ఆ రెండు నియోజకవర్గాలూ జిల్లా కేంద్రాలే. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు విడి విడిగా జిల్లా కేంద్రాలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆ రెండు మినహా మిగిలిన సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. కాని రాజకీయ చైతన్య కేంద్రాలైన ఈ రెండు జిల్లా కేంద్రాల్లోనే అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. ఎందుకని..అక్కడ అభ్యర్థులు ఎక్కవై ఎంపిక చేయలేకపోతున్నారా? ఎవరూ దొరక్క ఇబ్బంది పడుతున్నారా? కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నా ఆ రెండు సెగ్మెంట్లు ఎక్కడున్నాయి? వాచ్ దిస్ స్టోరీ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ ఉమ్మడి జిల్లాలో రెండు మినహా మిగిలిన అభ్యర్థుల పేర్లు వచ్చేశాయి. ఇంకా అభ్యర్థులెవరో తేల్చుకోలేని 19 నియోజకవర్గాల్లో ఈ రెండూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ, రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్‌లు కరీంనగర్, సిరిసిల్ల అభ్యర్థులను ప్రకటించడం వారు ప్రచారంలో దూసుకుపోతుండటం కాంగ్రెస్ నాయకులు గమనిస్తూనే ఉన్నారు. కాని హస్తం పార్టీ మాత్రం ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోంది
కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తరపున పాత ప్రత్యర్థులే మరోసారి బరిలోకి దిగారు. గులాబీ పార్టీ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ పడుతున్నారు. ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పోటీ చేస్తుండగా…బీజేపీ నుంచి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా నేత రాణిరుద్రమ రెడ్డిని బరిలోకి దింపారు.ఈ రెండు కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో ఇంతగా మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితికి కారణమేంటనేదానిపై తీవ్రస్థాయిలో చర్చలు సాగుతున్నాయి.
కరీంనగర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి ఆశావహుల జాబితాలో పురమళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ అనే బీసీ నేతలతో పాటు.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొత్త జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వెలమ సామాజికవర్గానికి చెందిన మేనేని రోహిత్ రావు, రమ్యారావు వంటి పేర్లపై బాగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ రెండో జాబితాలోనూ.. కరీంనగర్ అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో..కరీంనగర్ అభ్యర్థెవరనేది ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలా తయారైంది. అటు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డినే మళ్లీ కాంగ్రెస్ బరిలోకి దింపుతుందా.. లేక, కేటీఆర్ బంధువైన ఉమేష్ రావుకు ఈసారి టిక్కెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేస్తుందా అన్న చర్చ నడుస్తోంది.
ఇప్పటికే కరీంనగర్ లో ఫైట్ గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ అన్న రేంజ్‌లో ఉండబోతోందన్న టాక్ వినిపిస్తున్న క్రమంలో..కాంగ్రెస్ అభ్యర్థిగా సంతోష్ కుమార్ అయితే బెటరని పలువురు సీనియర్ నేతలు మొగ్గు చూపుతున్నారట. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మాత్రం పురమళ్ల శ్రీనివాస్ పేరును మరోసారి తెరపైకి తేవడంతో.. ఇంకోసారి స్క్రీనింగ్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ స్క్రీనింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అనే ఉత్కంఠ కరీంనగర్ నేతల్లో కనిపిస్తోంది. కరీంనగర్, సిరిసిల్ల అభ్యర్థుల పేర్లతో కూడిన మూడో జాబితా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతతో కాంగ్రెస్ కేడర్ ఎదురు చూస్తోంది.
రాజకీయంగా చురుకుగా కనిపించే కరీంనగర్ వంటి నియోజకవర్గంతో పాటు.. మరో జిల్లా కేంద్రమైన సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో 125 ఏళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఓ గట్టి అభ్యర్థి కరువయ్యాడంటే దానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. పార్టీలో సీనియర్లుగా గతంలో నాయకత్వం వెలగబెట్టినవారు సెకండ్ క్యాడర్ ను తయారు చేయకపోవడం.. తయారైనవాళ్లకు ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు కరీంనగర్ తో పాటు సిరిసిల్ల వంటి సెంటర్స్ లో కాంగ్రెస్‌ను వెంటాడుతున్నాయి. అందుకే అభ్యర్థులను ఎంపిక చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ నానాపాట్లు పడుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…