ఆ రెండు చోట్లా అంతే సంగ‌తులు

By KTV Telugu On 16 November, 2023
image

KTV TELUGU :-

ఆ ఎమ్మెల్యేలకు ప్రజలే ప్రత్యర్థులవుతున్నారు. క్యాడరే ఎదురు తిరుగుతోంది. ప్రజా ప్రతినిధులు పార్టీకి దూరమవుతున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవడంతో అక్కడి అభ్యర్థులు ఎదురీదుతున్నారు. అధికార పార్టీ అండదండలున్నా ఆ ఇద్దరు ఒడ్డెక్కడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. కదులుతున్న కుర్చీలను కాపాడేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతకీ ఆ నియోజకవర్గాలు ఎక్కడున్నాయి? ఆ ఇద్దరు అభ్యర్థులెవరు? వాచ్ దిస్ స్టోరీ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కొన్నింటిలో గులాబీ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కారు మహా జోరుగా పరుగులు తీస్తోంది. కాని మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కారు బేజారవుతోంది. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులు బుల్లెట్లలా దూసుకుపోతున్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో కారు మాత్రం ముందుకు కదలడం లేదు. పైగా గులాబీ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలు సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతాలు. ఈ రెండు సెగ్మెంట్లలో గత రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు.

అయితే మొదటిసారి కంటే రెండోసారి వారి మెజారిటీ భారీగా తగ్గిపోయింది. మంచిర్యాల నుంచి దివాకరరావు…బెల్లంపల్లి నుంచి దుర్గం చిన్నయ్య మూడోసారి బరిలో నిలిచారు. హ్యాట్రిక్ సాధిస్తామని ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల ప్రచారం సందర్భంగా దివాకరరావు, దుర్గం చిన్నయ్యలు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గలో పనులు చేయకుండా మళ్లీ ఓట్ల కోసం ఎందుకొచ్చారంటూ మంచిర్యాల ఎమ్మెల్యేను నిలదీస్తున్నారు. ఈసారి మీకు ఓట్లేసి లేదని తెగేసి చెబుతున్నారు. ఇక స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే దివాకరరావుకు తీరుకు నిరసనగా గులాబీ పార్టీకి రాజీనామాలు  చేస్తున్నారు. ‌

ఇప్పటికే ఎంపిటీసీలు, సర్పంచ్ లు, ఎంపిపి, ‌ఒక జడ్పీటీసి పార్టీకి రాజీనామా సమర్పించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకో వైపు సర్కార్ పై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో దివాకర్ రావుకు ప్రతికూల ఫలితాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి నుండి గట్టెక్కినా..ఈసారి విజయతీరాలకు చేరే పరిస్థితులు కనిపించడంలేదనే భయం కారు పార్టీ అభ్యర్థిని వెంటాడుతోంది.

బెల్లంపల్లిలోనూ ఇవే పరిస్తితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్ల ప్రజల్లో‌‌ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సర్కారు సంక్షేమ పథకాలు తప్ప ఎమ్మెల్యే ‌ప్రజలకు చేసింది ఏమీ లేదంటున్నారు. భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు, మహిళలపై  లైంగిక వేధింపులు, ఎమ్మెల్యే ప్రతిష్టను పూర్తిగా దిగజార్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లితే   ప్రజలు అడ్డుకుంటున్నారు. దశాబ్ద కాలంలో ఏమి చేశారని ప్రశ్నిస్తున్నారు.‌ గ్రామాలకు రోడ్లు వేయకుండా  ఓట్ల కోసం ఎందుకు వచ్చారంటూ చిన్నయ్యకు ఎదురు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడల కారణంగా పార్టీ శ్రేణులు కూడా క్రమేణా దూరమవుతున్నారు. ఉన్నవారు అసంత్రుప్తితో ‌‌రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని…ఈ ఇద్దరు‌ గెలిచే పరిస్థితులు  లేవని పార్టీ నిర్వహించిన సర్వేల్లోనే తేలిందని టాక్.ఎమ్మెల్యేల కారణంగా మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలలో ఓటమి తప్పదని గ్రహించిన అధికార పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది.

పార్టీ కేడర్‌ లేదా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ వైపు మళ్లకుండా అసంతృప్త నేతల్ని బుజ్జగిస్తున్నారు. అసంత్రుప్తి వాదులకు స్థాయిని బట్టిని కొందరికి పదవులు, మరికొందరికి డబ్బు ముట్టజెబుతూ దారికి తెస్తున్నారనే టాక్ నడుస్తోంది. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెబుతున్నారు. పోలింగ్ నాటికి పరిస్తితి పూర్తిగా సానుకూలంగా మారిపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సక్సెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి