కామారెడ్డి కష్టమేనా మరీ..!

By KTV Telugu On 13 November, 2023
image

KTV TELUGU :-

కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు.వరుసగా  గెలిచిన గజ్వేల్ తో పాటు ఇప్పుడు కామారెడ్డిలో కూడా ఆయన నామినేషన్ వేశారు. గజ్వేల్ విజయంపై అనుమానంతో ముందు జాగ్రత్తగా ఆయన కామారెడ్డిలో నామినేషన్ వేశారన్నచర్చ జరుగుతోంది. అంతలోనే ఆయనకు  మరో ఝలక్ తగిలింది. కాంగ్రెస్  పార్టీ అభ్యర్థిగా ఏకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్  రెడ్డి బరిలోకి రావడంతో కామారెడ్డిలో ఏం జరుగుతోంది, అక్కడ కేసీఆర్ సునాయాస విజయం సాధ్యమా అన్న చర్చ మొదలైంది.

నామినేషన్ వేసిన తర్వాత మీటింగు పెట్టుకుంటే కామారెడ్డి పార్టీలో ఉన్న లొసుగులు  కేసీఆర్ కు కళ్లకు కట్టినట్లు కనిపించాయి. పార్టీ నేతలు, శ్రేణులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తేలిపోయింది. పైగా ఒకరిపై  ఒక చాడీలు చెప్పుకున్నారే  తప్ప… కేసీఆర్ ను  అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్న హామీ మాత్రం ఇవ్వలేకపోయారు. దానితో కేసీఆర్ కే చిర్రెత్తుకొచ్చిందని మీటింగ్లోని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు..గంప గోవర్థన్ లాంటి నేతలు  సంయమనంగా ఉంటూ అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నా…ఇతర నేతలు మాత్రం ఎవరికి వారు గ్రూపులు కట్టి ఐదేళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగిస్తూ వచ్చారు. వారి పద్ధతి నచ్చని నేతలు  పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరిపోయారు. కొందరు  నేతలు పార్టీలో క్రియాశీలంగా లేరని ఆ విషయం  పలు మార్లు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని  చెప్పడంతో ఆశ్చర్యపోవడం కేసీఆర్ వంతయ్యింది. వెంటనే వారిని పిలిపించి మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టాలని గంప గోవర్థన్ ను కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే  తనకు ఫోన్ చేయించాలని, వారికి ఎలా నచ్చజెప్పాలో తనకు తెలుసని కేసీఆర్ ప్రకటించారు.

కొందరు నేతల తీరు పట్ల   కేసీఆర్ బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు సార్లు వరుసగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  గ్రాస్ రూట్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సింది పోయి… ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధిపై కామారెడ్డి నేతలు దృష్టి పెట్టి ఉంటే  కేడర్  బలం  పెరిగి సునాయాసంగా గెలిచేవారమని కూడా కేసీఆర్ తేల్చేశారట. ఏదేమైన ఎన్నికల వరకు అహర్నిశలు ఐకమత్యంగా పనిచేయాలని ఆయన వారికి హితవు పలికారు.మరో పక్క కామారెడ్డి జిల్లా పరంగా కూడా కొన్ని సమస్యలున్నాయి. అక్కడ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే వారు ఎక్కువగానే   ఉంటారు. 30 నుంచి 50 వేల మంది వరకు ఎమిరేట్స్, కువైట్, ఖతార్, ఒమన్  లాంటి దేశాల్లో పనులు చేస్తూ అక్కడ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల దోపిడీకి గురవుతూ సర్వం కోల్పోయే పరిస్థితిల్లో ఉంటున్నారు. అలాంటి వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తుండగా కామారెడ్డి ప్రచారంలో బీఆర్ఎస్ నేతలను నిలదీసే  అవకాశం కూడా ఉంది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుగాలి వీచింది. అన్యాయంగా  భూములను లాక్కున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వాళ్లు ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారితే  ఏర్పడే నష్టం మామూలుగా ఉండదని చెప్పక తప్పదు.

ఈ పరిణామాల నేపథ్యంలో కామారెడ్డిలో కేసీఆర్  విజయంపై  భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అగ్రనాయకుడంటే భారీ మెజార్టీ రావాలని 50 వేల నుంచి లక్ష ఓట్లపైగా ఆధిక్యంతో గెలవాలని ఒకప్పుడు లెక్క ఉండేది. కామారెడ్డితో అంత సీన్ ఉండకపోవచ్చని బొటాబొటీ మెజార్టీతో గెలిస్తే గగనమన్న టాక్ నడుస్తోంది. ఓడిపోకుండా ఉంటే చాలన్న ఫీలింగ్ వస్తోంది. ఎందుకంటే  ఒకప్పుడు కామారెడ్డి కాంగ్రెస్ వారికి కంచుకోట. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైతే పోటీ రసవత్తరంగా ఉండటం ఖాయమని చెప్పక తప్పదు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి