తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సోషల్ ఇంజినీరింగ్ మీదనే ఆశలు పెట్టుకుంది. ఆరు నెలల కిందట ఎలాంటి కులసమీకరణాలతో పని లేకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటను పూర్తిగా కైవసం చేసుకుని హాట్ ఫేవరేట్ పార్టీగా మారుతున్న సమయంలో హైకమాండ్ చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాలతో బీజేపీ వెనకుబడిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ముఖాముఖి పోరు జరుగుతోందని ఎక్కువ మంది భావిస్తున్నారు. సర్వేలు కూడా అదే చెబుతున్నాయి. ఏ సర్వే కూడా బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు కానీ ఓట్లు కానీ వస్తాయని చెప్పడం లేదు. అంటే బీజేపీ గడ్డు పరిస్థితుల్లో ఉందన్నమాట. ఇలాంటి సమయంలో బీజేపీని రేసులోకి తీసుకు రావడానికి బీజేపీ అగ్రనేతలు ప్రయోగిస్తున్న ఆయుధం సోషల్ ఇంజినీరింగ్. అంటే కొన్ని కులాల కాంబినేషన్లను కలిపి ఎన్నికల సాగరాన్ని ఈదేయాలనుకోవడం.
సోషల్ ఇంజినీరింగ్ అనేది ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ సక్సెస్ ఫుల్ గా అమలు చేసింది. కానీ దక్షిణాదిలో మొదటి సారిగా తెలంగాణలోనే ఈ సామాజిక సమీకరణాలను ప్రయోగిస్తున్నారు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే.. ఈ సోషల్ ఇంజనీరింగ్ వల్ల తాము లక్ష్యంగా పెట్టుకున్న సామాజికవర్గాలు తమకు దగ్గర అవుతాయా లేదా అన్న సంగతి పక్కన పెడితే .. కొన్ని వర్గాలు మాత్రం ఖచ్చితంగా దూరం అవుతాయి. ఇప్పుడు బీజేపీకి అదే సమస్య వెంటాడుతోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫలానా వర్గాన్ని దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. తాము అందరి కోసం ఆలోచిస్తామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం బిన్నంగా వెళ్తోంది. బీసీని సీఎం చేస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించింది. పవన్ కల్యాణ్‌తో పొత్తులు పెట్టుకుంది.
ఈ వ్యూహాలతో బీజేపీ ఎంత ప్లస్ అవుతుందో కానీ… మైనస్ పాయింట్లు మాత్రం కనిపిస్తున్నాయని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఓ ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ ఓటు బ్యాంక్ ఎలాంటిదో బీజేపీకి స్పష్టంగా తెలుసు. ఉత్తరాదిలో అయినా.. దక్షిణాదిలో అయిన అగ్రకులాల్లోనే ఎక్కువగా బీజేపీకి మద్దతుదారులు ఉంటారు. అయితే ఇతర బీసీ కులాల్ని ఆకట్టుకోవడం ద్వారా ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బలమైన ముద్ర వేయడానికి బీజేపీ తన రూటు మార్చింది. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని అందుకుంది. ఈ నినాదం వల్ల బీసీలంతా ఏకపక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఎందుకంటే.. వందల్లో ఉన్న బీసీ సామాజిక వర్గాలు రాజకీయ పరంగా ఐక్యంగా లేవు. ఏదో ఓ కులానికి సీఎం పదవి వస్తుంది కాబట్టి ఇతర బీసీ కులాలు ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. కానీ బీసీ నినాదం ఎత్తుకోవడం వల్ల..బీజేపీకి సంప్రదాయంగా ఉండే.. అగ్రవర్ణాల ఓటర్ల మద్దతు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బీజేపీ కూడా తమను పట్టించుకోవడం లేదన్న భావన పెరిగితే… మరింత నష్టం జరుగుతుంది.
ఇక మాదిగ వర్గాన్ని తమకు ఏకపక్షంగా అనుకూలంగా చేసుకునేందుకు ఎస్సీ వర్గీకరణ వివాదాన్ని బీజేపీ ముందుకు తెచ్చింది. ఇది ఓ రకంగా వేలికి అంటిన దాన్ని ముక్కుకు రాసుకోవడం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇది సున్నితమైన విషయం ప్రస్తుతం పదిహేను ఎస్సీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. మాల, మాదిగ అనే వర్గీకరణ లేకుండా రెండు వర్గాలను దళితులుగా చూస్తున్నారు. మాల, మాదిక వర్గాలు కాకుండా దళిత వర్గాల్లో 57 ఇతర కులాలు కూడా ఉన్నాయి. కానీ వారి జనాభా దళిత వర్గాలల్లో ఇరవై శాతం మాత్రమే ఉంటారు. ఎస్సీ వర్గీకరణ అనే డిమాండ్ కేవలం మాదిగ వర్గాల నుంచే వస్తోంది. ఇతర వర్గాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాని మోదీ సభలో ఓ యువతి కరెంట్ పోల్ ఎక్కి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సభకు బీజేపీలోని మాల సామాజికవర్గ నేతలు హాజరు కాలేదు. వారు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీల్లోని ఇతర సామాజికవర్గాలు కూడా వర్గీకరణపై అంత సుముఖంగా లేరు. ఇప్పుడు మాదిగ వర్గాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ ఇతర వర్గాలన్నింటినీ దూరం చేసుకున్నట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజినీరింగ్ పేరుతో చేస్తున్న ఈ రాజకీయం వల్ల.. సమాజంలో కలసి మెలసి ఉంటున్న కొన్ని వర్గాల మధ్య దూరం పెరుగుతుందన్న ఆందోళన కూడా రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. బీసీలు, అగ్రవర్ణాల మధ్య ఓ రకమైన ద్వేష భావాన్ని పెంచుతుందన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో దళితులే అయినా ఇప్పటికే మాల, మాదిగ సామాజికవర్గాల మధ్య వర్గీకరణ పేరుతో ఏర్పడిన గ్యాప్ మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇలాంటివి రాజకీయాల్లో సహజమే అయినా.. సమాజంలో కుల ప్రభావాన్ని.. రాజకీయాల్లో కులాల మధ్య వివాదాల్ని మరింత పెంచుతుందన్న ఆందోళన కూడా ఉంది.
బీజేపీ ఈ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ చేస్తోంది. బీసీ, కాపు, మాదిగ వర్గాలను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలవాలనుకుంటోంది. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంది.ఈ నిర్ణయాల వల్ల ఇతరులు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వర్గాలు అయిన పూర్తి స్థాయిలో బీజేపీని నమ్ముతాయా అన్నదే అసలు ప్రశ్న. బీజేపీ ప్రస్తుతం వెనుకబడిందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో గెలిచే పరిస్థితి లేదని ఓటర్లు బీజేపీని ఎంపిక చేసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. అంటే.. సంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోవాల్సి వస్తుంది.. అలాగే కొత్తగా టార్గెట్ చేసుకున్న వారూ కలసి రారు. అంటే రెంటికి చెడ్డ రేవడి అవుతుంది. రాజకీయాల్లో చాణక్యుల్లాంటి వారికైనా అన్ని సార్లూ తమ ప్లాన్లు వర్కవుట్ కావాలని ఏమీ లేదు. రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటి సమస్యలతో రాజకీయం చేయాల్సి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…