తెలంగాణ ప్రజల భవిష్యత్ ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇప్పుడా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కుంగిపోయింది. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడటం అధికార బీఆర్ఎస్ పార్టీకి సమస్యగా మారింది. దశాబ్దాల కిందట కట్టిన బ్యారేజులు, ప్రాజెక్టులు ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ పట్టుమని ఐదేళ్లు కాకుండానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో అధికార పార్టీకి అర్థం కావడం లేదు. అందుకే కొత్తగా కుట్ర కోణంతో ప్రచారం ప్రారంభించారు. కేసులు కూడా పెట్టారు. కానీ కుట్ర చేసింది ఎవరు అనేది ఎవరికీ తెలియదు.కానీ ఉపయోగం లేని ప్రాజెక్టు ద్వారా అసలు కుట్ర చేసింది బీఆర్ఎస్ సర్కారేనన్న విమర్శలకు మేగడిగడ్డ కుంగడం ద్వారా మరింత పదను పెరిగింది.
కాళేశ్వరంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడం వెనుక కుట్ర ఉందని … ఇంజనీర్ ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని పోలీసు శాఖ ప్రకటించింది. ఇందులో మావోయిస్టుల ప్రమేయం లేదని మందుగానే చెప్పి.. పోలీసులు కొంత వరకూ భారం దించుకున్నారు. అంటే.. రాజకీయ కుట్రేనని ప్రచారం చేయడానికి రంగం సిద్ధం చేశారన్నమాట. కానీ అసలు కాళేశ్వరం నిర్మాణమే పెద్ద కుట్ర అని.. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడానికి చేసిన అతి పెద్ద ప్రణాళిక అని ఇంత కాలం వినిపించిన ఆరోపణలకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ఎలా లాభదాయకేమో చెప్పలేకపోతున్న ప్రభుత్వానికి… వచ్చి పడుతున్న సమస్యలు కుట్రగా కనిపించడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేకపోవచ్చు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని లక్ష్మిబ్యారేజీ కుంగడంతో మొత్తం ఆ ప్రాజెక్టు నిర్మాణంపైనే మరోసారిచర్చ ప్రారంభమయింది. నిజంగా ఎందుకు కుంగిందో తెలుసుకోవడం పెద్ద విషయం కాదు. నిపుణులు రెండు, మూడు రోజుల పాటు పరిశీలిన చేశారు. విద్రోహ చర్య వల్ల కుంగితే… వెంటనే ఆనవాళ్లు దొరికిపోతాయి. కానీ అలాంిదేమీ కనిపించకపోవడంతో .. పెద్ద శబ్దం వచ్చిందన్న కారణం చెప్పి కేసు నమోదు చేశారు. అసలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంోనే అతి పెద్ద లోపం ఉందని.. అక్కడ డిజైన్ తేడా ఉందన్న విమర్శలను నిపుణులు కొంత కాలంగా చేస్తున్నారు. నిర్మాణ లోపాలూ ఉన్నాయంటున్నారు. అతి వేగంగా నిర్మించి.. క్వాలిటీని పట్టించుకోలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. మొత్తంగా ఎన్నికలకు ముందు ఇలా జరగడంతో.. వీలైనంత వరకూ చర్చల్లోకి రాకుడా చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కానీ అసలు ప్రాజెక్టే కుట్ర అనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుకు చెందిన లక్ష్మిబ్యారేజీ నిర్మాణం పూర్తయి దాదాపు ఐదేండ్లు అవుతున్నది. బ్యారేజీకి చెందిన 18, 19, 20, 21 పిల్లర్లల్లో 20వ పిల్లర్‌కు పూర్తిస్థాయిలో పగుళ్లు వచ్చి దెబ్బతిన్నట్టు సాగునీటి శాఖ ఇంజినీర్ల అంచనా. అయితే నిజాలను దాచిపెడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అక్కడకు ఎవర్నీ వెళ్లనివ్వడం లేదు. కేంద్ర జల సంఘం కూడా పరిశీలించింది. బ్యారేజీ కుంగిపోవడానికి కారణాలను మాత్రం స్పష్టం చేయలేదు. కాళేశ్వరం నిర్మిస్తున్న సమయంలోనే అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించడం లేదని.. పర్యావరణ ప్రమాణాలను తుంగలో తొక్కారని అనేక మంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు, పర్యావరణ వేదికల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అయినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. శరవేగంగా నిర్మించేందుకు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చింది. చాలా వరకూ పూర్తి చేసింది. ఇప్పటికీ ప్రాజెక్టు వంద శాతం పూర్తి కాలేదు. కానీ .. మొదట చేసిన పనుల్లో లోపాలు బయటపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఒక్క లక్ష్మిపూర్ బ్యారేజీ విషయంలోనే కాదు.. మొత్తం ప్రాజెక్టునే నిపుణులతో పూర్తిస్థాయిలో సమీక్ష చేయాలనే డిమాండ్ ను విపక్షాలు చేస్తున్నాయి.
కాళేశ్వరం వల్ల అసలు లాభమేనా .. అన్న చర్చ కొంత కాలంగా ఉంది. లక్ష కోట్లకుపైగా పెట్టుబడి పెట్టారు. కానీ ఎంత సంపద సృష్టిస్తుందన్నదానిపై క్లారిటీ లేదు. కానీ కరెంట్ బిల్లులకు వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంత చేసి ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు. అందుకే ఈ ప్రాజెక్టుపై పూర్తి స్తాయి సమగ్ర పరిశీలన అవసరమన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.
ఏడు లింకులు 28 ప్యాకేజీలతో కాళేశ్వరంను నిర్మించారు. మొత్తం అప్పులతోనే చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్ల రీపేమెంట్లకు ఏటా 13 వేల కోట్లకు పైగా అవసరం. ప్రాజెక్టు ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ కోసం ఏటా 272 కోట్లు కావాలి. ఈ లెక్కన ఏడాదికి కనీసం 25,109 కోట్లు అవసరం.. అంటే నెలకు కనీసం 2,100 కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆయకట్టుకు ఇచ్చే నీళ్లకు రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేస్తామని.. తాగునీరు, ఇండస్ట్రీస్‌కు ఇచ్చే నీటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ప్రాజెక్టు డీపీఆర్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి నాలుగేండ్లయినా గరిష్టంగా ఒక్క సీజన్లో 74 వేల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేదు. ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు ఈ ప్రాజెక్టు కింద పంట కాల్వలే లేవు.
రీ ఇంజనీరింగ్ పేరిట ఎక్కువ ఎత్తు నుంచి కిందికి ప్రవహించే నీటిని తిరిగి అదే ప్రాంతానికి ఎత్తిపోసే తప్పుడు అవగాహనతో ఈ ప్రాజెక్టును నిర్మించారని నిపుణులు వాదిస్తున్నారు. ప్రాజెక్టును మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంతో ప్రయోజనాలేవీ ఉండవని, వేల కోట్ల అదనపు పెట్టుబడి వ్యయం, విద్యుత్, ఇతర నిర్వహణ వ్యయాన్ని వృథా చేయాల్సి ఉంటుందని ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో నడిస్తే విద్యుత్ బిల్లుల ఖర్చే ఏటా 11,359 కోట్లు ఖర్చు అవుతుందని కాగ్ ప్రకటించింది. ప్రాజెక్టు పాక్షికంగా పూర్తయిన తర్వాత మూడేళ్లలో 3 వేల 6 వందల కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో ఒక ఎకరం సాగుకు పెట్టుబడి వ్యయం 6 లక్షల 42 వేలు కానుందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. గత ఏడాది వచ్చిన వర్షాలకు బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయాయి. వందల కోట్ల నష్టం జరిగింది.
కాళేశ్వరంప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు ఆ ప్రాజెక్టు వల్ల రైతులకు అందుతున్న నీరు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటే… కనీసం కరెంట్ బిల్లులు కూడా గిట్టుబాటు కావనేది నిపుణులు ఇప్పటికే అనేక ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇది పూర్తిగా అవినీతి ప్రాజెక్టు ఈ కోణంలోనే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నిర్మాణ లోపాలు కూడా బయటపడుతున్నాయి. ఇంజినీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఆకాశానికెత్తిన ప్రభుత్వంలో, ఇప్పుడు బ్యారేజీ కుంగిపోవడంతో మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేయాలనే డిమాండ్ ప్రతిపక్షాలు, రాజకీయపక్షాల నుంచి వస్తున్నది. లోపాలను గుర్తించి బాధ్యులను పట్టుకునే బదులు, ఆసాంఘీక శక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విషయాన్ని దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అదే అసలు కుట్రన్న ఆరోపణలు ఇందుకే ఇస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల చెమటతో కట్టిన ప్రాజెక్టు. దీని వల్ల ప్రజలకు సంపద పెరగాలి. కానీ జరుగుతోంది మాత్రం వేరు. అందుకే.. అసలు కుట్ర ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేసిన ప్రభుత్వమే చేసిందన్న విమర్శలు రావడానికి కారణం అవుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…