భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2014, 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ దూకుడు ఓ రేంజ్ లో ఉండేది. బహిరంగసభల్లో ఆయన మాట్లాడే మాటలు వైరల్ అయ్యేవి. ప్రతిపక్షాలపై ఆయన చేసే దాడి అనూహ్యంగా ఉంటుంది. 2018లో గద్వాల నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్లి వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకుపోతూంటే డీకే అరుణ హారతి పట్టారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ ఆరోపణలపై డీకే అరుణతో పాటు చాలా మంది స్పందించాల్సి వచ్చింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ ఎన్నికల్లో కూడా గద్వాలలో బహిరంగసభ పెట్టారు . కానీ ప్రతి నియోజకవర్గంలో చెప్పిందే చెప్పారు. కొత్తగా ఏమీ చెప్పలేదు. సంచలనం లేదు. వైరల్ కామెంట్స్ లేవు. కానీ అప్పటికి ఇప్పటికీ ప్రచారంలో వచ్చిన ఒకే ఒక్క మార్పు. పదే పదే కాంగ్రెస్ పార్టీని ప్రస్తావించడం. కాంగ్రెస్ గెలిస్తే అనే మాట పదే పదే కేసీఆర్, కేటీఆర్ నోటి వెంట వస్తూండటం.
రాజకీయాల్లో పక్క పార్టీ గెలిస్తే అనే మాట తమ నోటి వెంట రాకూడదని రాజకీయ పార్టీల నేతలు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి కేసీఆర్ అదే డైలాగ్ ను పదే పదే వాడుతున్నారు. రోజుకు మూడు బహిరంగసభల్లో మాట్లాడుతున్న ఆయన… కాంగ్రెస్ గెలిస్తే అని పదే పదే అంటున్నారు. కాంగ్రెస్ గెలుస్తుందా… అన్న పరిస్థితి ఉందేమోనని కేసీఆర్ ప్రసంగాలు చూసిన వారికి అనిపిస్తుంది.. కాంగ్రెస్ గెలిస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుందని ప్రజల్ని భయపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం ఆయన నేరుగా కాంగ్రెస్ గెలిస్తే అనే పదం వాడేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సూపర్ కాన్ఫిడెంట్ గా… ఉన్నారు. మరోసారి బీఆర్ఎస్ సర్కార్ రాదని.. గెలిచే చాన్సే లేదని చెబుతున్నారు. పదేళ్ల వైఫల్యాలు.. .. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం వంటి వాటిపై ప్రచారం చేస్తున్నారు. అవినీతి… అక్రమాలపై మాట్లాడుతున్నారు. రాగానే చర్యలు తీసుకుంటామంటున్నారు. కాంగ్రెస్ ప్రచారంలో… బీఆర్ఎస్ కు హోప్స్ ఉన్నాయన్న అభిప్రాయం కల్పించడం లేదు. కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం… కాంగ్రెస్ వస్తే అంటూ మాట్లాడుతున్నారు. కేటీఆర్ కూడా అంతే. కేసీఆర్, కేటీఆర్ మాటలతో… కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని అంగీకరించినట్లయిందని… కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకుంటున్న వారిని.. ఆ పార్టీ వస్తే ఏదో జరిగిపోతుందని భయ పెట్టి ఓటు వేయకుండా చేయాలన్న వ్యూహం అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో.. పదేళ్ల అధికార వ్యతిరేకత ఉన్న సమయంలో… ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఇతర పార్టీల గెలుపు గురించి పదే పదే మాట్లాడటం … ఆ పార్టీకి మేలు చేసినట్లవుతుందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందని ఎవరూ అనుకోవడం లేదు. నిజానికి ఆపార్టీపై ప్రజల్లో ఇంతో ఇంతో సానుభూతి ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా గుర్తుంచుకుంటారు. కాంగ్రెస్ హయంలో రైతులకు పక్కాగా రుణమాఫీ జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు సహా అనేక సంక్షేమ పథకాలు బాగానే అమలయ్యాయి. రేషన్ కార్డులు, పించన్లు అడిగిన వారందరికీ ఇచ్చారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పై కోపం పెంచుకోవాల్సిన ఘటనలేమీ లేవు. పైగా తెలంగాణ ఇచ్చి పార్టీ నష్టపోయిందన్న భావనలో కొంత మంది సానుభూతిపరులు ఉన్నారు. కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోవడానికి కారణం తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్లుగా ప్రచారం చేశారు. కేసీఆర్ కు కాదని వేరే వారికి ఓటేస్తే అది తెలంగాణకు వ్యతిరేకంగా వేసిన ఓటే అన్న భావన ఎక్కువగా కల్పించడం వల్ల కాంగ్రెస్ నష్టపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. సెంటిమెంట్ ప్రభావం తగ్గిపోయింది. స్వయంగా కేసీఆర్ తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అయినా ఆయన పరిస్థితిని గమనించి తెలంగాణకు ప్రాంతీయ పార్టీలే బలమని… తన పార్టీని జాతీయ పార్టీగా మార్చలేదన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా కేసీఆర్ లో ఉన్న ఆత్మరక్షణ ధోరణికి అద్దం పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చివరికి తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వలేదని.. అందరం కలిసి ఉద్యమం చేస్తే తప్పని సరి పరిస్థితుల్లో ఇచ్చిందని వాదిస్తున్నారు
నేరుగా కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందన్న భయం కల్పించడానికి బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారసభల్లో హైలెట్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రచారాల్లోనూ కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరినైనా టార్గెట్ చేసుకుంటే.. వారు తమ పార్టీకి వ్యతిరేకం అని ప్రచారం చేయదు.. తెలంగాణకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తుంది. తమ పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని మార్చుకున్నప్పటికీ అదే స్టైల్. చంద్రబాబుపై అదే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన తెలంగాణపై కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబుతో పాటు డీకే శివకుమార్ ను కూడా టార్గెట్ చేసుకున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో డీకే శివకుమార్ కూడా తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. తెర వెనుక వ్యూహాలు, పార్టీలో చేరికలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెబుతున్నారు. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు శివకుమార్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. కేటీఆర్ ఆయనపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటక కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నారని.. అక్కడ హామీలు ఏమీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అందు కోసం కొంత మందిని రైతుల పేరుతో తెలంగాణ నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయించారు. ఈ క్రమంలో డీకే శివకుమార్ రాసినట్లుగా చెబుతున్న లేఖను వైరల్ చేయడంతో దుమారం రేగింది. హైదరాబాద్‌లో ఫాక్స్ కాన్ పెట్టిన యాపిల్ ఉత్పత్తుల పరిశ్రమను బెంగళూరుకు తరలించలని ఓ లేఖ రాసినట్లుగా బీఆర్ఎస్ నేతుల ప్రచారం ప్రారంభించారు. ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. కాంగ్రెస్ గెలవక ముందే హైదరాబాద్ పరిశ్రమల్ని తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇక గెలిస్తే.. హైదరాబాద్ ను ఖాళీ చేసి బెంగళూరుకు తరలిస్తారని ఆరోపించడం ప్రారంభించారు. చివరికి కేటీఆర్ కూడా ఆ లేఖను ప్రదర్శించారు. చివరికి ఈ లేఖ విషయం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు చేరింది. తాను అటువంటి లేఖ ఫాక్స్ కాన్ కంపెనీకి రాయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు సర్క్యూలేట్ చేస్తున్న లేఖ ఫేక అని దానిపై బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిపారు. ఇలాంటి ప్రచారాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ విషయంలో ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తే ప్రజలు తమకే ఓట్లేస్తారన్న వ్యూహాన్ని బీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏదో జరిగిపోతుందని కరెంట్ రాదని.. పథకాలు ఆగిపోతాయని.. పరిశ్రమలు తరలి పోతాయని చెప్పాల్సినదంతా చెబుతున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి .. చంద్రబాబు మనిషని కూడా పాత వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నిజానికి రేవంత్ కన్నా ఎక్కువ కాలం కేసీఆర్ చంద్రబాబు సహచరునిగా ఉన్నారు. రేవంత్ పై.. కాంగ్రెస్‌పై తెలంగాణ వ్యతిరేకం ముద్ర వేయడం ద్వారా బీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందు కోసం ఎన్నో రకాల ఫేక్ న్యూస్ నూ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే.. ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మితే పర్వాలేదు.. నమ్మకపోతే మాత్రం మొత్తానికి రివర్స్ అవుతుంది. కాంగ్రెస్ పై ఏ మాత్రం ప్రజల్లో పాజిటివ్ భావన ఉన్నా… బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం ఆ పార్టీకి ఇంకా ప్లస్ అవుతుంది. అంటే బీఆర్ఎస్ వ్యూహం రివర్స్ అవుతుంది. ఇలా అయిందో లేదో ఎన్నికల ఫలితాల రోజున స్పష్టత వస్తుంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…