నాడు గొప్పలు – నేడు తిప్పలు ! మేడిగడ్డపై బీఆర్‌ఎస్ సైలెన్స్ !

By KTV Telugu On 30 October, 2023
image

KTV TELUGU :-

బీఆర్ఎస్ పార్టీ తమ ఘన విజయాల్లో ఒకటిగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ మేడిగడ్డ బరాజ్ కుంగడంతో దాని కారణాలపై చర్చ మొదలైంది. కాళేశ్వరం ఒక అద్భుతమని, ప్రపంచంలోనే పెద్దదని బీఆర్ఎస్ చెప్పుకుంటుండగా, ఇది అవినీతిమయమని, ఉపయోగంలేని ప్రాజెక్టనీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికలకు ముందు  బ్యారేజ్ కుంగిపోయింది. దీనికి లక్ష్మీ బరాజ్ అని పేరు పెట్టారు కేసీఆర్. 2016 మే లో శంకుస్థాపన, 2019 జూన్‌లో నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు కుంగిపోయింది. విద్రోహచర్య అని ప్రచారం చేశారు కానీ.. ఇసుక కదిలిపోవడం వల్ల కుంగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దశాబ్దాల పాటు ఉండాల్సిన బ్యారేజీ ఇసుక కదలకగానే కుంగిపోతుందా ? ప్రభుత్వం తప్పు దాచిపెట్టుకోవాలనుకుంటోందా ?

కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మి బ్యారేజీ పిల్లర్ల పగుళ్లపై ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రపం చంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకానికి బీటలు వారడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ప్రాజెక్టుపై చేసుకున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ఈ ఒక్క బరాజ్‌కే సుమారు రూ.1850 కోట్లు ఖర్చు అయింది. 16 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉండే ఏర్పాటు ఉంది. 85 గేట్లు ఉంటాయి. రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించుకుంది. అదొక గొప్ప విషయంగా కూడా ప్రచారం చేశారు. ఇది బరాజ్‌ మాత్రమే కాకుండా వంతెన కూడా. ఆ రోడ్డు తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతుంది. ఇప్పుడు రిస్క్‌లో పడిపోయింది.

రెండు రాష్ట్రాలు విడిపోయిన కొత్తలో ఏపీలో పోలవరం, తెలంగాణలో కాళేశ్వరం శరవేగంగా నిర్మించారు. తాము ఇంత కట్టామంటే.. ఇంత కట్టామని పోటీపడేవి.  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 16 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఒకేసారి పోసి రికార్డు సృష్టిస్తే, దాన్ని అధిగమించి 25 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోసి రికార్డు సృష్టించారు మేడిగడ్డలో. ఇది 2018 డిసెంబరులో జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం నిర్మాణం ఆగిపోయింది. కానీ కాళేశ్వరం దాదాపుగా పూర్తయింది. అప్పుడే కుంగిపోవడం కూడా జరుగుతోంది.  కాళేశ్వరం జలాల్లో అవినీతి ప్రవాహాం జోరుగా సాగిందనీ, అక్ర మాల నెగడు లేచిందని ఎప్పటినుంచో ఆరోపణలు, విమ ర్శలు కోకొల్లలు గా ఉన్నాయి.   ఏకంగా ముఖ్యమంత్రే ఇంజినీర్‌గా పరకాయ ప్రవేశం చేశారని చెప్పుకున్న గొప్పలు అన్నీ, ఇన్నీ కావు. ఈ ప్రాజెక్టుపై ప్రశంసలు ఎంతవరకు వెళ్లాయంటే ప్రపంచంలోని ఏడు వింతలకు తోడు ఎనిమిదో వింత అన్నంతగా. ప్రాజెక్టు నిర్మాణ ప్రతిభ అంతా సీఎంగారిదే అంటూ ప్రస్తుతించిన సందర్భాలూ అనేకం. మరిప్పుడు బ్యారేజీ పగుళ్లకుఆయనదే కదా బాధ్యత. కేవలం రెండేండ్లలోనే ప్రాజెక్టును పూర్తిచేశామనీ గొప్పలు చెప్పుకున్న వారంతా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.

కేంద్ర బృందానికీ పూర్తి సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలు పరిశీలించేందుకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఆ సమయంలో బృంద సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర అధికారులు కొంత సమాచారం ఇచ్చారు. అయితే, మొత్తం 20 అంశాల సమాచారాన్ని కోరగా, ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరోసారి పూర్తి సమాచారం కోరుతూ లేఖ రాశారు. ఆదివారంలోగా అడిగిన సమాచారం ఇవ్వాలని ఆల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ, సమాచారం ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లను లేనట్లుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలుంటాయని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్ల కుంగుబాటు తర్వాత బ్యారేజీని పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం వారంలోగా  సమగ్ర నివేదిక ఇవ్వనుందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ బృందం ప్రాథమిక నివేదికలో పూర్తి వివరాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వ వివరణ అనంతరం పూర్తి నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉంది. అప్పుడు తప్పెవరిదో స్పష్టమవుతుంది.ప్రాజెక్టుల నిర్మాణం అవినీతి మయం అయితే.. భవిష్యత్ తరాలు నష్టపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం ఉపయోగం, నిర్మాణం విషయంలో ఈ భయాలు పెరుగుతున్నాయి.

ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం మంచిదే కాన  ఆ ప్రాజెక్టు ఉనికినే దెబ్బతీసేంత వేగం ఉండకూడదు. ఏదైనా  పద్దతి ప్రకారం నిర్మాణం జరగాలి.  బీఆర్‌ఎస్‌ పరి పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతను ఇచ్చారు.  అయితే ఏమేరకు ఫలితాలు వస్తాయనే సంగతి భవిష్యత్‌లో తేలాల్సిందే. నాగార్జున సాగర్‌, శ్రీశైలం, ఇలా చాలా ప్రాజెక్టులను గతంలోనే కట్టారు. వాటిలో ఇన్ని నిర్మాణ సమస్యలొచ్చాయా ?భారీ నిర్మాణాల్లో సమస్యలు తలెత్తడం కొత్తేమి కాకపోయినా, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి ఎప్పుడూ లేదు. నిర్మాణ లోపాలకు కారణాలు కాస్త ఆలస్యమైనా బయటకు రాకతప్పదు. మొన్న పూర్తికాకుండానే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపారు.   40 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తొమ్మిది మోటార్లకుగాను ఒక్కటే ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తయ్యేవరకు ఆగక పోవడం తో భవిష్యత్‌లో వచ్చే సమస్యల్ని అంచనా వేయడం కష్టం.  జరగరానిది జరిగి ప్రాణ, ఆర్థిక నష్టాలు చోటుచేసుకుంటే నష్టపోయేది ప్రజలే.

చిన్న అవకాశం, ఆధారం దొరికినా విపక్షాలపై గయ్యినలేచే గులాబీ పార్టీ ముఖ్యులు, తమకేమీ పట్ట నట్టుగా ఎన్నికల ప్రచారంలో నిమగమయ్యారు. వారి గొంతు పెగలడం లేదు. వీలైనంత వరకూ మేడిగడ్డ గురించి  ప్రజల్లో చర్చ జరగకుండా చూసుకుంటున్నారు.  లక్ష్మి బ్యారేజీలో వర్షాల నేపథ్యంలో వచ్చిన భారీ వర దలకు మోటార్లు మునిగిప్పుడు ‘క్లౌడ్‌బరస్ట్‌’ అని తప్పించుకున్నారు. ఇప్పుడేమో విద్రోహ చర్యగా చిత్రీకరిస్తున్నారు. అందుకు అవసరమైన కేసు లు పెట్టి ముందస్తు ఎలిబీని సృష్టించుకుంటు న్నారు. ఇందుకు సాక్ష్యం అధికారులు మీడియా కు విడుదల చేసిన పత్రికా ప్రకటనలు. నిరం తర నిఘాతో కనీసం మీడియాను సైతం చూడ టానికి అనుమతించనంత కఠినంగా ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు సంఘ విద్రోహాశక్తుల కుట్ర ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయింది.

ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మారితే కాళేశ్వరం గుట్టు మొత్తాన్ని కొత్తగా  వచ్చే ప్రభుత్వం బయటపడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ మ్లళ్లీ గెలిస్తే.. అసలు మేడిగడ్డ కుంగిన విషయమే అందరూ మర్చిపోయేలా చేస్తారు. కానీ జరిన నష్టం మాత్రం ప్రజల ఖాతాలోనే పడుతుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి