వాస్తవం వద్దంటోంది, ఆశ కావాలంటోంది !

By KTV Telugu On 27 October, 2023
image

KTV TELUGU :-

ఏ రాజకీయ నాయకుడికైనా కావాల్సిందీ  పదవి. అదీ పార్టీ  అధినేత అయితే నిత్యం ముఖ్యమంత్రి  పదవిని కోరుకంటూ ఉంటారు. ఆ నేత అనుచరులు కూడా తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలని కలలుకంటుంటారు. జనసేనలో కూడా అంతే.  సీఎం సీఎం అంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు ఇస్తూనే ఉన్నారు. కుదరదని చెప్పినా వాళ్లు వినడం లేదు. మరి ఇప్పుడు పవన్ మదిలో ఏముంది?  ఆయన ఏమంటున్నారు ?

టీడీపీ, జనసేన  దూకుడును పెంచబోతున్నాయి రెండు పార్టీలు కాదు. ఒక పార్టీనే అన్నట్లుగా రాజకీయాలు చేయబోతున్నారు. మిషన్ 160 అంటే 175 నియోజకవర్గాల్లో 160 చోట్ల గెలవాలన్న తపనతో  పనిచేయాలనుకుంటున్నాయి. రాజమండ్రిలో జరిగిన  సమన్వయ కమిటీ సమావేశంలో నారా లోకేష్, పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు మరో నాలుగు కలిపి దస్ కా దమ్ అంటూ పది గ్యారెంటీలు సిద్ధం  చేయాలని కూడా ఇద్దరు నేతలు తీర్మానించారు. ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో ఒకటో తేదీ నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలో ప్రతి ఇంటినీ సందర్శించి తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. వాటిపై వారికి నమ్మకం కలిగించడానికి పార్టీ తరఫున ఇంటింటికీ బాండ్లు అందజేయాలని టీడీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడీ కార్యక్రమంలో జనసేన సైతం భాగస్వామి కానుంది. రెండు పార్టీల ఉమ్మడి మినీ మేనిఫెస్టోను నవంబరు 1న విడుదల చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక ఈ మినీ మేనిఫెస్టోకు మరిన్ని మెరుగులు దిద్ది పూర్తిస్థాయి ఎన్నికల ప్రణాళికను ఖరారు చేస్తారు. రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా జరగడం ప్రధానమైన అంశం ఆ పని   జరగకుండా చూసేందుకు వైసీపీ అనేక ఎత్తులు వేస్తోందని.. రెండు ప్రధాన సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపడానికి రెండు పార్టీల అభిమానుల పేరుతో వైసీపీ పేటీఎం బ్యాచ్‌లు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నాయని లోకేశ్‌ ఈ సమావేశంలో చెప్పారు. దీనిని కట్టడి చేయడానికి రెండు పార్టీల సామాజిక మాధ్యమాల బాధ్యు లు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించాలని, ఉమ్మడిగా పనిచేస్తే వైసీపీని అదుపు చేయడం పెద్ద పని కాదని ఉభయ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.

