ఈటల వర్సెస్ బండి సంజయ్

By KTV Telugu On 2 November, 2023
image

KTV TELUGU :-

తెలంగాణా బిజెపిలో ఇద్దరు నేతల మధ్య పోరు కాస్తా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందన్న  వాదన వినిపిస్తోంది. వలస వచ్చిన ఓ సీనియర్ నేతకు పార్టీలో ఉన్న  మరో సీనియర్ నేతకు మధ్య ఆధిపత్య పోరు లో  వలస నేత  కదిపిన పావులకు అసలు నేత  అధ్యక్ష పదవి పోయిందన్న ప్రచారం జరుగుతోంది. అంతే కాదు మొత్తం మీద పార్టీ గ్రాఫే పడిపోయిందన్న  ఆరోపణలు వస్తున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం సరియైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే   పార్టీకి తలనొప్పులు పెరిగాయని  పార్టీ వర్గాలే గుస గుస లాడుకుంటున్నాయి.

కాషాయసేనకు తెలంగాణ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒకే జిల్లాకు చెందినవారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రెండు ముఖ్యమైన బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బండి సంజయ్‌ రాజకీయ జీవితం అంతా బీజేపీలోనే కొనసాగుతోంది. ఈటల రాజేందర్‌ కొంతకాలం క్రితం గులాబీ పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్‌ను ధిక్కరించి కమలం పార్టీ తరపున మళ్ళీ హుజూరాబాద్‌నుంచి అసెంబ్లికి ఎన్నికయ్యారు. అయితే ఇద్దరి మధ్యా ఏర్పడిన విభేదాల అగాధం తెలంగాణ బీజేపీని ఓ కుదుపు కుదుపుతోంది. ఈటల వచ్చాకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బండి సంజయ్‌కు దూరమైందనే చర్చలు సాగుతున్నాయి.

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని అనుకుని కమలం బాట పట్టిన ఈటల.. గులాబీ పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీని పరుగులు తీయిస్తున్న బండి సంజయ్ పై బాగానే ఫోకస్ చేశారు. ఈ క్రమంలో బండి వర్సెస్ ఈటల అన్నట్లుగా పార్టీలో వ్యవహారాలు మారాయి. ఇద్దరు నేతలు బాహాటంగానే ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం..ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రస్థాయిలో కీలకంగా ఉన్న ఓ నేత అడ్వాంటేజ్ గా తీసుకోవడం వంటి పరిణామాలు కొన్ని జరిగాయి. కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండికి అప్పటికే నిజామాబాద్‌ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ వంటివాళ్ళతో పొసగకపోవడం వంటి ఎన్నో కారణాలు, సంఘటనలు అన్నీ కలిసి..బండిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా చేశాయి.

బండి సంజయ్ విషయానికొస్తే.. మూడుసార్లు కరీంనగర్‌లో కార్పోరేటర్ గా పనిచేసి.. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని కరీంనగర్ నుంచే ఎంపీగా గెల్చారు. ఆ తర్వాత అనూహ్యంగా బీజేపీ పెద్దల ఆశీస్సులతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడయ్యారు. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేతబట్టినప్పటినుంచీ పరుగులు తీయించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కేడర్‌లో ఒక కొత్త జోష్ నింపారు. బండి సంజయ్ కంటే ముందు.. బండి సంజయ్ హయాంలో.. బండి సంజయ్ తర్వాత.. బీజేపీ ఎలా ఉందనే స్పష్టమైన గ్రాఫ్ ను జనం ముందు బండి ఉంచారు. బండి హయాంలో పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిందనే టాక్ కమలం శ్రేణుల్లో తీసుకురాగలిగారు.

ఇదే సమయంలో పార్టీలో వచ్చిన ఈ పేరును కాపాడుకోవడంలో మాత్రం సంజయ్ వైఫల్యం చెందాడనేవారూ ఉన్నారు. అందరినీ కలుపుకోలేకపోవడం.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మొద్దో క్లారిటీ లేకపోవడం.. చేయకూడనివి చేయడం, చేయాల్సినవి చేయకపోవడం.. మీడియా ముందు ఆచితూచి మాట్లాడాల్సిన చోట తప్పటడుగులు వేయడం వంటివన్నీ.. పార్టీలోని ఆయన అంతర్గత ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారాయి. అప్పటికే పార్టీ అంతర్గత ప్రథమ ప్రత్యర్థిగా తయారైన ఈటల రాజేందర్‌తో పాటు..బండి అంటే పడనివారంతా ఏకమై ఆయనపైకి తమ వద్ద ఉన్న అస్త్రాలను ఎక్కుపెట్టడంతో.. బండి పదవి ఊడిందనే టాక్ నడుస్తోంది.

ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారిగా పుంజుకోవడం అంటే అంత సులభంగా జరిగేది కూడా కాదు. కానీ, బండి సారథ్యంలో బలంగా తయారైన పార్టీని, అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టే పార్టీగా తయారైన పార్టీని.. అందరూ కలిసి నిండా ముంచేశారన్నది ఇప్పుడు వినిపించే టాక్. దీంతో ఈటల చేరిక.. సంజయ్ అధ్యక్ష పదివి నుంచి దిగిపోవడం.. రెండూ పార్టీకి మేలు కంటే నష్టాన్నే చేకూర్చాయనే చర్చోపచర్చలకు తెరలేచింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి