తెలంగాణ గడ్డ ఎవరి అడ్డా..ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ ప్రశ్నకు సమాధానం చిక్కుముడిలా తయారైందనిపిస్తోంది. ఈ ప్రశ్న రాష్ట్రం మొత్తానికే కాకుండా, సూక్ష్మంగా చెప్పాలంటే ప్రతీ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు సింపుల్ గా గెలిచిపోతారనుకుంటే.. ఇప్పడు జలగం వెంకట్రావు ఎంట్రీ ఇచ్చి ముచ్చెమటలు పోయిస్తున్నారు. మరి జలగం ఇప్పుడు జెయింట్ కిల్లర్ అవుతారా.. పెద్ద ప్రశ్నే….
సిట్టింగులకే మళ్లీ సీట్లు అన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఆశావహులు తీవ్ర ఆగ్రహం చెంది.. తిరుగుబాటు చేయడమో, లేక రెబెల్ అభ్యర్థిగా రంగంలోకి దిగడమో చేస్తున్నారు. దానితో పార్టీ అభ్యర్థుల గొంతులో పచ్చివెలక్కాయపడినట్లవుతోంది. కొత్తగూడెంలోనూ అదే జరిగింది. ‘కొత్తగూడెం గడ్డ నా అడ్డా. ఇక నాకు తిరుగులేదు. ఈజీగా గెలిచేస్తానని’ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎంతో ఆశపడ్డాడు.. సీఎం పర్యటనతో ఒక్కసారిగా తన మీద ఉన్న వ్యతిరేకత పూర్తిగా తొలగిపోయిందని ఆయన భావించారు. కానీ అకస్మాత్తుగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మొహమాటం లేకుండా రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. కూల్ గా సాగిపోతున్న కొత్తగూడెం రాజకీయాల్లో కాక రేగింది. వాస్తవానికి కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటింది. ఈసారి ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ముఖ్యంగా వనమా వర్గీయులు సంబరపడ్డారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడక అనే అభిప్రాయానికి వచ్చారు. ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా లగం వెంకటరావు నామినేషన్ దాఖలు చేయడంతో కొత్తగూడెం పాలిటిక్స్ హీట్ ఎక్కాయి.
రెండు ఎన్నికలుగా జలగం, వనమా వైరం కొనసాగుతోంది. 2014లో వైసీపీ అభ్యర్థిగా వనమా, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా జలగం వెంకటరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వనమా మీద జలగం విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఆ తర్వాత వనమా కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా వనమా రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా జలగం వెంకటరావు పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వనమా విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికే వనమా బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే వనమా అఫిడవిట్ పై జలగం కోర్టుకు వెళ్లడంతో పరిణామాలు మారిపోయాయి.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో హైకోర్టు వనమాను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు.. ప్రస్తుతం ఈ కేసుపై స్టే ఉంది.
వనమా బీఆర్ఎస్‌లో ఉన్నా కేసీఆర్ తనకే టికెట్ కేటాయిస్తారని జలగం వెంకట్రావు ఎదురుచూశారు. పైగా వనమా వెంకటేశ్వరరావుపై కొత్తగూడెం ప్రజల్లే తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్రరావుపై ఉన్న కేసులతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వరని ఎదురుచూశారు . కాకపతోే అలా జరగలేదు. వనమాకే టికెట్ రావడంతో జలగం అనివార్యంగా సర్దుకుపోతారనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగకుండా సీపీఐ నేత కూనంనేనికి టికెట్ ఇచ్చింది. ఈవీఎంలో కాంగ్రెస్ గుర్తు ఉండకుండా, సీపీఎం గుర్తు ఉంటుంది కాబట్టి సెంటిమెంట్‌గా విజయం తననే వరిస్తుందని వనమా ఎదురుచూశారు. కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు వచ్చి బీఆర్ఎస్‌లో చేరడం శుభ పరిణామమని భావించారు. కాకపోతే జలగం కూడా రంగంలోకి దిగడంతో వనమాకు నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు సీపీఐకి వెళ్లిపోవడం, బీఆర్ఎస్ ఓట్లు వనమా, జలగం మధ్య చీలిపోతే మాత్రం పోటీ గట్టిగానే ఉంటుంది. అప్పుడు వనమాకు కష్టకాలం తప్పదని భావిస్తున్నారు. పైగా పథకాల అమలులో వనమా ఉదాసీనంగా వ్యవహరంచారని, ఆయన అనుచరులు డబ్బులు దండుకున్నారని కూడా ఆరోపణలున్నాయి. దళిత బంధు, బీసీ బంధు . మైనార్టీ రుణాల్లో కేటాయింపులు, డబుల్ బెడ్ రూమ్ వసూళ్లు ఇప్పుడు వనమా మెడకు చుట్టుకుంటున్నాయి.
జలగం వెంకట్రావుకు నియోజకవర్గంలో కొంత మేర మంచి పేరు ఉంది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జనానికి అందుబాటులో ఉండేవారని చెప్పుకుంటున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, బడుల్లో మధ్యాహ్న భోజన పథకం లాంటివి జలగాన్ని సగటు ఓటరు దగ్గరకు చేర్చాయి. వనమా కంటే ఆయనే బెటర్ లీడర్ అని చెప్పుకుంటున్నారు. మరో పక్క సింగరేణి సహా కార్మిక సంఘాల మద్దతు కూనంనేనికి దక్కితే ఇక వనమా పని ఔట్ అని చెబుతున్నారు. మరి అధికార పార్టీ అభ్యర్థి వనమా ఎలా గట్టెక్కుతారో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…