కామన్ మినిమం ప్రోగ్రాం ని ముందు పెట్టుకుని పనిచేయాలని కూడా డిసైడ్ అయ్యారని అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ రెండు పార్టీలు నిండు మనసులో పనిచేస్తాయా లేదా అనేది అసలైన చర్చ . రెండు పార్టీల నేతలకు ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి. తనకు పదవులపై ఆశలేదని పవన్ అనొచ్చు. ప్రజలు అనుకుంటే తాను సీఎం అవుతానని పవన్ చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు.  క్యాడర్ కూడా పవన్ సీఎం కావాలని కోరకుటోంది. పవన్ సీఎం అయితేనే తాము గెలిచినట్లు భావిస్తామని కార్యకర్తలు చెబుతున్నారు. పవన్ పేరు పక్కన సీఎం అని ముద్రించాలని జనసేన కార్యకర్తలు పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. 2024 ఎన్నికలు  పవన్ ను సీఎం చేస్తాయని కూడా జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. టీడీపీ వారు ధీమాగా చంద్రబాబు సీఎం అంటూ నినదించడం కూడా జనసైనికులకు, వీర మహిళలకు నచ్చడం లేదు. పవన్ పార్టీకి పునాది ఆయన అభిమానులే. వారే ఇపుడు క్యాడర్ కూడా. వారికి రాజకీయాల్లో లాజిక్కులు మ్యాజిక్కులు అర్ధం కావు, అర్ధం అయినా అవి అనవసరం అని వారు భావిస్తారు. వారి రాజకీయ లక్ష్యం పవన్ సీఎం కావడం. అది జరిగిందా లేదా అన్నదే చూస్తారు. ఆయన సీఎం గా ఉండాలి. ఆ అధికారంలో తామే పూర్తిగా ఉండాలని జనసేన కేడర్ కోరుకుంటోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో టీడీపీతో కలిసి పనిచేస్తే సరిపోదు. సొంత కార్యకర్తల  మనోభావాలు దెబ్బతినకుండా వారిని కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా ఆయనపై  ఉంది.  సీఎం పదవి తమకు టైమ్ వచ్చినప్పుడు దక్కుతుందని, దాని కోసం ఆశ పెట్టుకుని పని  మానుకోవద్దని ఆయన జనసేన క్యాడర్ కు ఆయన నచ్చజెప్పాలి. తొందరపాటు వద్దని బతిమాలి అయినా టీడీపీ కేడర్ తో కలిసి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే అధికారం దిశగా ముందుకు సాగడం సాధ్యమవుతుంది.

పొత్తులో భాగంగా ఎన్ని కొన్ని సీట్లు పోయినా తమకు ఇబ్బందే అన్నది ద్వితీయ తృతీయ శ్రేణుల బాధ ఆవేదన. బెంగ కూడా. ఇక అట్టడుగున ఉన్న క్యాడర్ కి అయితే తామే గెలిచామని అనిపించుకోవాలని ఆరాటం. మాది నాలుగు దశాబ్దాల పార్టీ అని వారికి ఒక నిబ్బరం. పొత్తులతో వేరే పార్టీ కలిస్తేనే గెలుపు అంటే సిసలైన క్యాడర్ కి అది ఇబ్బందికరంగా ఉంటోంది అంటున్నారు. మా చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. అతనికి ఎదురు లేదు అన్నదే కరడు కట్టిన టీడీపీ ఫ్యాన్ మాట. ఇంకో వైపు వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతోంది. ఇంత సీనియర్ పార్టీగా ఉండి పొత్తులు మద్దతుతో గెలవడం అంటే సగటు టీడీపీ క్యాడర్ కి అది అర్ధం కాని విషయమే అంటున్నారు. ఒంటరిగా పోటీ చేయాలని కూడా అంటున్న వారే ఉన్నారు. ఈ నేపధ్యంలో పసుపు జెండా జనసేన జెండా జట్టుగా కలసికట్టుగా ముందుకు రావాలంటే గ్రౌండ్ లెవెల్ లో చాలా ఫ్యాక్టర్స్ ఇబ్బందిగానే ఉంటాయి. వాటిని ఎంత మేరకు సెట్ చేసుకుంటారు అన్నదే చూడాలని అంటున్నారు.

పొత్తును అంగీకరించే విధంగా పవన్ కల్యాణ్ తన కార్యకర్తలను ఒప్పించారు. మొదటి బాధ్యత తీరింది. ఇప్పుడు ఆ రెండో బాధ్యత కూడా ఆయనే తీసుకోవాలి. చంద్రబాబు రాజకీయ చాణుక్యుడైతే, పవన్ కల్యాణ్ కాదా అని ప్రశ్నిస్తున్న కేడర్ ను ఆయన దారికి తీసుకువాలి. ఎక్కడ ఎక్కాలో కాదు..  ఎక్కడ తగ్గాలో తెలిసినోడే జనసేన కార్యకర్త అని వారికి నూరిపోయాలి. అప్పుడే వాళ్లు టీడీపీ కార్యకర్తలతో కలిసి పనిచేయగలరు. అలా జరిగితేనే..తర్వాతైనా పవన్ సీఎం కావాలన్న కోరిక తీరే అవకాశం ఉంటుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి