సీఎం రేస్ – గెలవకుండానే ఓడుతున్న కాంగ్రెస్

By KTV Telugu On 18 November, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించాల్సిన పని లేదు .. వాళ్లకు వాళ్లే ఓడించుకుంటారని ఇతర రాజకీయ పార్టీలు సెటైర్లు వేస్తూంటాయి. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలకు వెళ్తున్న సమయంలో అదే పని చేసుకుంటున్నారు. అసలు పోరాటం ఇంకా ముగియలేదు. పోలింగ్ యుద్ధం పూర్తి చేయలేదు. అప్పుడే మాకు అంటే మాకు సీఎం సీటు అని నేతలు ముందుకొచ్చేస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తానే ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు చేస్తూ పోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, సోనియాగాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని, పార్టీలో తనకంటే సీనియర్లు ఎవరూ లేరని భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ లో తన కంటే సీనియర్లు ఎవరూ లేరని ఆయన చెప్పుకున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లోనే కాదు.. ఇతర రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాశం అయ్యాయి.

ఏ రాజకీయ నాయకుడికి అయినా ముఖ్యమంత్రి పదవే టార్గెట్. అందులో సందేహం లేదు. ప్రాంతీయ పార్టీల్లో అయితే ఆ పార్టీ అధ్యక్షుడికి తప్ప మరొకరికి చాన్స్ రాదు. అదే జాతీయ పార్టీలో అయితే..  ఆ రాష్ట్రంలో ఉన్న కీలక నేతకు పదవి దక్కుతుంది.  కాంగ్రెస్ లో అయితే ఈ కీలక నేతలు చాలా మంది ఉంటారు.  రేవంత్‌రెడ్డి కాబోయే సీఎం అని  ఆయన చెప్పుకోరు కానీ ఆయన అనుచరులు ప్రకటిస్తూనే ఉంటారు.  ఇక  జానారెడ్డి ముఖ్యమంత్రి పదవి తనను వెదుక్కుంటూ వస్తుందని చెప్పారు. జగ్గారెడ్డి వచ్చే పదేళ్లలో తానే ముఖ్యమంత్రినని చెప్పుకున్నారు.  భట్టి విక్రమార్క దళిత వర్గాల నుంచి సీఎం అవుతారని.. తానే మొదటి స్థానంలో ఉన్నానని గట్టి నమ్మకంతో ఉన్నారు.  మధుయాష్కీ లాంటి నేతలు ఇప్పటికే తాము సీఎం రేసులో ఉన్నామన్నారు. రాను రాను వీరి సంఖ్య పెరుగుతోంది. దీనికి కారణం .. ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కాస్త ముందు ఉందన్న  ప్రచారం జరుగుతూండటమే.

బీఆర్ఎస్ సర్కార్‌పై ఉన్న పదేళ్ల వ్యతిరేకత కారణంగా ఈ సారి కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కేసీఆర్ సామర్థ్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేకపోతున్నారు. అయితే గెలిచే చాన్స్ ఉందన్న కారణంగా కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేసులో నేనంటే నేనున్నానని చెప్పకోవడం ప్రారంభించారు. నిజానికి అసలు తప్పిదాన్ని కాంగ్రెస్ నేతలు ఇక్కడే చేస్తున్నారు. ఎందుకంటే.. ఇలాంటి నేతల ప్రకటనను ఇతర పార్టీలు ప్రజల్లో కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయకూడదో చెప్పేందుకు వాడుకుంటున్నాయి. కాంగ్రెస్‌లో సీఎం సీటు పంచాయతీని  ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆరెస్‌ నాయకులు తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు.  కాంగ్రెస్‌లో డజన్‌మందికిపైగానే సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేస్తుంటారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఆరు నెలలకో ముఖ్యమంత్రి వస్తారని.. వారికే గ్యారంటీ ఉండదని వారిచ్చే గ్యారంటీలకు ఇక గ్యారంటీ ఏమిటని ఎద్దేవా చేస్తున్నారు.

ఇలాంటి ప్రకటనలపై కాంగ్రెస్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ కు రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం చెప్పారు. తమ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చని అదే బీఆర్‌ఎస్ పార్టీలో సీఎం అవుతానని హరీష్ రావు చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. అలా చెబితే తెల్లవారే సరికి ఆయన జైల్లో ఉంటారని ఎద్దేవా చేశారు. నిజానికి ఇది రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతల్ని డిఫెండ్ చేసుకోవడమే కానీ.. ప్రజల్లో ఈ వాదన నిలబడదు. రేవంత్ రెడ్డి టార్గెట్ కూడా ముఖ్యమంత్రి కావడమే.  కాంగ్రెస్‌లో ఎవరు సీఎం కావాలన్నది  సీఎల్పీ భేటీలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది. కర్ణాటకలో డీకే శివకుమార్ విజయంలో కీలక పాత్ర పోషించినా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్దరామయ్యకు ఉండటంతో ఆయనకే సీఎం పీఠం అప్పగించారు. అయితే తాము శివకుమార్ కు ఇవ్వాలనుకుంటే ఇచ్చి తీరుతుంది.  అంతిమంగా తాము అనుకున్నదే ప్రతిపాదించి.. ఆమోద ముద్ర వేయించుకుంటుంది. పార్టీ ప్రయోజనాలను కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుంది. పార్టీకి ముప్పుగా మారుతారనుకుంటే ఎంత బలంగా ఉన్నా పదవులు ఇవ్వదు హైకమాండ్.

కానీ  కోమటిరెడ్డి వంటి నేతల  ప్రకటనల వెనుక రహస్య రాజకీయం ఉంటుంది. ఆయన రాజకీయాన్ని గత రెండేళ్లుగా అందరూ చూస్తున్నారు. ఆయన కాంగ్రెస్ కు ఇచ్చిన  విలువెంటో కూడా తెలుసు. ఇలాంటి సమయంలో తానే సీఎం అవుతానని సోనియా అవకాశం ఇస్తారని అనడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందని చెప్పుకోవచ్చు.  తెలంగాణ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. హంగ్ వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషణలు వస్తున్నాయి. ఒక వేళ ఏ పార్టీకి అయినా పూర్తి మెజార్టీ వస్తే అది రెండు, మూడు సీట్ల వరకే ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ లో వస్తే జరిగే రాజకీయం వేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో తన అనుచరులకే ఎక్కువ సీట్లు ఇప్పించుకున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి వంటి స్థానాల్లో తాము చెప్పిన వారికే ఇప్పించుకున్నారు. ఇక మనుగోడులో ఆయన సోదరుడే పోటీ చేస్తున్నారు. ఆయనతో కలిపి నలుగురు అవుతారు. ఇలా కోమటిరెడ్డి గ్రూప్ ఓ ఐదుగురు ఎమ్మెల్యేల్ని సిద్ధం చేసుకుంటే… అదే కాంగ్రెస్ కు రెండు, మూడు ఓట్ల మెజార్టీ ఎమ్మెల్యేలు ఉంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో.. ఊహించడం కష్టం. తనక సీఎం  సీటు ఇవ్వకపోతే తన గ్రూప్ ఐదుగురితో కలిసి వేరే పార్టీకి వెళ్లిపోతానని బెదిరిస్తే.. హైకమాండ్ అయినా ఏం చేస్తుంది ? కాంగ్రెస్ లో ఇలాంటి రాజకీాయలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందుకే .. నేతల సీఎం ఆశల చిట్టాలను అతం తేలికగా తీసుకునే అవకాశం ఉడదు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అంతర్గత రాజకీయాలకు ముద్దుగా అంతర్గత ప్రజాస్వామ్యం అని  పేరు పెట్టుకుంటారు.   వీరి తీరు చూసి ఇతర పార్టీలు.. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆరు నెలలకో సీఎం వస్తారని అలాంటి పార్టీ మనకు అవసరమా అని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.  పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి సారించాల్సిన నేతలు.. తామే ముఖ్యమంత్రి  అవుతామన్న ప్రకటనలు చేసుకుంటూ ప్రత్యర్థులకు చాన్సిస్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇదే పరిస్థితా అని ఓటర్లకూ అనుమానం కలిగేలా చేస్తున్నారు.   అందుకే తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ముందు గెలవండి.. ఆ తర్వాత పదవుల కోసం పోరాడుకోండి అని.. సలహాలిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని ఆ పార్టీ నేతలు మేఘాల్లో తేలియాడుతున్నారు. ఆ మబ్బులు చూసుకుని కింద ముంద ఒలకబోసుకుంటే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి