ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక పాలిటిక్స్ రసవత్తరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతరావు మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంతారావు మీది ఉన్న ఆరోపణలనే అస్త్రాలుగా బరిలోకి దిగేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. రైగా సైతం తనపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులిచ్చి రివర్స్‌లో ఎటాక్ చేయాలని డిసైడయ్యారు. ఏజెన్సీ ప్రాంతమైన పినపాకలో ఈ సారి పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. అందుకోసం పకడ్బందీగా పావులు కదుపుతోంది.
పినపాక నియోజకవర్గం ఒక్కప్పుడు కమ్యూనిస్టులకు కంచు కోటగా ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కోటగా మారింది. రెండు పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నాయి. అయితే ఎంత మంది ఎమ్మెల్యేలు గెలిచినా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా..ఏజెన్సీలో ఆదివాసీల బ్రతుకులు మాత్రం మారడం లేదు. అవే కష్టాలు.. అవే బాధలు..వర్షకాలం వస్తే చాలు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారు. ST రిజర్వుడ్ నియోజకవర్గం అయినప్పటికీ… ప్రక్కనే ఐటీడీఏ ఉన్నప్పటికీ మౌళిక సదుపాయాలు, విద్య , వైద్యం, రోడ్లు , బ్రిడ్జిలు అంత అంతా మాత్రంగానే ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ నియోజవర్గానికి సింగరేణి బొగ్గు గనులు, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు స్టేషన్, భారజల కర్మాగారం, ఐటీసీ పేపర్ కర్మాగారం , ఉన్నా పాలకుల నిర్లక్షం కారణంగా అభివృద్ధి మాత్రం జరగడంలేదు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కేశారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న రేగా కాంతారావుకే పినపాక టికెట్ కేటాయించారు సీఏం కేసీఆర్. అయితే రేగా ప్రజలతో నేరుగా మాట్లాడరనే చర్చ స్థానికంగా ఉంది.
అంతేకాదు ఇసుక దందా, ఇసుక క్వారీలలో వాటాలు, సుమారు 500 ఎకరాల పోడు భూములు బినామీ పేర్ల మీద ఎమ్మెల్యేకు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అనుచరుల భూకబ్జాలు సెటిల్మెంట్లు.. ఎమ్మెల్యే పేరు చెప్పి జడ్పీటీసీలు దళిత బంధు స్కీములలో రెండు నుండి మూడు లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీ నేతలు కావాలనే తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని రేగా కాంతారావు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాను చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పైర్ అవుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాజీ ఎమ్మేల్యే పాయం వెంకటేశ్వర్లుకే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. టికెట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో గందరగోళ పరిస్తితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి పినపాక నియోజకవర్గం లో గ్రామ స్థాయిలో చెక్కుచెదరని ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి వెళ్ళాక… కాంగ్రెస్ పార్టీలో ఉన్న జిల్లా, రాష్ట్ర నాయకులు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదనే ప్రచారం ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేనంటే నేను అంటూ పది నుంచి 12 మంది అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
మరోవైపు సిపిఐకి సైతం లోకల్ గా బలమైన కేడర్ ఉంది. సీపీఐకి కూడా ఓట్ బ్యాంక్ బాగానే ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో సీటు మాత్రమే గులాబీ పార్టీ గెలుస్తూ వస్తోంది. ఈసారి ఎలాగైనా ఖమ్మం జిల్లాలో పట్టు సాధించాలనే పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకే పినపాకపై దృష్టి కేంద్రీకరించింది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ గూటికి చేరిన రేగా కాంతారావుకు బుద్ధి చెప్పాలని…తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. మరి ప్రజలు ఎవరి జెండా ఎగరేస్తారో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…