ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక గేమ్ అమలవుతోంది. అది జనాన్ని కన్ ఫ్యూజ్ చేసే గేమ్. మీడియా, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నిజమో, అబద్ధమో ఏదోటి రాసేసే గేమ్. జనానికి ఏది నిజమో ఏదే అబద్దమో అర్థం కాక చదివిందే నిజమని వారికి అనిపించే గేమ్. అది వైసీపీ వర్సెస్ టీడీపీ మీడియా గేమ్. పైగా ఇప్పుడు టీడీపీతో పవన్ కల్యాణ్ కలిసిపోవడంతో ఇద్దరినీ కలిపి కొట్టాలని వైసీపీ బ్యాచ్ ఆడుతున్న కొత్త గేమ్ కూడా అందులో భాగమైపోయింది. దానితో ఇప్పుడు ఒకరు గేమ్ ఆడితే, మరోకరు దానికి కౌంటర్ ఇవ్వకుండా ఉండలేని పరిస్తితి ఏర్పడుతోంది, ఎన్నికల దాకా సాగే ఈ డేంజరస్ గేమ్ లో ఏది నిజం.. ఏది అబద్ధం…
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య అగ్గిపెట్టాలన్న ఏకైక లక్ష్యంతో వైసీపీ సోషల్ మీడియా పనిచేస్తుంది. ఇద్దరి మధ్య ముసుగులో గుద్దులాట జరుగుతుందన్న ప్రచారం వీలైనప్పుడు చేస్తూనే ఉంటుంది. కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని పుంఖాను పుంఖాలుగా రాసేస్తుంది. అవసరానికి పవన్ ను వాడేసుకుని చంద్రబాబు కరవేపాకులా పడేస్తారని హెచ్చరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ సోషల్ మీడియా గ్రూపు అలాంటి కథనాలను వండి వార్చేస్తోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని రెండు సార్లు భేటీ అయినప్పటికీ.. చంద్రబాబు మాత్రం వెన్నుపోటు పొడిచేందుకు రెడీగా ఉన్నారని రాతలు మొదలు పెట్టింది. నియోజకవర్గాలు, అభ్యర్థుల విషయంలో కలిసి మాట్లాడుకుందామని టీడీపీ పైకి చెబుతున్న మాట మాత్రమేనని, లోలోన మాత్రం అభ్యర్థుల ఖరారు ప్రక్రియ వేగం పుంజుకుందని ప్రచారం చేస్తోంది. అందులోనూ కీలక నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను డిసైడ్ చేశారని రాసేస్తోంది. పైగా జనసేనకు కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారని, బెయిల్ మీద ఉన్న చంద్రబాబు ఇదే పనిలో 24 గంటలు నిమగ్నమై ఉన్నారని ఆ మీడియా ప్రధానంగా చెబుతోంది. వైసీపీకి బాగా బలమైన నియోజకవర్గాలను జనసేనకు కేటాయిస్తే అక్కడ పవన్ పార్టీ ఓడిపోతోందని అప్పుడు ఎన్నికల తర్వాత తమకు తిరుగుండదని టీడీపీ వ్యూహరచన చేస్తున్నట్లు వైసీపీ సోషల్ మీడియా అక్కడక్కడ రాయిస్తోంది. స్నేహం నటిస్తూనే పవన్ ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారని కూడా ప్రచారం మొదలెట్టేసింది..
వైసీపీ చేస్తున్న ప్రచారం జనసైనికుల్లోకి బాగానే ఎక్కేస్తోంది.కొంత మంది అదే నిజమేనని కూడా నమ్మేస్తున్నారు. ఎన్నికల నాటికి తమ పార్టీని దెబ్బకొడతారని అనుమనిస్తున్నారు. దానితో వివరణ ఇచ్చుకోవడం, వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టడం టీడీపీ వంతయ్యింది. అలాంటిదేమీ లేదంటూ ఒక్క మాటతో సరిపెడితే జనసైనికులు విశ్వసించరని తెలుసుకుని తమ మీడియా సంస్థల ద్వారా సుదీర్ఘ వివరణ ఇస్తోంది. నియోజకవర్గాల ఇంఛార్జులతో చంద్రబాబు మీటింగులు జరుపుతున్నారన్న వాస్తవాన్ని టీడీపీ మీడియా వెల్లడించింది. ఎక్కడ ఎవరిని నిలబెట్టాలన్న లెక్కలు కూడా వేసుకుంటున్నారని ప్రకటించింది. పార్టీలో పనిచేయకపోతే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారని, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెబుతున్నారని కూడా వెల్లడించింది. పైగా మీకు టికెట్లు లేదని కొందరికి మొహానే చెప్పేస్తున్నారని కూడా కుండ బద్దలు కొట్టింది. వీటన్నింటికీ మించి మరో వివరణ ఆసక్తికరమైన అంశంగా చెప్పుకోవాలి. జనసేనకు బలమున్న నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి పెట్టడం లేదని, అక్కడ తమ అభ్యర్థుల విషయం చంద్రబాబు చర్చించడం లేదని టీడీపీ మీడియా తేల్చేసింది. ఈ దిశగా 30కి పైగా నియోజకవర్గాలను తాము టచ్ చేయడం లేదని టీడీపీ ప్రచారం చేయిస్తోంది. జనసేనకు ఆ పార్టీ బలహీనంగా ఉండే 20 నియోజకవర్గాలను టీడీపీ కేటాయిస్తుందని వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఇది కౌంటర్ గానే చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే వైసీపీ ఒకసారి రాస్తే.. టీడీపీ పది సార్లు రాయిస్తుందని మీడియా, సోషల్ మీడియా పోస్టులను ఫాలో అయ్యే వారికి అర్థమైపోతోంది.. పైగా ఇప్పుడు ఏపీలో జనం రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఎవరు దేన్ని విశ్వసిస్తున్నారో చెప్పలేని పరిస్థితి ఉందనుకోవాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…