మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ ..ఎంఐఎం షార్ట్ కట్లో మజ్లిస్ . ఈ పార్టీకి ప్రధాన శత్రువు ఎవరు ?. రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన లేని వారు బీజేపీ అనుకుంటారు. కానీ కాస్త తరచి చూస్తే.. మజ్లిస్ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నది.. నిర్వీర్యం చేయాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ ఎంత బలంగా ఉంటే… తాము అంత బలంగా ఉంటామని మజ్లిస్ నమ్మకం. అందుకే పోటీ పడి మరీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పోటీ చేసి..కాంగ్రెస్ ను దెబ్బకొడుతున్నది. బీజేపీని గెలిపిస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రేసులో లేదు కాబట్టి బీఆర్ఎస్ను గెలిపించాలనుకుంటోంది. కాంగ్రెస్ గెలవకూడదని గట్టి పట్టదలగా ఉంది.
తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాలు జరుగుతున్నాయి. ఎంఐఎం మిజోరం మినహా నాలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తోంది. తెలంగాణలోనూ పోటీ చేస్తోంది. అయితే ఏడెనిమిది స్థానాల్లోనే పోటీ చేస్తుంది. కానీ మధ్యప్రదేశ్, రాజస్ఖాన్, చత్తీస్ ఘడ్‌లలో మాత్రం పదుల సంఖ్యలో పోటీ చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మజ్లిస్ తెలంగాణలో అతి తక్కువ పోటీ చేసి.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఎక్కువగా పోటీ చేస్తోంది. ఇక్కడే ఉంది అసలు రాజకీయం తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ ను నష్టపరచాలని అనుకుంటోంది. ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి నష్టం చేయాలనుకుంటోంది.
తెలంగాణలో ప్రధాన పోటీ అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని చోట్ల బిజెపి ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనధికారిక మిత్రపక్షమైన ఎంఐఎం ఇప్పటికే బిఆర్ఎస్కు పూర్తి మద్దతు తెలిపింది. పరిమిత స్థానాల్లో పోటీ చేసే ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా స్థానాల్లో బిఆర్ఎస్ను బలపరుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని అనుకుంటోంది. తాము పోటీ చేసే పాతబస్తీలోని 7 నియోజకవర్గాలు మినహా మిగితా స్థానాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను బలపరుచాలని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసి ఇప్పటికే పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 12.7 శాతం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 40 నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించే స్థితిలో ముస్లిం ఓటర్లు ఉన్నారని రాజకీయ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌లో ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. పాతబస్తీలోని ఏడు అసెంబ్లీ స్థానాలు మజ్లిస్ పార్టీకి పెట్టని కోటలా ఉన్నాయి. కాగా తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. తెలంగాణ సామాజిక అభివృద్ధి నివేదిక- 2017 ప్రకారం, హైదరాబాద్‌లోనే 1.73 మిలియన్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు, ఇది నగర జనాభాలో నాల్గవ వంతు, రాష్ట్ర ముస్లిం జనాభాలో 43.5 శాతం నగరంలోని 24 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నూ మజ్లిస్ పార్టీకి మంచి పట్టు ఉన్నట్లు భావిస్తున్నారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ముస్లింలు టిఆర్ఎస్కు మద్దతిచ్చారు. ఈ సారి ముస్లిం ఓట్లు గంపగుత్తగా బిఆర్ఎస్కు పడకుండా కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు ఓవైసి భ్రదర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే జాతీయ పరిణామాల కోణంలో ఆలోచిస్తే.. మజ్లిస్ పార్టీ.. కాంగ్రెస్ ను బలహీనపర్చడం ద్వారా బీజేపీకి మేలు చేస్తుందన్న అభిప్రాయానికి ముస్లింలు వస్తున్నారని అంటున్నారు. అందుకే కొంత మందిలో మార్పు వస్తోందని చెబుతున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటించినా అమలు చేయకపోవడాన్ని ముస్లింలలో కొంతమంది వేలెత్తి చూపుతున్నారు. ఈ కారణంగా ముస్లిం ఓటింగ్ కొంత కాంగ్రెస్ వైపు మళ్లే చాన్స్ ఉందని భావిస్తున్నారు. అయినా అసదుద్దీన్ ఓవైసీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా తన వందు ప్రయత్నం చేస్తున్నారు.
ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి మేలు చేస్తోంది మజ్లిస్. ఇది కళ్ల ఎదుట కనిపించే నిజం. మరి కాంగ్రెస్ మజ్లిస్ కు చేసిన ద్రోహమేంటి ? ఎందుకు ముస్లింలకు వర్గ శత్రువులా ప్రకటించుకునే బీజేపీని మజ్లిస్ గెలిపిస్తున్నారు ?
మధ్యప్రదేశ్, రాజస్ఖాన్, చత్తీస్ ఘడ్ లలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల మజ్లిస్ పోటీ చేస్తోంది. నిజానికి గత కొన్నేళ్లుగా పోటీ చేస్తూనే ఉంది. యూపీలోనే కాదు గుజరాత్‌లోనూ బీజేపీని గెలిపించడానికి తన వంతు సాయం చేశారు. యూపీలో వంద సీట్లకు పోటీ చేశారు. ముస్లిం ఓట్లు నాలుగైదు శాతమైనా చీల్చారు. ఇక గుజరాత్‌లోనూ పోటీ చేశారు. చాలా సీట్లలో కాంగ్రెస్ విజయావకాశాల్ని దెబ్బ తీశారు. అసదుద్దీన్.. బీజేపీని ఓడించడమే లక్ష్యమని ఓవైసీ చెబుతూంటారు. బీజేపీని బద్ద శత్రువుగా పరిగణిస్తూంంటారు. బీజేపీ కూడా అంతే. అందుకే బీజేపీని ఓడిస్తామని బరిలోకి దిగుతున్నామని చెబుతూంటుంది. కానీ ఆ పార్టీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి అంతిమంగా బీజేపీకి లాభిస్తోంది. మహారాష్ట్ర, బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగింది అదే. మతతత్వ బీజేపీని ఓడించడానికంటూ బలం లేని రాష్ట్రాల్లో కేవలం ముస్లిం ఓట్లను చీల్చడానికి ఓవైసీ పోటీ చేయడం వివాదాస్పదం అవుతోంది. నిజంగా బీజేపీని ఓడించాలంటే ప్రత్యర్థి పార్టీలతో పొత్తులు పెట్టుకుని కొన్ని సీట్లు తీసుకుని వారికి సహకరించాలి. కానీ మజ్లిస్ అలా ఎప్పుడూ చేయదు. సొంతంగా పోటీ చేసి ముస్లిం ఓట్లను చీలుస్తుంది. ముస్లింలు ఎంఐఎంకు ఓటేస్తే బీజేపీకి నష్టం ఉండదు. ప్రత్యర్థుల ఓట్లే చీలుతాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసిన అనేక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప తేడాతో గెలుపొందారు. అక్కడ ఎంఐఎం పోటీతో జేడీయూ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు చీలిపోయాయి. ఈ కారణంగా బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు భారీగా ఓడిపోవడంతో ఎంఐఎం చీల్చిన ఓట్లే కీలకం., అక్కడ శివసేన కలవడంతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. యూపీలో మజ్లిస్ పోటీ చేస్తే ముస్లిం ఓట్లు సమాజ్ వాదీ పార్టీ నుంచి చీలిపోయాయి. అది బీజేపీ నెత్తిన పాలు పోసినట్లు అయింది. ఇక్కడే ఓవైసీ బీజేపీని మద్దతిస్తున్నారని సులువుగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.ఎక్కడ పోటీ చేసినా కాంగ్రెస్ కు పడాల్సిన ఓట్లను చీల్చడం ద్వారా ఆ పార్టీకి నష్టం చేసి బీజేపీకి మేలు చేస్తున్నారన్న విశ్లేషణలు ఇందుకే వస్తున్నాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి మజ్లిస్ కారణం. బీహార్ లోనూ అంతే అని చెబుతున్నారు. ఈ కారణంగానే తెలంగాణ ఓటర్లలో మార్పు వస్తోందని భావిస్తున్నారు. కారణం ఏదైనా కాంగ్రెస్ ను మజ్లిస్ వర్గ శత్రువుగా ప్రకటించుకుంది. బీజేపీకి మేలు చేస్తూనే ఉంది. ఈ సారి కూడా అదే వ్యూహం అమలు చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు మద్దతుదారులుగా ఉన్నారు.కారణం ఏదైనా వారు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల వైపు మళ్లారు. అయినా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు ఆ వర్గం రెడీగా ఉంటుంది. బెంగాల్ లో తృణమూల్ ను ఓడించడానికి ముస్లింఓటర్లను మమతా బెనర్జీ పార్టీకి కాకుండా చేసి బీజేపీని గెలిపించేందుకు అసదుద్దీన్ ప్రయత్నించారు.కానీ అక్కడి ముస్లిం ఓటర్లు మజ్లిస్ ను పట్టించుకోలేదు. తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అలాంటి ఫలితాలే వచ్చాయి. అందుకే ఈ సారి కూడా ముస్లిం ఓటర్లు చైతన్యవంతులయ్యారని.. ఓవైసీల మాటలు వినరని చెబుతున్నారు. అది ఎంత వరకూ నిజమో కానీ ఓవైసీ మాత్రం … కాంగ్రెస్ మాత్రం గెలవకూడదన్న పట్టుదలకు పోతున్నారు.
రాజకీయం అంటే.. మన ప్రత్యర్థి బలంగా ఉంటే మనం కూడా బలంగా ఉంటాం. ఏ ప్రత్యర్థి ఉంటే మనకు బలం ఉంటుందో.. ఆ ప్రత్యర్థిని కూడా కాపాడుకోవాలి. మజ్లిస్ అదే చేస్తోంది. అందుకే పాతబస్తీలో మరో పార్టీ అడుగు పెట్టడం లేదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…