నిజామాబాద్ సెటిలర్లకు చేయి అందిస్తున్న కాంగ్రెస్

By KTV Telugu On 26 October, 2023
image

KTV TELUGU :-

ఒక్క ఓటు కూడా అవతలి వ్యక్తికి పోకూడదు. ప్రతీ  ఒక్కరినీ తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించాలి. ఆఖరి నిమిషం వరకు గాలం వేస్తూనే ఉండాలి. వీలైనంత మందిని కలుస్తూ పాజిటివ్ పబ్లిసిటీకి ప్రయత్నించాలి. ఇదీ ఎన్నికల వేళ పార్టీలు పాటించే ట్రెండ్. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తూ సెటిలర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం ఇందులో ప్రధానాంశం….

ఎక్కడున్నా  సెటిలర్లకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. తాము స్థిరపడిన ప్రదేశంతో పాటు తాము కదిలివచ్చిన గడ్డపై మమకారం  ఉంటుంది. అక్కడేమీ జరిగినా వారికి అవకాశాన్ని బట్టి ఆనందమూ, ఆందోళన ఏర్పడతాయి. అందులోనూ తెలంగాణలో ఉన్న ఏపీ సెటిలర్లకు ఈ ఫీలింగ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై వారు తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ మొదలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి.చంద్రబాబు అరెస్టు వెనుక బీఆర్ఎస్ కూడా ఉందన్న అనుమానాల నడుమ తెలంగాణ అధికార పార్టీపై వాళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ దిశగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  ఈసారి సెటిలర్ల ఓట్లు కీలకం కాబోతున్నాయి. పైగా చంద్రబాబు అరెస్టుతో సెటిలర్లంతా  ఏకతాటిపైకి వచ్చారని, తమకు నచ్చిన పార్టీకి ఒకుమ్మడిగా ఓటు వేయాలని భావిస్తున్నారని సమాచారం అందడంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది.

కాంగ్రెస్  పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. నిజామాబాద్ జిల్లాలో కొందరు సెటిలర్లను ఎన్నికల బరిలోకి  దించే ప్రయత్నంలో ఉంది. నియోజకవర్గాల వారీగా మరికొందరికి బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నారు. ఈ కోవలోనే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పోటీ చేయించాలని కూడా అనుకుంటున్నారు. బీఆర్ఎస్ లో చేరి పక్కన ఉండిపోయిన మండవ ఇప్పుడు అంత యాక్టివ్ గా లేరు.  ఆయన వస్తే పాతతరం తెలుగుదేశం కార్యకర్తలు కూడా కాంగ్రెస్ వైపుకు వచ్చే అవకాశం ఉంది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న లక్షా  30 వేల సెటిలర్ల ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ విశ్వసిస్తోంది. రేవంత్ స్వయంగా వెళ్లి మండవను ఆహ్వానించడం కూడా ఆ దిశగానే చూడాలి.  దీని  వల్ల ఉమ్మడి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో విజయావకాశాలు మెరుగు పడతాయని భావిస్తున్నారు.

నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలపై ఇప్పుడు కాంగ్రెస్ కన్నేసింది. ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావుతో నిజామాబాద్ సెటిలర్లకు చెప్పించే పనిలో ఉంది. 2018 నుంచి ఖాళీగా ఉన్న మండవ  వెంకటేశ్వరారావు పక్క చూపులు చూస్తున్న వేళ  రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ ఆయనకు నచ్చినట్లే ఉంది. కాకపోతే సెటిలర్లంతా ఆయన వైపు ఉంటారా లేదా అన్నది చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి