మేనిఫెస్టో మంత్రాలు – ఓట్ల చింతకాయలు

By KTV Telugu On 18 November, 2023
image

KTV TELUGU :-

రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటించి ఓట్లు అడగడం అనేది సంప్రదాయం. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి అదే జరుగుతోంది. కాకపోతే మేనిఫెస్టోల్లోని అంశాలపైనే మౌలికమైన మార్పు వస్తోంది. అప్పట్లో సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేస్తామని చెప్పేవారు. ప్రజా జీవితం సాఫీగా సాగిపోవడానికి ఏం చేస్తామో వివరించేవారు. ఇప్పుడు మేనిఫెస్టో అంటే.. కేవలం ఉచిత హామీలు.  ఫలానా స్కీమ్ అమలు చేస్తామని.. ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పడం. నిజంగా  ప్రజలు ఈ హామీల్ని నమ్ముతున్నారా అంటే… చెప్పడం కష్టం. ఎందుకంటే..  రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం అసాధ్యం. లక్షల కోట్లు రావాలి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రజల నుంచే పిండుకోవాలి.  ప్రజల నుంచి అన్ని లక్షల కోట్లు పిండుకోవడం కష్టం.  అందుకే రాజకీయపార్టీలు హామీల అమలు విషయంలో షార్ట్ కట్స్ పాటిస్తున్నాయి. అర్హుల పేరుతో  అతి తక్కువ మందికి లబ్ది చేకూర్చి అమలు చేసేశామంటున్నారు.  తెలంగాణ విషయంలోనూ రాజకీయ పార్టీలు అదే చేస్తున్నాయి. ఎవరూ ఊహించలేని హామీలతో తెర ముందుకు వస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనాకర్షక పథకాల వరాలను గుప్పిస్తున్న ప్రధాన పార్టీలు సుదీర్ఘంగా కసరత్తు చేసి పోటాపోటీ హామీలతో మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. అందరికంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తొలుత ఆరు గ్యారంటీలను ప్రకటించింది.  వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అదే మేనిపెస్టో  అని చాలా మంది అనుకున్నారు. కానీ సామాజికవర్గాల వారీ డిక్లరేషన్లుప్రకటించారు.  ఇప్పుడు అన్నీ కలిపి మేనిఫెస్టో తయారు చేశారు.  ఈ సారి కాంగ్రెస్ బంగారం కూడా ఇస్తామని చెబుతోంది. ఇక ఇతర హామీల సంగతి చెప్పాల్సిన పని లేదు.  ఇందులో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రెండు వందల  యూనిట్ల కరెంట్ ఉచితం కూడ ఉన్నాయి.  ఇక ఉచితాలకు వ్యతిరేకమని ప్రధాని మోదీ బహిరంగసభల్లో చెబుతూ ఉంటారు. కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉచిత మేనిఫెస్టో ప్రకటిస్తూ ఉంటారు. తెలంగాణలోనూ అలాగే ఉండబోతున్నాయి. శనివారం బీజేపీ మేనిఫెస్టో వస్తుంది.  ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలను పరిశీలిస్తే.. ఇక్కడ కూడా అదే తరహాలో ఉండటం ఖాయమన్న వాదన వినిపిసతోంది.  కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు పోటీగా ఉచిత పథకాలు ఇవ్వబోతున్నారు.  ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పుడే కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను మించే కాదు    పెన్షన్ల పెంపు సహా అనేక హామీలు ఇచ్చారు.

తెలంగాణలో ఒక్కో రాజకీయ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే బడ్జెట్ సరిపోదు.  తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఇబ్బందికరంగా మారింది. జీతాలు సమయానికి ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో హామీలు అమలు చేయాలంటే పన్నులు పెంచాలి.. లేకపోతే అడ్డగోలుగా అప్పులు చేయాలి. కానీ రాజకీయ పార్టీలు ఇక్కడే ఓ షార్ట్ కట్ ను ఎంచుకుంటున్నాయి. అర్హుల పేరుతో  వీలైనంత మందిని అనర్హుల్ని చేసి… ఓ ఐదు మందికో పది మందికో పథకం అమలు చేసి.. ప్రచారం చేసుకోవడం.  ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో  వైసీపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నోట అర్హులు అనే మాట ఎక్కువగా వస్తూ ఉంటుంది. అర్హతలను నిర్ణయించేది ప్రభుత్వమే అయినప్పుడు అర్హులు ఎంత మంది ఉండాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందన్నమాట.  ఉదాహరణకు  పేదల కుటుంబాల్లో వివాహాలకు టీడీపీ ప్రభుత్వం యాభై వేలు ఇచ్చేది. తాము లక్ష ఇస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ అర్హతలు మార్చేసింది. వధువు, వరుడు పదో తరగతి పాస్ కావాలనే రూల్ పెట్టింది. అసలు పెళ్లికి, విద్యార్హతలకు సంబంధం ఏముంటుంది ?. ఆ పథకం లక్ష్యం పేదల కుటుంబాల్లో పెళిళ్లు భారం కాకూడదని. కానీ లబ్దిదారుల్ని తగ్గించుకోవడానికి విద్యార్హత పెట్టారు. దాంతో పది శాతం మంది కూడా అర్హులు కాకుండా పోయారు. కానీ పథకం అమలు చేసినట్లుగా ప్రచారం చేసుకోవచ్చు. దాదాపుగా అన్ని పథకాలు అంతే. ఏపీ ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో  అత్యధిక పథకాల లబ్దిదారులు నియోజకవర్గానికి వెయ్యి లోపే ఉంటారు.  రాష్ట్రం మొత్తం లక్షన్నర.. రెండు లక్షల మధ్యనే ఉంటారు. కానీ వేల కోట్లు జమ చేశామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. పథకాల అమలులో ఇదో కొత్త మోడల్ అన్నమాట.

బహుశా తెలంగాణలో అధికారంలోకి వచ్చే పార్టీలు కూడా ఇదే మోడల్ అనుసరించాల్సి ఉంటుంది.  బీఆర్ఎస్ సీఎం సీఆర్ జగన్ మోడల్ లో పెన్షన్లు ఐదు వేలకు పెంచుకుంటూ పోతామన్నారు. 2019 ఎన్నికల సమయంలో  మూడు వేలు పెన్షన్ హామీ ఇస్తామన్న సీఎం జగన్ ఇప్పటికీ 2750 మాత్రమే ఇస్తున్నారు.   అలాగే.. కేసీఆర్ నోటి వెంట అర్హులు అనే మాట ఎక్కువ వచ్చింది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలనూ అదే కనిపించింది.  కాంగ్రెస్, బీజేపీ ఈ మాట చెప్పడం లేదు కానీ.. అర్హులు అనేది వారి మేనిఫెస్టోలో హిడెన్ గా ఉంటుంది. ఈ విషయంలో ప్రజలకూ క్లారిటీ ఉంది.  రాజకీయ పార్టీలు హామీల పేరుతో మోసం చేస్తాయి కానీ నిజంగా చేతికి అందించే లబ్ది పెద్దగా ఉండదని ఆ పేరుతో పన్నులు పెంచుతారన్న అంశంపైనా వారికి అవగాహన ఉంది.  అంటే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు కళ్లు చెదిరే విధంగా ఉంటాయి. కానీ గెలిచిన తరవాత ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.  అడ్డగోలు నిబంధనలు పెట్టి అతి తక్కువ మందికి ఇస్తారు. అందుకే ప్రజలు కూడా ఇలాంటి పథకాలపై ఆశలు పెట్టుకోవడం లేదు. కానీ.. ఓటర్లలో ఉండే సహజమైన ఆశే రాజకీయ పార్టీలకు పెద్ద వరంగా మారింది.

అసలు మేనిఫెస్టో విడుదల చేయని ఒకే ఒక్క పార్టీ దేశంలో మజ్లిస్ మాత్రమే.     రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను ప్రతీ సారి ఎన్నికల సంఘానికి సబ్‌మిట్ చేయాలి. తమకు ఎలాంటి మేనిఫెస్టో లేదని  లేఖను మజ్లిస్ సబ్‌మిట్ చేస్తుంది.  మేనిఫెస్టో లేకపోవడమే తమ మేనిఫెస్టో అని మజ్లిస్ చెబుతుంది. మజ్లిస్ కు రాష్ట్రంలో కేంద్రంలో అధికారం దక్కదు. ఆ విషయం ఆ పార్టీ నేతలకు తెలుసు. అందుకే మేనిఫెస్టో ప్రకటించరు. కానీ ఆ  పార్టీ ప్రజాప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉంటారు. అదే వారి మేనిఫెస్టో.  మజ్లిస్ హెడ్ ఆఫీస్  దారుస్సలాంకు సాయం కోసం ఎవరు వెళ్లినా మాటలు వినేవాళ్లు ఉంటారు.  ఆటోలకు చలానాలు రాస్తే … వస్తారు.  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని కేసులు పెట్టినా వస్తారు. కరెంట్ బిల్లులు కట్టకపోతే కరెంట్ కనెక్షన్ పీకేసినా వస్తారు.  అదే వారి మేనిఫెస్టో.   అంటే ఓ రకంగా అన్ని రాజకీయ పార్టీల కన్నా.. మజ్లిస్ మేనిఫెస్టోనే కాస్త నిజాయితీగా ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి