తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ పేరు చెప్పినా.. టీఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. దేశంలో మరే అంశానికీ ప్రాధాన్యం లేదు.. తమ లక్ష్యం తెలంగాణ అని టీఆర్ఎస్‌ను స్థాపించారు. సెంటిమెంట్‌ను రగిలిగించారు. ప్రజలందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. రెండు సార్లు అదే సెంటిమెంట్‌తో అధికారాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా తెలంగాణను పక్కన పెట్టి రాజకీయం చేస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణ పేరును లేకుండా పార్టీ పెట్టి భారత రాష్ట్ర సమితిగా పోటీ చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలు మార్పుని ఆహ్వానిస్తారా ?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు. ఉద్యమం. తెలంగాణ ఉద్యమం.ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చడం.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్‌కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమమే అండగా నిలిచింది. అలాంటిది కేసీఆర్ ఆ తెలంగాణను ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశారు. ఇక నుంచి తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నారు. అంటే కేసీఆర్ తన పునాదుల్ని తానే వీక్ చేసుకున్నట్లు అయింది. ఆ ప్రభావం ఇప్పుడు ఎన్నికల్లో కనిపిస్తోంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చినప్పుడు చాలా మంది రిస్క్ చేస్తున్నారని అనుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మార్చారు. జాతీయ పార్టీలన్నీ దండగా.., తెలంగాణ మన ఇంటి పార్టీ.,. వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యే వారు. మన పార్టీ అనే భావన.. సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు రక్షణ కవచంగా ఉండేది. ఉద్యమ సమయంలో ఇతర పార్టీలన్నింటీనీ వేరే ప్రాంత పార్టీలు అన్న ముద్ర వేయడంతో మన పార్టీ అనే భావన పెరిగింది. కేసీఆర్ అంటే ప్రాంతీయ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వారు. ఆయన తమ ప్రాంతం కోసం పోరాడారని అనుకుంటారు. ఆయనను జాతీయ నాయకుడిగా చూసే ముందు తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడారని గుర్తు పెట్టుకుంటారు. అలాంటిది తెలంగాణను సాధించడం కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అంతర్థానం అయిపోయింది. ఆ స్థానంలో భారత రాష్ట్ర సమితి ఏర్పడింది. స్వయం పాలన భావజాలంతో ఏర్పడిన పార్టీతో కేసీఆర్ తాను అనుకున్నది సాధించారు. కానీ పదేళ్ల తర్వాత పార్టీ పేరు మార్చడం ద్వారా సీఆర్ తన పునాదుల్ని తానే పెకిలించుకున్నారని ఎక్కువ మంది భావిస్తున్నారు.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం.. తెలంగాణ స్థానంలో భారత్ ను చేర్చడంతో విపక్ష పార్టీలు మొదట్లోనే విమర్శలు చేశాయి. కేసీఆర్ ను తెలంగాణ వ్యక్తిగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంగీకరించరు. ఆయన మూలాలు బీహార్‌లో ఉన్నాయని.. పూర్వీకులు విజయనగరం నుంచి వచ్చారని చెబుతూ ఉంటారు. దీన్నే గుర్తు చేస్తూ.. కేసీఆర్‌కు తెలంగాణతో పేగుబంధం లేదని.. ఇప్పుడు పేరు బంధం కూడా తొలగించుకున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ అనే పదంతో రుణం తీర్చేసుకున్నారని అంటున్నారు. ఇవి రాజకీయ విమర్శలే కానీ.. నిజంగా చాలా మందిది అదే అభిప్రాయం. కేసీఆర్ తెలంగాణను వదిలేస్తున్నారని అప్పట్లో నమ్మారు. ఇప్పుడు కాస్త వెనుకబడినా… పోటీ పడుతోది టీఆర్ఎస్ కాదు.. బీఆర్ఎస్ అనే భావన ప్రజల్లో పెరుగుతోంది. ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేము.
