చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారా ?

By KTV Telugu On 14 November, 2023
image

KTV TELUGU :-

ఎవరితో ఎవరు భేటీ అవుతున్నారు. భేటీలతో  రాజకీయ సమీకరణాలు మారిపోతాయా. ఓట్లు దండుకోవడానికి భేటీలు ఉపయోగపడతాయా.  ఆ ఇద్దరు నేతలు భేటీ అయిన మాట నిజమేనా…

నవంబరు 30 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. తెలంగాణ పార్టీల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వేగం  పుంజుకున్నాయి. గెలిచేందుకు పార్టీలు తహతహలాడుతున్న తరుణంలో నేతల మధ్య  రహస్య భేటీలు సైతం చర్చనీయాంశమవుతున్నాయి. ఈ దిశగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లి చంద్రబాబును హైదరాబాద్ నివాసంలో ఆయనతో భేటీ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిప్పులేనిదే   పొగ  రాదన్నట్లుగా టీడీపీలోనూ దీనిపై చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు టీడీపీలో రేవంత్‌రెడ్డి క్రియాశీల‌కంగా ప‌ని చేశారు. చంద్రబాబు శిష్యుడిగా రేవంత్‌రెడ్డిని టీడీపీ శ్రేణులు ఇప్ప‌టికీ అభిమానిస్తున్నాయి. కేవ‌లం రేవంత్‌రెడ్డిని సీఎం చేసుకోడానికే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌కూడ‌ద‌నే ఉద్దేశంతో టీడీపీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడిని ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుడు అర్ధ‌రాత్రి వేళ క‌లుసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.ఎన్నిక‌ల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో స‌ద‌రు నాయ‌కుడికి చంద్ర‌బాబు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలిసింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానితో చంద్రబాబు ఆశీస్సుల కోసమే ఆయన  వెళ్లారని చెబుతున్నారు.

ఇప్పటికే తెలంగాణ  పోటీ నుంచి టీడీపీ  తప్పుకుంది.పరిస్థితులను కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చేందుకే  టీడీపీ ఈ పని  చేసిందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే, ఆ ప్ర‌భావం ఏపీలో టీడీపీపై ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు, లోకేశ్ న‌మ్ముతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డ‌మే త‌రువాయి, ఏపీలో టీడీపీ వ‌చ్చిన‌ట్టే అని వారు విశ్వ‌సిస్తున్నారు. అందుకే తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేందుకు టీడీపీ నేత‌లు వెనుక నుంచి ఏం చేయాలో అన్ని ప‌నులు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఆర్థికంగా అండ‌దండ‌లు అంద‌జేస్తున్న‌ట్టు టీడీపీ నాయ‌కులే ప్ర‌చారం చేస్తున్నారు.కూకట్ పల్లి  నియోజకవర్గం వ్యవహారంలో ఒక సంఘటన జరిగినట్లు కూడా జనంలో చర్చ జరుగుతోంది. అక్కడి కమ్మ సామాజికవర్గం వారంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ కు ఓటెయ్యాలని తీర్మానించారట. ఆ సంగతి తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. వారిని కలుసుకుని నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని తనకు మద్దతివ్వాలని కోరారట. అందుకు కూకట్ పల్లి కమ్మ సామాజికవర్గం వారు ససేమిరా అన్నట్లు చెబుతున్నారు. పైగా తమ ఇంట్లో  మహిళలు కూడా బీఆర్ఎస్ కు తీవ్ర వ్యతిరేకంగా  ఉన్నట్లు వారు మాధవరం కృష్ణారావు దృష్టికి తెచ్చారు. దానితో ఆయన మౌనంగా ఉండిపోయారట.

కమ్మ సామాజికవర్గం బీఆర్ఎస్ కు దూరం జరగడానికి  చాలా కారణాలే ఉన్నాయి.  బీఆర్ఎస్, వైసీపీ ఒకటేనన్న ఫీలింగ్ వారికి వచ్చింది. చంద్రబాబుపై బీఆర్ఎస్ కక్షకట్టి, వైసీపీతో అన్ని పనులు చేయిస్తోందని వారికి ఫీలింగ్  వచ్చేంది. మరో పక్క బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడుతోందని కమ్మ సామాజికవర్గం భావిస్తోంది. ఈ లోపు కూకట్ పల్లి వ్యవహారం రేవంత్  రెడ్డి దృష్టికి వచ్చింది. సెటిలర్లు ఉండే మిగతా నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కు మద్దతు కూడగట్టుకునేందుకు సహకరించాలని కోరేందుకే చంద్రబాబు వద్దకు రేవంత్ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి