తెలంగాణాలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ కొందరికి వరుసగా శుభశకునాలు స్వాగతం పలుకుతున్నాయి. మరి కొందరిని అపశకునాలు అదే పనిగా వెక్కిరిస్తున్నాయి. తమ ప్రమేయం లేకపోయినా కొన్ని పార్టీలకు అన్నీ సానుకూలంగా కలిసొస్తున్నాయి. ఇతర పార్టీల వ్యవహారాలు, నిర్ణయాలు కూడ వారికి లబ్ధి చేకూర్చేలా చేస్తున్నాయి. మరి కొన్ని పార్టీలకు మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. చుట్టూరా చోటు చేసుకునే పరిణామాలు వారికి వ్యతిరేక సంకేతాలు పంపుతున్నాయి. ఈ సంకేతాలే ఆయా పార్టీల జయాపజయాలను నిర్దేశిస్తాయా? అంటు అవును అని కచ్చితంగా చెప్పలే.
తెలంగాణా ఎన్నికల్లో అధికారం కోసం నువ్వా నేనా అన్నట్లు గానే మూడు ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారు తగ్గేదే లే అన్నట్లుగా దూసుకుపోతున్నారు. గెలవబోయేది తామేనని ఎవరికి వారు ధీమాలు వ్యక్తం చేస్తున్నారు. వారి ధీమా చూస్తే నిజమేనేమో అని అందరికీ అనిపించేలానే వారు వ్యవహరిస్తున్నారు. ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. డబుల్ ఇంజన్ సర్కాన్ నినాదంతో బిజెపి కూడా ఓటర్లకు గేలం వేస్తోంది. కాంగ్రెస్ బిజెపిలను నమ్మితే ఆగమాగం అయిపోతాం అని బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ హెచ్చరిస్తున్నారు.
బి.ఆర్.ఎస్. పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగుతోంది. కాకపోతే పాతబస్తీలో తమ మిత్ర పక్షం మజ్లిస్ పార్టీతో అవగాహన కుదుర్చుకుంది. సీట్ల సద్దుపాటు లేకపోయినప్పటికీ మజ్లిస్ పార్టీకి ఇబ్బంది లేని విధంగా బి.ఆర్.ఎస్. అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారని బిజెపి ఆరోపిస్తోంది. బి.ఆర్.ఎస్. కేవలం డమ్మీ అభ్యర్ధులనే బరిలో దింపుతుందని ఆ డమ్మీలు అక్కడి బిజెపి అభ్యర్ధుల ఓట్లలో చీలిక తీసుకురాడానికి మాత్రమే పనికొస్తారు తప్ప ఒక్కరు కూడా గెలవరని కమలనాధులు ఆరోపిస్తున్నారు. దానికి ప్రతిగా మజ్లిస్ పార్టీ జిల్లాల్లో ముస్లిం ఓటర్లకు మీరు బి.ఆర్.ఎస్. పార్టీకే ఓటు వెయ్యాలని పిలుపునిచ్చింది.
ఈ సారి బి.ఆర్.ఎస్. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రానే కూడదని భావిస్తోన్న కొన్ని చిన్న పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తన పార్టీ తెలంగాణా జనసమితి ఈ సారి ఎన్నికల్లో పోటీచేయదని ప్రకటించారు. కొద్ది వారాల క్రితం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో కలిసి రండి అని ఆయనకు రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. బహుశా అప్పుడు కుదిరిన ఒప్పందంలో భాగంగానే కావచ్చు ఆయన పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఇది కాంగ్రెస్ కు కలిసొస్తుందని అంటున్నారు.
మరో చిన్న పార్టీ వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ కొద్ది వారాల క్రితం అయితే రాష్ట్రంలోని మొత్తం 119 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వై.ఎస్.ఆర్.టి.పి.ని పార్టీ అధినేత్రి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేస్తారని.. ఆమె పాలేరు నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆమె రాకను కొందరు టి. కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు కూడా. షర్మిల నేరుగా ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. అక్కడ ఏ అవగాహన కుదుర్చుకున్నారో తెలీదు కానీ సరిగ్గా నామినేషన్ల ఘట్టానికి ఒకటి రెండు రోజుల ముందు షర్మిల తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు.
అన్నింటినీ మించి తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయం నిజంగా బి.ఆర్.ఎస్. కు షాకే.తెలంగాణా టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కొద్ది రోజుల క్రితం అభ్యర్ధులను ఎంపిక చేసి పెట్టారు. ఆ జాబితాను చంద్రబాబు నాయుడు జైల్లోనే పరిశీలించి తుది జాబితా ఖరారు చేస్తారని అన్నారు. అయితే చివరి నిముషంలో చంద్రబాబు కాసానిని జైలుకు రప్పించుకుని తెలంగాణాలో మనం పోటీ చేయడం లేదని అకస్మాత్తుగా ప్రకటించడంతో జ్ఞానేశ్వర్ షాక్ తిన్నారు. టిడిపి కూడా బరిలో లేకపోవడంతో బి.ఆర్.ఎస్. వ్యతిరేక ఓట్లలో అస్సలు చీలిక వచ్చే అవకాశం లేకుండా పోయింది. అది కాంగ్రెస్ కు తిరుగులేని అడ్వాంటేజ్ అవుతుందని రాజకీయ పండితులు అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…