తెలంగాణ ఏర్పాటు ఓ అద్భుతం. చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కేసీఆర్ పట్టుదలతో ప్రయత్నించడం వల్ల అది సాధ్యమయింది.అయితే కేసీఆర్ ఒక్కడి వల్లే రాలేదు. కానీ ఆయనకు క్రెడిట్ వచ్చింది. ప్రతీ సారి అలాంటి అద్భుతాలు కోరుకోవడం అత్యాశే. ఎందుకంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అని ప్రజల్లో నిగూఢంగా ఉన్న కోరికను వెలికి తీయడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. ఎలాంటి సెంటిమెంట్ లేకుండా ప్రజల్ని తన వైపు చూసేలా చేసుకోవడం అంత తేలిక కాదు. ఏదో గాల్లో రాయి వేద్దమనుకుంటే ట్రై చేయవచ్చు కానీ.. ఇక్కడ పునాదులు కదిలిపోతే.. తర్వాత చరిత్ర మారిపోతుంది. అలాంటి ప్రమాదాన్ని కేసీఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్ ద్వారానే పోటీ అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. మూడోసారి తెలంగాణలో గెలిస్తే … వచ్చే ఇమేజ్ తో దేశాన్ని దున్నేయవచ్చని అనుకుంటున్నారు.
కోట్ల మంది ప్రజల స్వప్నం తెలంగాణ రాష్ట్రం. దాన్ని నిజం చేసి చూపించారు కేసీఆర్. తెలంగాణ సాధకునిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయన ఇప్పుడు దేశాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. రాజకీయాలు చాలా మంది గెలుపోటములుగా చూస్తారని తనకు మాత్రం టాస్క్ అని ఆయన చెబుతున్నారు. తెలంగాణను ఎనిమిదేళ్లలోనే కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశానని.. అదే మోడల్‌తో దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన జాతీయ రాజకీయాలు ప్రారంభించారు. తన రాజకీయ జీవితాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన టీఆర్ఎస్ పార్టీని కూడా ఆయన బీఆర్ఎస్‌గా మార్చారు. కవచకుండలం లాంటి తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వదులుకున్నారు.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు … ఆయన అడుగులు… ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టి పడేస్తాయి.. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్లుగా రిటైరయ్యే దశలో కొత్త టాస్క్ ఎంచుకున్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి వెళ్తున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వారికి ఆయనను తక్కువ అంచనా వేయలేరు. ఎందుకంటే అసాధ్యం అనుకున్న పనులెన్నో ఆయన చేసి చూపించారు. అందుకే… అన్నీ వ్యతిరేకంగా కనిపిస్తున్నా.. బీఆర్ఎస్ కనీస ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలబెట్టగలదా అనే డౌట్స్ ఉన్నాయి. అదే నిజం అవుతోంది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేశాకా… ఇతర రాష్ట్రాల్లో ఎన్ని ఎన్నికలు జరిగినా ఒక్క సారి కూడా పోటీ పెట్టలేదు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నది కళ్ల ముందు కనిపించే నిజం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి .. రైతులకు అండగా నిలబడటానికి ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన చేసే రాజకీయాల విషయంలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండంవచ్చు కానీ.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన చిత్తుశుద్ధిని ఇతర పార్టీల నేతలు కూడా శంకించరు. రాజకీయాలకు.. అభివృద్ధికి ఎప్పుడూ ముడిపెట్టలేదు. చేయాల్సిన పని చేస్తూనే… ఆయన రాజకీయంగా ముందుకెళ్తున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితంలో ప్రతీ పుట్టిన రోజుకూ ఓ టాస్క్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది సవాల్ గానే ఉంటుంది. దాన్ని ఆయన సింపుల్‌గా అధిగమిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన ఇప్పటి వరకూ తెచ్చిపెట్టుకున్న ఇమేజ్ కూడా ఉండదు. మొత్తం తుడిచి పెట్టుకుపోతుంది.
కేసీఆర్ తనకు.. తన పార్టీకి ఇప్పటి వరకూ అండగా ఉన్న కవచకుండలం లాంటి సెంటిమెంట్ ను వదిలేసి ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఫలితాన్ని బట్టి.. .. చరిత్రలో కేసీఆర్ పేరు ఎలా ఉంటుందన్నది స్పష్టత వస్తుంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి