చాయి అంటే పోటీ చేసే ఆర్థిక స్థోమత కలిగిన వ్యక్తులు కోట్లకు కోట్లు డబ్బులు వెదజల్లడం ప్రస్తుతం సహజమైన విషయంగా మారింది. డబ్బు ఉన్న వారికే రాజకీయ పట్టం కడుతున్నారుడబ్బులు లేని వారికి రాజకీయాల్లో చోటు లేదనే భావన మనదేశంలో చోటు చేసుకుంటోంది. ఏదైనా  నియోజకవర్గంలో ఉపఎన్నిక వస్తే ..  ప్రభుత్వం అక్కడ పథకాల రూపంలో వేల కోట్లు పారిస్తుంది.  తెలంగాణలో ఓ ఉపఎన్నికలో ఇంటికి పది లక్షల చొప్పున దళిత కుటుంబాలకు పంచిన చరిత్ర ఉంది.   ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు సమర్థవంతమైన నాయకున్ని ఎన్నుకొని ప్రజాసేవే పరమావధిగా పాటుపడేలా కృషి చేయడం.  కానీ కోట్లకు కోట్లు డబ్బులు పంచి గెలిచిన అనంతరం వాటిని ఎలా సంపాదించుకోవాలో మాత్రమే సదరు ప్రజా ప్రతినిధి ఆలోచిస్తాడు.  ప్రస్తుత ప్రజాప్రతినిధులలో తహతహ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలా ఓట్లకు అమ్ముడుపోయే ప్రక్రియ ఉంటే ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదకరం.  రాజకీయ నేతలు పంచేదంతా అదంతా ప్రజల సొమ్ము దోపిడి చేసిందే. రాజకీయ అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మే. ఆ సొమ్ము ప్రజలదే. రాష్ట్ర ప్రజలను దోచుకుని.. వనరులు కొల్లగొట్టి ప్రజల ఓట్ల కొనుగోలుకు కేటాయించి.. ప్రజాస్వామ్యాన్ని మన రాజకీయనేతలే నిర్వీర్యం చేస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా భారత ఎన్నికలు మారుతున్నాయి.    ఆశ చూపి వారిని తమ బుట్టలోకి రప్పించుకొనే చాకచక్యాన్ని ధనిక అభ్యర్థులే ప్రదర్శిస్తున్నారు. అందులో సఫలీకృతులవుతున్నారు. ఈ కారణంగా పేద, మధ్య తరగతికి చెందినవారు ఎన్నికల బరిలో నిలబడడానికి భయపడుతున్నారు. చదువుకొన్నవారు, ఆలోచనాపరులు జంకుతున్నారు.    పాశ్చాత్య ప్రజాస్వామ్యాల్లో ఓటర్లు విద్యావంతులు కావడం వల్ల, జీవితావసరాలకు డబ్బు లోటు లేనివారు కావడం వల్ల అక్కడ ఓటుపై ధనప్రభావం వుండదని చెబుతున్నారు.  డబ్బు ప్రభావం ఎక్కువైపోతున్న కొద్దీ పార్టీలు తమ టికెట్లను అమిత సంపన్నులకే ఇచ్చి తీరవలసిన పరిస్థితిలో చిక్కుకొంటున్నాయి. ఇది ఎన్నికయ్యే పార్టీల, వాటి ప్రభుత్వాల పని తీరును కూడా కళంకితం చేస్తున్నది. తాము పెట్టిన డబ్బును అసలువడ్డీలతో సహా వసూలు చేసుకోడానికి తమ చేతిలో వున్న అధికారాన్ని వారు దుర్వినియోగపరుస్తున్నారు.

రాజకీయ నేతలు.  పేరు సంక్షేమ పథకాలు.. కానీ జరిగేది మాత్రం ఓట్ల కొనుగోలు.  సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు కొనుగోలు చేయడం ఇప్పుడు రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నేతలు ఎంత ముందు చూపుతో ఆలోచిస్తారంటే..  గతంలోనే అంత ఇచ్చారు.. ఇప్పుడు ఎంత ఇస్తారోనని ప్రజలు ఆశలు పెంచుకుంటారని వారికి  బాగా తెలుసు.  వారి అంచనాలను అందుకోకపోతే మొదటికే మోసం వస్తుందని తెలుసు. పైగా ఇతర పార్టీలు ఊహించనంతటి పెద్ద పెద్ద హామీలిస్తున్నాయి. వాటిని దాటుకుని.. తనపైనే నమ్మకం పెంచుకోవాలంటే ముందుగానే ఓటర్లకు తగినంత అందచేయాలి. అందుకే అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టారీతిన పథకాల పేరుత వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నాయి. అదంతా ప్రజా ధనమే. ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మో లేకపోతే.. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి చేసే అప్పో.. లేకపోతే.. ఆస్తులు అమ్మేసో పంచేస్తున్నారు. ఓటర్లను రాజకీయ నాయకులు ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే..  ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పథకాలు మాకు రాలేదు కాబట్టి ఓటు వేయమంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకులకే పథకాలు అమలు చేస్తూ..  ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.

ఇప్పుడు రాజకీయ పార్టీలేవీ డబ్బులివ్వబోమని చెప్పడం లేదు. డబ్బులిస్తారు.. తీసుకోండి.. తీసుకుని మాకే వేయండి అని ప్రచారం చేస్తున్నారు. అంటే ఓటర్ల మైండ్ సెట్ ను మార్చినట్లే.. తమను కూడా మార్చుకున్నారన్నమాట.

ప్రజాస్వామ్యం అనేది ఒక ఆలోచనా విధానం. ప్రపంచానికి ఇప్పటి వరకు దొరికిన పాలనా విధానాల్లో అది ఉత్తమమైనది. కానీ ప్రపంచంలో  కేవలం 49% మాత్రమే ప్రజాస్వామ్య పాలనా విధానాన్ని అనుసరిస్తున్నాయి. అంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించని దేశాలు 51 శాతం ఉన్నాయి. చైనా, యూఏఈ, సౌదీఅరేబియా, వియత్నాం, జోర్డాన్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు. ఏక పార్టీ, నియంత, రాచరికం ఇలా రకరకాల పాలనలు ఉన్నాయి. అయినా ఆ ప్రజాస్వామ్యేతర దేశాలు ఆర్థికంగా పరిపుష్టంగా నిలుస్తూ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో సమర్థతను ప్రదర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశం కాకపోయినా విభిన్ననమైన పాలనా విధానంతో సామాజిక, ఆర్థికపరంగా ప్రపంచ శక్తిగా చైనా ఎదిగింది. అయితే ఈ దేశాల పాలకులు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. అందుకే ఆయా దేశాలు అభివృద్ధి చెందాయి. అయితే ఇలా ఏకపార్టీ పాలనలో అయినా ఉండాలి కానీ.. లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యంలో దేశం ఉండకూడదు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే..  అరాచకం రాజ్యమేలుతుంది. ఓట్ల కొనుగోలు ద్వారా ప్రభుత్వాలను ప్రతిష్టించగలిగే పరిస్థితి రావడం అంటే..  చివరి దశకు రావడమే.  యుద్ధం ఒక దేశాన్ని నాశనం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలోని లోపాల వల్ల దేశం నాశనమైపోయిందంటే అంత కంటే దారుణం ఉండదు. కానీ దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది.

ప్రస్తుతం రాజకీయపార్టీల నేతలు ఓటుకు డబ్బులు తీసుకోవద్దని చెప్పడం లేదు.  తీసుకోండి.. తీసుకుని మాకే ఓటు వేయండని ప్రచారం చేస్తున్నారు. ఓటర్లుకూడా వారికి పూర్తిగా ట్యూన్ అయిపోయారు. అన్ని పార్టీలవాళ్లూ డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. ఇవ్వకపోతే ధర్నాలు కూడా చేస్తున్నారు. ప్రజలు కూడా వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న ఆలోచన చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ప్రజలు మాత్రం అలాంటి ఆలోచనలు చేయలేకపోతున్నారు.  చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని..తమకు తాము ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నామని .. హక్కులకు సంకెళ్లు వేసుకుంటున్నామని.. రాష్ట్ర భవిష్యత్‌ను అమ్మేస్తున్నామని తెలుసుకోకుండా పోటీ పడి డబ్బులు తీసుకుని మరీ ఓటేస్తున్నారు. ఈ జాడ్యం ఎంత దారుణంగా ప్రబలిపోయిందంటే టీచర్స్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వారూ డబ్బులు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితి.  టీచర్లూ అంతే. ఇంత దారుణంగా కుళ్లిపోయిన పరిస్థితికి ప్రజాస్వామ్యం చేరిందనడంలో సందేహం లేదు.  పరిష్కారం ఒక్కటే మార్గం.. ప్రజల్లో మార్పురావడం.

ప్రజాస్వామ్యం అనేది అమ్మే సరుకు కాదు. ఓటు హక్కు అనేది వెయ్యికో  రెండువేలకో విలువకట్టేది కాదు. ప్రజలు తెలుసుకున్నప్పుడే భారత్ ఎదుగుతుంది. అంటే ప్రజలు ఎదుగుతారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి