ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తున్నది భారత రాష్ట్ర సమితినా… తెలంగాణ రాష్ట్ర సమితినా ? . తెలంగాణ వరకూ పోటీ చేస్తున్నది టీఆర్ఎస్ మాత్రమే. ఈ విషయం టీఆర్ఎస్ అగ్రనేతల మాటల్లో .. ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ దొరలను తరిమికొట్టాలని కేటీఆర్ పిలుపునిస్తూండగా.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేది మనమేనని.. రాబోయేది అంతా ప్రాంతీయ పార్టీల రాజ్యమేనని కేసీఆర్ నినదిస్తున్నారు. ఈ రెండు ప్రకటనల్లో సారుప్యం ఉంది. కానీ బీఆర్ఎస్ నేతల్లోనే కన్ఫ్యూజన్ ఉంది. తెలంగాణ వాదం వదిలేసి జాతీయవాదం అందుకుని భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడెందుకు ఈ ప్రచారం అని. కానీ ఎందుకో కేసీఆర్, కేటీఆర్‌లకు స్ఫష్టత ఉంది. గెలవాలంటే తప్పనిసరిగా సెంటిమెంట్ అస్త్రం అందుకోవాల్సిందేనని క్లారిటీ వచ్చింది. కానీ ఈ ఆయుధం ఇంకా వారి చేతుల్లో పవర్ ఫుల్‌గా ఉందా అన్నదే డౌట్.
ప్రతి రాజకీయ పార్టీకి ఓటు బ్యాంక్ కీలకం. పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పార్టీలకు స్థిరమైన ఓటు బ్యాంక్ ఏర్పడితే ఆ పార్టీ నిలబడుతంది. ఇప్పటి వరకూ ప్రారంభమైన రాజకీయ పార్టీలన్నీ కుల, మత ప్రకారం ఓటు బ్యాంక్ ను ఏర్పాటు చేసుకుని బలోపేతం అయ్యాయి. కానీ దేశంలో మరి కొన్ని పార్టీలు ప్రాంత పరంగా ఓటు బ్యాంక్ ను ఏర్పాటు చేసుకుని సక్సెస్ అయ్యాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా.. తెలంగాణ రాష్ట్ర సమితి అలాంటి పార్టీల్లో ఉన్నాయి. ఈ పార్టీల ఓటు బ్యాంక్ కుల, మతాలకు అతీతమైనది. ప్రాంతీయ వాదమే బలం. తెలంగాణ పట్ల ప్రజల్లో ఉన్న సెంటిమెంటే టీఆర్ఎస్ బలం. అందుకే తిరుగులేని విజయాలు సాధించింది. కానీ తెలంగాణలో ఇక చేయాల్సిందేమీ లేదనుకున్న కేసీఆర్.. ఆ సెంటిమెంట్ బలం వదిలేసి.. జాతీయ రాజకీయాల కోసం పరుగులు పెట్టారు. అక్కడే తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచార వ్యూహం మొదటి నుంచి పూర్తిగా అభివృద్ధి కోణంలోనే ఉంది. తెలంగాణను బంగారు తునక చేసేశామని ఆశీర్వదించాలని కోరుతున్నారు. దీపావళి సందర్భంగా ప్రచారానికి మూడు రోజుల విరామం ఇచ్చి తమ ప్రచార శైలిపై విశ్లేషణ చేసుకున్న తర్వా.త .. రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసిన తర్వాత కేసీఆర్ వ్యూహం మార్చేశారు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అనే తన కవచకుండలాల్ని తీసుకుని ప్రచార తీరు మార్చేశారు . ఇప్పుడు ప్రచార సభల్లో కేసీఆర్ కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. ప్రాంతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని చెబుతున్నారు. మొదట్లో ఆయన జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకు రాలేదు. కానీ రెండో విడత ప్రచారంలో కేంద్రం వచ్చే ప్రభుత్వం గురించి చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా గురించి చెబుతున్నారు. కేసీఆర్ ప్రాంతీయ పార్టీల గురించి చెప్పినప్పుడల్లా ఎక్కువ మందికి ఒకటే డౌట్ వస్తోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీనా… రాష్ట్ర పార్టీనా అనే. తెలంగాణలో సాధించాల్సింది అయిపోయిందని.. ఇక దేశంలో గుణాత్మక మార్పు తీసుకు రావాలన్న లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి.. జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి కాదు.. మనది తెలంగాణ రాష్ట్ర సమితినే అన్నట్లుగానే బీఆర్ఎస్ ప్రచార వ్యూహం ఉంది. ఒక్క కేసీఆర్ మాత్రమే కాదు.. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరిదీ అదే మాట. ఖానాపూర్ లో కేటీఆర్ ఢిల్లీ నేతలొస్తారు.. వాళ్లని తరిమికొడతదాం అని పిలుపునిచ్చారు. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ మీదనే ఆధారపడుతున్నారు. ఢిల్లీ జాతీయ పార్టీలను నమ్మొద్దని వారే చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆరెస్‌నే గెలిపించాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చారనే సంగతినే మర్చిపోయినట్లుగా వీరంతా ప్రచారం చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఉపయోగిస్తున్నారని భావిస్తున్నారు.
టీఆరెస్ బీఆరెస్‌గా మారిన క్రమంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. పంజాబ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడి అధికారంలో ఉన్న నేతలను, ప్రతిపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులపై చర్చించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు. పార్టీ పేరు మార్చిన తర్వాత ఒడిషా, ఏపీలకు అధ్యక్షుల్ని ప్రకటించారు. మహారాష్ట్రపై కేంద్రీకరించిన కేసీఆర్.. కొందరు నేతలను హైదరాబాద్‌కు పిలిపించి.. గులాబీ కండువాలు కప్పారు. మహారాష్ట్రలో దున్నేస్తామని కూడా కేసీఆర్ గట్టిగా ప్రచారం చేశారు. కానీ హఠాత్తుగా అసలు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ గురించి మాట్లాడటం లేదు. ఒడిషా బీఆర్ఎస్ చీఫ్ మళ్లీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ న తెలంగాణలో కనిపించకుండా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు పూర్తిగా తెలంగాణ వాదంతోనే ఎన్నికలకు వెళ్తున్నారు.అయితే కేసీఆర్ అందుకున్న సెంటిమెంట్ అస్త్రానికి ఇంకా గతంలో ఉన్నంత పదును ఉందా అన్నదే కీలకం. కేసీఆర్ కు అవసరమైనప్పుడే తెలంగాణ సెటిమెంట్ గుర్తొస్తుందా అన్న భావన ప్రజల్లో వస్తే పవర్ కోల్పోయినట్లే.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర సాధన లక్ష్యంతో చేశారు. ఆ పార్టీకి కుల, మతాలకు అతీతమైన ఓటు బ్యాంక్ కేవలం తెలంగాణ వాదం మీదనే ఉంది. అవే ఆ పార్టీకి కవచ కుండలాలు. వాటిని తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. టీఆర్ఎస్ విజయాల్లో తెలంగాణ వాదానిదే అగ్రస్థానం. ఆ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు . కేసీఆర్ తప్పు చేస్తున్నారని అనుకున్నారు. కానీ కేసీఆర్ ముందుకే వెళ్లారు. ఇప్పుడు ఎన్నికల్లో ఉన్న పరిస్థితుల్ని చూసినా . తర్వాత తన బలాన్ని తాను మళ్లీ తెచ్చుకోవాలని డిసైడయ్యి వ్యూహం మార్చినట్లుగా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ కు బలం ఉందా.. లేదా అన్నదే చర్చనీయాంశం. కేసీఆర్ తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టేసి..జాతీయవాదం అందుకుంటున్నామని పార్టీ పేరు మార్చిన తరవాత రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో ఇతర పార్టీల ముద్ర తగ్గిపోయింది. పూర్తిగా తెలంగాణ నేతలే పోరాడుతున్నారు. దీంతో ప్రజలు గతంలోలా టీఆర్ఎస్ ప్రచారం చేసినట్లుగా.. ఇతర పార్టీల నేతల్ని.. తెలంగాణ వ్యతిరేకులుగా చూడలేకుపోతున్నారు.
కేసీఆర్‌కు పదేళ్ల వ్యతిరేకత ఉంది. పరిస్థితి క్లిష్టంగానే ఉంది. అందుకే వ్యూహం మార్చారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ తో… మరోసారి విజయం సాధిస్తే.. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఆయా రాష్ట్రాలకు మేలు చేస్తామని చెప్పి రాజకీయాలు చేయగలరా అన్న సందేహం వస్తుంది. కానీ.. కేసీఆర్ అంటేనే.. తెలంగాణ అనే బ్రాండ్ ఉందని.. ఇతర రాష్ట్రాలు కూడా యాక్సెప్ట్ చేస్తాయని బీఆర్ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. మహారాష్ట్రలో భారీగా జరిగిన చేరికలే సాక్ష్యమంటున్నారు. మూడో సారి కేసీఆర్ గెలిస్తే ఎలా గెలిచారన్న సంగతిని మర్చిపోతారని.. దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ వస్తుందని.. నమ్ముతున్నారు. అదే జాతీయ పార్టీ విస్తరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాజకీయాలంటే అంతే.. గెలుపే ముఖ్యం ఎలా గెలిచారన్నది కాదు. ప్రజలు కూడా విజయాన్నే చూస్తారు. అదే కేసీఆర్ నమ్మకం.
రాజకీయాల్లో ఓ సిద్దాంతం కీలకం. ఓ సిద్దాంతంపై నిలబడిన పార్టీల పునాదులు బలంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్చుకుంటే తాత్కలిక ప్రయోజనాలు లభించవచ్చు కానీ..పునాదులు బలహీనపడతాయి. బీఆర్ఎస్ విషయంలో ఏం జరుగుతుందో డిసెంబర్ మూడు తర్వాత క్లారిటీ రానుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…