కాంగ్రెస్ గెలిస్తే ఏం చేయాలో రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీతో ఉన్నారనిపిస్తోంది. 111జీవో రద్దు ద్వారా హైదరాబాద్ కు ఆనుకుని మరో నగరం ఏర్పాటు చేయాలని కేసీఆర్ అనుకుంటే ఇప్పుడు రేవంత్ అదే తరహాలో మరికొంత దూరం వెళ్లారనుకోవాల్సి వస్తుంది. ఏపీలో కట్టినా కట్టకపోయినా తెలంగాణలో అమరావతి స్కీమ్ ను అమలు చేస్తామని రేవంత్ చెబుతున్నారు. ఈ దిశగా రేవంత్ పెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారనుకోవాలి…
2014లో టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత తాను నిర్మించబోయే నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతి అని చంద్రబాబు ప్రకటించారు. గుంటూరు, విజయవాడ మధ్య రాబోయే రాజధానిలో అన్ని అత్యాధునిక హంగులు ఉంటాయన్నారు. రోడ్లు, హైవేలు, ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు, వాటర్ వేస్ అన్నీ కడతామన్నారు. ఇందు కోసం ల్యాండ్ పూలింగ్ కూడా జరిగింది. 29 గ్రామాల రైతులు 33 వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారు. జగన్ అధికారానికి రాగానే సీన్ సితారైంది. అమరావతి నిర్మాణాన్ని ఆపేసిన జగన్ రెడ్డి… మూడు రాజధానులంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.అమరావతి శాసన రాజధాని అని, విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అని తేల్చేశారు. ఇదిగో అదిగో విశాఖ వెళ్తానని చెప్పుకునే జగన్ ఇంతవరకు ఆ పని చేయలేకపోయారు. పైగా రుషికొండను బోడి కొట్టిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
కట్ చేసి చూస్తే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అమరావతి పాట పాడుతున్నారు.రాచకొండ ఏరియాలో ల్యాండ్ పూలింగ్ చేసి ఓ కొత్త సిటీని నిర్మిస్తామని రేవంత్ చెబుతున్నారు. అమరావతి స్కీమును ఇక్కడ అమలు చేస్తామన్నారు. కార్పొరేట్ కంపెనీలను ఆహ్వానించిన భూములు ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కిటకిటలాడిపోతున్నందువల్ల అటు కొత్త సిటీని నిర్మిస్తామన్నారు. క్లస్టర్ల కింద విభజించి వివిధ వ్యాపారాలకు కేటాయింపులు చేస్తామన్నారు. కొత్త సిటీని నిర్మించడం వల్ల ఇప్పుడున్న ప్రాంతాలపై వత్తిడి తగ్గుతుందని కూడా రేవంత్ వాదిస్తున్నారు.పైగా ప్రణాళికాబద్ధంగా నిర్మించడం వల్ల రోడ్లు, వంతెనలు పక్కాగా అనుకున్న చోట వస్తాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి…
రేవంత్ రెడ్డి అమరావతి పేరును ప్రస్తావించడం పెద్ద గేమ్ ప్లాన్ కిందనే పరిగణించాలి. ఆంధ్రల్లో మెజార్టీ వర్గానికి అమరావతి కలల రాజధాని. జగన్ రెడ్డి గెలవకుండా ఉండి ఉంటే ఇప్పుడదో ఆదర్శ నగరంగా కూడా రూపొంది ఉండేది. తెలంగాణలో సెటిలర్లు కూడా అమరావతిపై ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. తమ భవిష్యత్తు తరాలకు అమరావతి ఆశాకిరణం అని కూడా వారు ఎదురు చూశారు. జగన్ రెడ్డి చేసిన పనికి ఇక్కడి సెటిలర్లు ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గాల వారు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పైగా తెలంగాణలోని ప్రస్తుత సీఎం కేసీఆర్ తొలి నుంచి జగన్ కు మిత్రుడన్న పేరు ఉంది. అమరావతి దెబ్బతినడం వెనుక బీఆర్ఎస్ కుట్ర కూడా ఉందని సెటిలర్లు భావిస్తారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అమరావతిని దెబ్బకొట్టారన్న వాదన చాలా రోజులుగా వినిపిస్తోంది. దానితో ఇప్పుడు వారి సెంటిమెంట్ ను రగిల్చి సెటిలర్లను పూర్తిగా తమ వైపుకు తిప్పుుకునేందుకు రేవంత్ పాచిక వేశారని చెప్పుకుంటున్నారు. పైగా ఈ సారి ఎన్నికల్లో టీడీపీ బరిలో లేనందున సెటిలర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా రేవంత్ రెడ్డి వర్గం విశ్లేషించుకుంటోంది. వారిలో మరింత విశ్వాసాన్ని పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి అమరావతి పాచిక వేశారని చెబుతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…