జూపల్లే టార్గెట్

By KTV Telugu On 24 October, 2023
image

KTV TELUGU :-

ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయతీ మంటలు రేపుతోంది. బయటి నుంచి వచ్చినవారికి సీట్లు ఇవ్వడంతో సీనియర్ నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. కొందరు రెబల్‌గా పోటీ చేస్తామంటున్నారు. మరికొందరు వేరే పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పుడు కొల్లాపూర్‌లో జూపల్లికృష్ణారావుకు టిక్కెట్ ఇవ్వడంతో అక్కడ హస్తం పార్టీ సెగలు కక్కుతోంది. కొల్లాపూర్ టిక్కెట్ ఆశించిన జగదీశ్వరరావు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆయన కాంగ్రెస్ వీడిన మరుక్షణమే బి.ఆర్.ఎస్. ఆయన్ను క్యాచ్ చేసే ప్రయత్నం చేసింది కానీ ఆయన మాత్రం ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ లో చేరిపోయారు. ఆ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు.

జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ నుంచి అయిదు సార్లు గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కేబినెట్‌లోనూ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది హర్షవర్దన్‌రెడ్డి చేతిలో జూపల్లి ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన హర్షవర్థనరెడ్డి తర్వాత హస్తానికి హ్యాండిచ్చి గులాబీ గూటికి చేరారు. ఇక అప్పటి నుంచి జూపల్లి కృష్ణారావు, హర్షవర్థనరెడ్డి మధ్య వార్‌ నడుస్తూనే వచ్చింది. హర్షవర్థన్ కారణంగా గులాబీ పార్టీలో జూపల్లికి ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో తన ఉనికిని చాటుకునేందుకు స్దానిక సంస్ధల ఎన్నికల్లో జూపల్లి అనుచరులను ఫార్వర్డ్‌ బ్లాక్ పార్టీ నుంచి బరిలో దింపి సత్తా చాటారు. క్రమంగా పార్టీ నాయకత్వంతో కూడా దూరం పెరిగింది. పార్టీపై ఘాటు విమర్శలు చేసి బీఆర్ఎస్‌ నుంచి సస్పెండయ్యారు.

కొల్లాపూర్ కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న జగదీశ్వర్‌రావు, మహిళా నాయకురాలు తిరుపతమ్మ జూపల్లికి టిక్కెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జూపల్లికోసం తాము పనిచేసే పరిస్ధితిలేదని తేల్చి చెప్పేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారిని కాదని గతంలో పార్టీని వీడి తిరిగి పార్టీ గెలిచే అవకాశం ఉండటంతో స్వప్రయోజనాలకోసం కాంగ్రెస్‌లో చేరిన జూపల్లికి సీటు ఎలా ఇస్తారని ఆయన వ్యతిరేకులు కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సీఆర్ జగదీశ్వర్‌రావు తన స్వంత గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మేళనంలో నాగర్‌కర్నూల్ సీటు దక్కని నాగం జనార్దన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

జగదీశ్వర్‌రావు గెలుపుకోసం తన వంతు కృషి చేస్తానని చెప్పిన ఆయన జూపల్లిపై తీవ్ర విమర్శలు చేశారు. జగదీశ్వరరావును బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులు సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది. వాళ్లు కూడ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.కాని జగదీశ్వర్‌రావు అనుహ్యంగా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ పార్టీలో చేరారు. ఆపార్టీ నుంచి కొల్లాపూర్‌లో పోటీ చేసేందుకు ఆయనకు పార్టీ బీఫాం కూడ అందజేసింది. దీంతో కొల్లాపూర్‌లో చతుర్ముఖ పోటీ అనివార్యం కానుంది. ఇక్కడి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

హర్షవర్దన్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి మరోసారి గెలిపించాలని తనను కోరుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుస్తున్న జూపల్లిని ఓడించటాన్ని పార్టీ కూడ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం ఎమ్మెల్యేకు కలిసివచ్చే అంశంగా ఉంది. మంత్రి నిరంజన్‌రెడ్డి సైతం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృషిసారిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి అభిలాష్‌రావు బీఆర్ఎస్‌లో చేరటం ఎమ్మెల్యేకు ప్లస్‌గా మారనుంది. హర్షవర్దన్‌రెడ్డి మాత్రం తాను నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెబుతున్నారు.

బీజేపీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లెని సుధాకర్‌రావు  నియోజకవర్గ ఇంచార్జీగా కొనసాగుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. కేంద్రప్రభుత్వం కృష్ణానదిపై సోమశిల-సిద్దేశ్వరం బ్రిడ్డి మంజూరు చేసిందని తాను దీనికోసం ప్రయత్నించానని చెబుతున్నారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని బీజేపీ నేత అంటున్నారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్‌ లేకపోవటం సుధాకరరావుకు మైనస్‌గా ఉంది. ఆయన మాత్రం ఈసారి మోదీ చరిష్మాతో కొల్లాపూర్‌లో కాషాయ జెండా ఎగరేస్తానని ధీమాగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి