కాపీ మేనిఫెస్టో – కేసీఆర్ రాంగ్ స్టెప్ !

By KTV Telugu On 20 October, 2023
image

KTV TELUGU :-

భారత రాష్ట్ర సమితి మేనిఫెస్టో అంశం హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ కు ట్రూ కాపీ అన్నట్లుగా ఉందన్న విమర్శలు రావడమే దీనికి కారణం.   ప్రతీ హామీకి పేరు మార్చి . .. కాంగ్రెస్ ఇచ్చిన హామీ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు మరింత విశ్వసనీయత తెచ్చి పెట్టింది. ఇప్పుడు బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోను ప్రచారం చేసుకోవడానికి కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కర్ణాటక ఎన్నికలు ముగిసినప్పటి నుండి  తెలంగాణ రాజకీయాల్లో అక్కడి హమీలపై చర్చ జరుగుతోంది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ.., బహిరంగసభల ద్వారా అలాంటి హామీల్ని తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రకటనలు చేయడం. చివరికి ఆరు గ్యారంటీలు పేరుతో  మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు.  ఇవన్నీ సామాన్య జనంలోకి వెళ్లేవే కావడంతో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  కాంగ్రెస్ రేసులో లేకపోతే..ఈ హామల గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు…కారణం ఏదైనా కాంగ్రెస్ రేసులో ఉందన్న అభిప్రాయం రావడంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. అలాంటి హామీలతోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల కావడం కాంగ్రెస్  పార్టీకి మరింత ప్లస్ అయింది.భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ మేనిఫెస్టో  ప్రకటన చేసిన వెంటనే…కాంగ్రెస్‌లో సంతోషం వ్యక్తమయింది.  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఠాక్రే వెంటనే ప్రెస్ మీట్ పెట్టేశారు.

కేసీఆర్  మేనిఫెస్టో ప్రకటన కాంగ్రెస్ కు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని వారి మాటలతోనే స్పష్టమయింది. కేసీఆర్ ఇచ్చిన హామీలతోనే  తమ మేనిఫెస్టో ఎంత బలమైనదో చెప్పుకున్నారు.  ఆ హామీలు అమలు చేయలేరని..  కర్ణాటకలో చేతులెత్తేశారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వస్తోంది. ఇప్పుడు కేసీఆర్ అంతకు మించిన హామీలను ప్రకటించడంతో…  అదంతా అబద్దమని చెప్పినట్లయింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ చెబుతోంది. తాము ప్రకటించిన హామీలు ఏ మాత్రం భారం కాదని కేసీఆర్ సర్టిఫికెట్ ఇచ్చారని… అందుకే అంతకు మించినవి అమలు చేస్తామని చెబుతున్నారని కౌంటర్ ప్రకటిచింది. ఇందులో నిజం ఉంది. కేసీఆర్  ప్రకటించినవన్నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనివే.  కాకపోతే కాంగ్రెస్ ఇస్తామన్న దాని కన్నా తాము ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామని ప్రకటించుకున్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఉత్తుత్తివేనని అమలు చేయలేరని బీఆర్ఎస్ కొంత కాలంగా ప్రచారం చేస్తూ వస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ చేతులెత్తేసిందని కేటీఆర్ తరచూ ఆరోపిస్తున్నారు  రోజూ కర్ణాటక సర్కార్ వైఫల్యాల గురించి చెప్పేవారు. అదే సమయంలో కాంగ్రెస్ హామీలకు మించి తమ మేనిఫెస్టో ఉంటుందని.. మైండ్ బ్లాంక్ అవుతుందని చెప్పడం ప్రారంంభించారు. తీరా చూస్తే… కేసీఆర్ ప్రకటించినవన్నీ.. కాంగ్రెస్ గ్యారంటీలకు కాస్త ఎక్కువ కలిపి ప్రకటించినట్లుగానే ఉన్నాయి.   తమ గ్యారంటీలకు కేసీఆర్ గ్యారంటీ ఇచ్చినట్లుగా ఉందని అంటున్నారు. తమది అమలు చేయలేని మేనిఫెస్టో కాదని.. కేసీఆర్ తన మేనిఫెస్టోలో.. తమ లాంటి పథకాలనే ఎక్కువగా అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రజలకు నమ్మకం ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ ఇచ్చేవారు అయితే.. గత పదేళ్లుగా ఎందుకివ్వలేదన్న ప్రశ్న ఓటర్లకు వస్తుందని.. ఈ విషయంలో… కేసీఆర్ మేనిఫెస్టో తమకు ప్లస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ గట్టి నమ్మకంతో ఉన్నాయి.బీఆర్ఎస్ నేతలు తమ మేనిఫెస్టో గురించి ధైర్యంగా ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రకటించిన పథకాలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. కొత్త పథకాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తే.. సమాధానం ఉండదు.

ఇతర పార్టీల మేనిఫెస్టో ప్రజల్లో చర్చనీయాంశం అయితే  వాటి గురించి వీలైనంత అండర్ ప్లే చేస్తూంటాయి పార్టీలు.  ఎక్కువ చర్చ జరగకుండా  చూసుకుంటారు. కానీ బీఆర్ఎస్ చీఫ్ మాత్రం మరింత ఎక్కువ ప్రచారం లభించేలా చేశారు.  పైగా కాంగ్రెస్ మేనిఫెస్టో  అమలు చేయడం  సాధ్యమేనని గ్యారంటీ ఇచ్చినట్లయింది.    కాంగ్రెస్ పార్టీ 6 హామీలను ప్రకటించింది.  ‘మహాలక్ష్మి’ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,  ‘రైతు భరోసా’ కింద ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ‘గృహజ్యోతి’ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంట్ ఉచితం హామీలను ఇచ్చింది. అలాగే ఇది పూర్తి స్థాయిలో కంగ్రెస్ మేనిఫెస్టో కాదు. ప్రజల్లో విరివిగా ప్రచారం చేయడానికి ముందుగా ప్రకటించిన ఆరు హామీలు.

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన మేనిఫెస్టో ప్రకటన చూస్తే…  కాంగ్రెస్ హామీలకు మరికొంత విలువ జోడించినట్లయింది. ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంపు,  ‘సౌభాగ్య లక్ష్మి’ పథకం కింద అర్హులైన పేద మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల భృతి. పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, అక్రిడేటెడ్ జర్నలిస్టులకు సైతం రూ.400కే గ్యాస్ సిలిండర్, రైతు బంధు మొత్తాన్ని రూ.16 వేలకు దశల వారీగా పెంపు. ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు,  ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు పెంపు. ఇవే కాకుండా తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, రైతు బీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల జీవిత బీమా, అనాథ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ వంటి హామీలను సీఎం కేసీఆర్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు.   కేసీఆర్ ఇలా చేయడం వల్ల… కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తాను గ్యారంటీ ఇచ్చినట్లయింది. ఎందకంటే… కాంగ్రెస్ ప్రకటించిన హమీలకు డబ్బులెక్కడివి అని ప్రశ్నించడానికి … అబద్దాలు చెబుతున్నారని ప్రజల దగ్గర వాదించడానికి అవకాశం లేకుడా పోయింది.  ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకే వస్తోందన్న అభిప్రాయం వినిపిస్దోంది.

మేనిఫెస్టో విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా ఇంపాక్ట్ సాధించగలిగింది. కేసీఆర్ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డారనుకోవచ్చు., మేనిఫెస్టో విషయంలో నిస్సందేహంగా అడ్వాంటేజ్ కాంగ్రెస్ అన్నది రాజకీయవర్గాల అభిప్రాయం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి