తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తు వల్ల జనసేనకు ఎంత లాభమో తెలీదు కానీ.. టిడిపిలో కొందరు సీనియర్లకు మాత్రం అది పెను విపత్తులానే పరిణమించేలా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. రెండు పార్టీల మధ్య పొత్తులో భాగంగా సీట్ల సద్దుబాటులో తమ స్థానాలు గల్లంతయ్యే ప్రమాదం ఉందని కొందరు సీనియర్లు వణికిపోతున్నారు. అందుకే వారు జనసేనతో పొత్తే మంచిది కాదంటున్నారు. తమ నియోజక వర్గాలను జనసేనకు కేటాయించవద్దని వారు ఇప్పట్నుంచే చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు మాత్రం జనసేనను నొప్పించకుండా ముందుకు పోవాలని భావిస్తున్నారని సమాచారం.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుంది ఏపీలో కొందరు టిడిపి సీనియర్ల పరిస్థితి. అసలే టిడిపి గ్రాఫ్ పడిపోయిందని ఏడుస్తోంటే.. జనసేనతో పొత్తు పుణ్యమా అని తమ సీటుకే ఎసరొచ్చేలా ఉందని వారు కంగారు పడుతున్నారు. పొత్తంటూ ఉంటే జనసేనకు ఎన్నో కొన్ని సీట్లు కేటాయించక తప్పదు. ఆ సీట్లు ఏయే నేతలవనేదే ప్రశ్న. ఉభయ గోదావరి జిల్లాల్లో తమకి కొద్ది పాటి ఆదరణ ఉందని జనసేన భావిస్తోంది. రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ రెండు జిల్లాల్లో పవన్ అభిమానులు ఎక్కువగానే ఉంటారన్నది వాస్తవం. అందుకే టిడిపితో పొత్తులో భాగంగా ఈ రెండు జిల్లాల నుంచే పవన్ కళ్యాణ్ ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసే అవకాశాలుంటాయి. ఇదే టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.
రాజమండ్రి రూరల్ సీటుపై జనసేన కన్నేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ సీటును పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని అడుగుతోంది. దానికి చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరోసారి ఇదే సీటు నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే జనసేనతో పొత్తు తన కు ఎసరు పెట్టేలా ఉందని ఆయన ఆందోళన చెందుతున్నారు. స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. అపుడు ములాఖత్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత హఠాత్తుగా టిడిపి-జనసేన పొత్తును ఖరారు చేశారు.
రాజమండ్రి రూరల్ సీటు జనసేనకు కేటాయిస్తే..పోనీ తనకు రాజమండ్రి అర్బన్ సీటు అయినా ఇవ్వాలని బుచ్చయ్య ఆశిస్తున్నారు. అయితే అర్బన్ లో ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ కుటుంబానికీ బుచ్చయ్యకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చంద్రబాబు కూడా ఆదిరెడ్డి కుటుంబంవైపే మొగ్గు చూపుతున్నారు. ఇదే బుచ్చయ్య చౌదరికి నిద్రలేకుండా చేస్తోంది. అటు రూరలూ పోయి..ఇటు అర్బనూ పోతే ఇక తనకి పోటీ చేయడానికి సీటే లేని పరిస్థితి వస్తుందని ఆయన భయపడుతున్నారు. అది తన రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టేస్తుందేమోనని ఆయన చాలా చాలా కంగారు పడుతున్నారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత సొంత నియోజక వర్గం పాయకరావు పేట. గత ఎన్నికల్లో ఆమె ఆ నియోజక వర్గంలో ఓటమి చెందారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పాయకరావు పేట నుండే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే టిడిపి-జనసేన పొత్తులో పాయకరావు పేట సీటు కూడా జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వంగలపూడి అనితకు సీటు గోవిందే అని చెప్పాలి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు టెన్షన్ పెరుగుతోంది. ఈ నియోజక వర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. ఇదే జిల్లా తాడేపల్లి గూడెంలో టిడిపి తరపున టికెట్ ఆశిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. అయితే ఇక్కడ జనసేన అభ్యర్ధి బొలిశెట్టి శ్రీనివాస్ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.
ఉత్తరాంధ్రలోనూ ఇటువంటి పీట ముడులే ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి నియోజక వర్గాన్ని జనసేన అడుగుతోంది. ఇదే సీటు నుండి పోటీ చేయాలని టిడిపినేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశపడుతున్నారు. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నుండి పోటీ చేయాలని టిడిపి నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భావిస్తున్నారు. ఆ మద్య ఈ సీటు నుండే నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. దాన్ని టిడిపి అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఖండించలేదు. వీరు కాక పార్టీలో తోక జాడిస్తోన్న నేతలకు చెక్ చెప్పేందుకు వారి నియోజక వర్గాలను జనసేనకు కేటాయించేస్తే పోతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…