ఈ సారి కూడా గెలిచి తీరాలన్నది కాంగ్రెస్ పంతం. 2018లో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే. ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది బీజేపీ వ్యూహం. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీనే. 2018లో కాంగ్రెస్ గెలిస్తే, ఇప్పుడు ఆ పార్టీనే పవర్‌లో ఉండాలి కదా ? మరి కాంగ్రెస్ గెలవడం ఏంటి ? బీజేపీ పవర్‌లో ఉండటం ఏంటంటారా ? కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత అధికారాన్ని బీజేపీ హస్తగతం చేసుకుంది. సో…మళ్లీ పవర్‌లోకి వచ్చి పత లెక్కలు సరి చేయాలన్నది కాంగ్రెస్ పట్టుదల. కాంగ్రెస్‌కి అసలా అవకాశమే ఇవ్వకూడదన్నది బీజేపీ పంతం. అందుకే…మధ్యప్రదేశ్ ఎన్నికల సమరం…ఒక రేంజ్‌లో సెగలు పుట్టిస్తోంది.
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 230 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 109 సీట్లకు పరిమితమైంది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడుతూ కాంగ్రెస్ అధికారం చేపట్టింది. కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిందిఅయితే, 15 నెలల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లో తిరుగుబాటు బావుటా ఎగురవేసి…. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మెజారిటీ కోల్పోవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి సీఎంగా నాలుగోసారి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదల మీదున్న బీజేపీకి మొదట ఆందోళన కలిగిస్తోంది శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వమే. 2005 నవంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు 13 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ తర్వాత తిరిగి 2020 నుంచి ఆయనే సీఎంగా ఉన్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన భాజపా నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దీనిని ముందే గుర్తించిన భాజపా అధిష్ఠానం జాతీయ స్థాయి నాయకులు ఏడుగుర్ని అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టింది. వారిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు ఎంపీలు, ఒక జనరల్ సెక్రెటరీ ఉన్నారు. జన ఆశీర్వాద యాత్రల్లో హిందుత్వ వాదాన్ని బీజేపీ బలంగా వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తాము హిందుత్వ వ్యతిరేకం కాదని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌నాథ్ తాను హనుమాన్ భక్తుడినని చెప్పే ప్రయత్నం ఇప్పటికే పదే పదే చేశారు.
కర్నాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రభుత్వం పై అవినీతి కోణంలో కాంగ్రెస్ తీవ్రస్థాయిలో దాడి చేసింది. మధ్య ప్రదేశ్‌లోనూ అదే వ్యూహానికి పదును పెడుతున్నారు. ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ కమల్‌నాథ్‌తో సహా పార్టీ నేతలంతా చౌహన్ ప్రభుత్వాన్ని 50 శాతం కమిషన్ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారుఅవినీతి కోణంలో కాంగ్రెస్ చేసే దాడిని తిప్పికొట్టడానికి బీజేపీ కొంత సతమతమౌతోన్నా…కాంగ్రెస్ అంటేనే అవినీతి అన్న తరహాలో బీజేపీ ఎదురు దాడి చేస్తోంది.
రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్, కర్నాటక తరహాలోనే హామీల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదంటోంది.కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థిగా కమల్‌నాథ్‌ని ప్రకటించేసింది. కానీ…బీజేపీ మాత్రం మధ్యప్రదేశ్‌లో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తుంది. అన్యాయంగా తమ నుంచి అధికారం లాక్కున్నారన్న సానుభూతి వర్కౌట్ అవుతుందన్న నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. అయితే…కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చివేశామన్న భావన ప్రజల్లో ఉన్నా…అతి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వకూడదన్న దిశగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…